థర్డ్ వేవ్.. థర్డ్ ఫ్రంట్.. ఏది నిజం..? ఏది కల్పితం..?

దేశంలో థర్డ్ ఫ్రంట్ మళ్లీ పురుడుపోసుకుంటోంది. దేశంలో థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తోంది. ఈ రెండిటిలో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ రెండూ హాట్ టాపిక్స్ గా…

దేశంలో థర్డ్ ఫ్రంట్ మళ్లీ పురుడుపోసుకుంటోంది. దేశంలో థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తోంది. ఈ రెండిటిలో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ రెండూ హాట్ టాపిక్స్ గా నిలుస్తున్నాయి. మరో 2 నెలల్లో ఈ రెండూ వస్తాయంటున్నారు కానీ, కచ్చితంగా వస్తాయని చెప్పలేకపోతున్నారు. 

రెండింటికీ రకరకాల కండిషన్లు చూపిస్తున్నారు. ఇలా జరిగితే అది రావొచ్చు, ఇలా జరిగితే ఇది రాకపోవచ్చు అని అంచనాలు వేస్తున్నారు. దీంతో ఇటు థర్డ్ వేవ్.. అటు థర్డ్ ఫ్రంట్ అంశాలు డిస్కషన్ పాయింట్స్ గా మారాయి.

ముందుగా థర్డ్ ఫ్రంట్ విషయానికొద్దాం…

బీజేపీయేతర, కాంగ్రెసేతర థర్డ్ ఫ్రంట్ కోసం దేశవ్యాప్తంగా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. నాయకుడు లేని కాంగ్రెస్ చుక్కానిలేని నావలా సాగుతోంది. హస్తం పార్టీ నాయకులందర్నీ బీజేపీ తమలో కలిపేసుకుంటోంది. ఈ దశలో కాంగ్రెస్ తో కలసి కూటమి కట్టడం ఏమాత్రం ప్రయోజనకరం కాదు. 

మరోవైపు ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ప్రాంతీయ పార్టీలు నిలువరించగలిగాయి. అంటే ప్రాంతీయ పార్టీలన్నీ కలిస్తే కేంద్రంలో కూడా కాషాయ దళాన్ని కట్టడి చేయొచ్చనేది వీరి ఆలోచన. అందుకే ఢిల్లీలోని శరద్ పవార్ ఇంట్లో మూడో ఫ్రంట్ మొదటి భేటీ జరిగింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ థర్డ్ ఫ్రంట్ కి బ్యాక్ బోన్ లా ఉన్నారని తెలుస్తోంది.

ప్రస్తుతానికి ఎన్సీపీ, నేషనలిస్ట్ కాన్ఫరెన్స్, ఆర్ఎల్డీ, ఆమ్ ఆద్మీ, సమాజ్ వాదీ పార్టీ, సీపీఎం, సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్ ఈ థర్డ్ ఫ్రంట్ కోసం రెడీగా ఉన్నాయి. మరి దక్షిణాదిన బలంగా ఉన్న టీఆర్ఎస్, వైసీపీ, బిజూ జనతాదళ్, డీఎంకే పరిస్థితి ఏంటి..? వారిని కలుపుకోకుండా థర్డ్ ఫ్రంట్ సక్సెస్ అవుతుందా? అసలు కాంగ్రెస్ లేకుండా వీరంతా జట్టుకడితే.. కూటమిలో కుదురుగా ఉంటారని చెప్పలేం. 

ముందు ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేస్తాం, ఆ తర్వాత కలివిడిగా బీజేపీని ఎదుర్కొంటామన్నా కుదిరే పనికాదు. అందుకే థర్డ్ ఫ్రంట్ ప్రస్తుతానికి ఆశల పల్లకి మాత్రమే. కాంగ్రెస్ సహా మిగతా పక్షాలను కలుపుకొని వెళ్తేనే బీజేపీని గద్దె దింపడం సాధ్యమవుతుంది.

ఇక థర్డ్ వేవ్ గురించి చూద్దాం..

కరోనా థర్డ్ వేవ్ అంచనాల్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతున్నారు. అసలు థర్డ్ వేవ్ రాదని, వచ్చినా పిల్లల్ని ఏమీ చేయదని కొంతమంది చెబుతున్నారు. థర్డ్ వేవ్ వస్తుందని, సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో అది తీవ్ర స్థాయిలో ప్రభావం చూపిస్తుందనే వారు కూడా ఉన్నారు. 

సెకండ్ వేవ్ లో డెల్టా వేరియంట్ ని భారత్ సమర్థంగా ఎదుర్కొందని, ఇప్పుడు థర్డ్ వేవ్ లో డెల్టా ప్లస్ వస్తోందని, దాన్ని మన టీకాలు అడ్డుకుంటాయో లేదో అనేది అనుమానమేనంటున్నారు. ఇలా థర్డ్ వేవ్ పై ఎయిమ్స్, ఐఐటీ పరిశోధనలు వెలుగులోకి వస్తున్నా.. దేన్నీ పూర్తిగా నమ్మే పరిస్థితి లేదు. ప్రస్తుతానికి థర్డ్ వేవ్ ఊహాజనితమే అయినా, సెకండ్ వేవ్ ని అనుభవించాం కాబట్టి, మూడోది కూడా నిజమే అనుకోవాలి. మరి దాని ప్రభావం ఎంతనేదే తేలాలి. 

థర్డ్ ఫ్రంట్ ఉనికిపై ఎన్ని అనుమానాలున్నాయో, ధర్డ్ వేవ్ ప్రభావంపై కూడా అన్నే ఊహాగానాలు ప్రస్తుతం చెలరేగుతున్నాయి. దేశంలో థర్డ్ ఫ్రంట్ బలపడితే, బీజేపీ ప్రభుత్వానికి కాలం దగ్గరపడినట్టే, అస్తవ్యస్థ ఆర్థిక విధానాలతో ఇబ్బంది పడుతున్న సగటు ప్రజానీకానికి ఊరట లభించినట్టే. ఇక థర్డ్ వేవ్ బలపడితే మాత్రం ప్రజలకు మరోసారి తిప్పలు తప్పవు. 

కేంద్రం థర్డ్ వేవ్ ని సమర్థంగా ఎదుర్కొని, ప్రాణనష్టం లేకుండా చేసి, ముందు చూపుతో అడుగులేస్తే.. థర్డ్ ఫ్రంట్ తో పనిలేకుండా చేయొచ్చు.