టీమిండియా కెప్టెన్ గా విరాట్ కొహ్లీ తీరును విమర్శించే వాళ్లకు మరో పదునైన ఆయుధం దొరికింది. కొహ్లీ కెప్టెన్ గా పనికిరాడంటూ విశ్లేషించే వాళ్లు చాలా మందే ఉన్నారు. వారికి కొహ్లీ ట్రాక్ రికార్డే ఆయుధంగా దొరుకుతూ ఉంది. విరాట్ నాయకత్వంలో టీమిండియా ఇప్పటి వరకూ ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా సాధించలేకపోవడం గమనార్హం.
విరాట్ కెప్టెన్సీలో టీమిండియా టీ20 ప్రపంచకప్, వన్డే వరల్డ్ కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వంటి వాటిలో పాల్గొంది. వాటిల్లో సెమిస్ దశకు కచ్చితంగా చేరుతూ వచ్చింది. అయితే ఒక్కసారంటే ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది టీమిండియా.
ఇక తాజాగా ఐసీసీ నిర్వహించిన వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ లో కూడా టీమిండియా ఆఖరి మ్యాచ్ లో బోల్తా పడింది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే టీమిండియా ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై విజయం సాధించగా, ఇప్పుడు న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలయ్యింది. ఐసీసీ ప్రారంభించిన డబ్ల్యూటీసీ తొలి విజేతగా న్యూజిలాండ్ నిలిచింది. అరుదైన ఘనతను టీమిండియా సొంతం చేసుకోలేకపోయింది.
గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఐసీసీ ట్రోఫీలేవీ కెప్టెన్ గా కొహ్లీకి కలిసి రాలేదు. ప్రతి దాంట్లోనూ సెమిస్, ఫైనల్ వరకూ చేరడం.. ఉత్త చేతులతో తిరిగి రావడం కొనసాగుతూ ఉంది. త్వరలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ సమయానికి కొహ్లీని కెప్టెన్ గా తప్పించాలనే డిమాండ్ కు నిన్నటి ఓటమి మరింత ఊతంగా మారవచ్చు.
కొహ్లీ స్థానంలో రోహిత్ శర్మకు ఆ అవకాశం ఇవ్వాలనే వాదన ఉంది. ఐపీఎల్ ట్రాక్ రికార్డును కూడా ఈ విషయంలో ప్రస్తావిస్తూ ఉంటారు. కొహ్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న బెంగళూరు జట్టు అనేక సీజన్లలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. అయితే రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై జట్టు మాత్రం వరసగా విజేతగా నిలుస్తోంది.
గొప్ప ఆటగాళ్లంతా కెప్టెన్ లుగా రాణించాలనే రూలేమీ లేదు. దిగ్గజ ఆటగాళ్లకు కూడా కెప్టెన్సీ కత్తిమీద సాముగా సాగింది. దాంతో వారు దాన్ని వదులుకోవడానికి వెనుకాడలేదు, కొందరు చేపట్టనే లేదు. మరి ఇన్నేళ్లు కెప్టెన్ గా ఉన్నా ఒక్కటంటే ఒక్క ట్రోఫీని కూడా సాధించలేకపోతున్నాడనే అపప్రదను మూటగట్టుకుంటున్న కొహ్లీ కనీసం పరిమిత ఓవర్ల ఫార్మాట్ కు అయినా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడో లేక ఇలాంటి విమర్శలను ఎదుర్కొంటూ తనే కెప్టెన్ గా ఉండాలనుకుంటాడో!