కరోనా వాక్సిన్‌ యిప్పట్లో రాదు

కరోనా పేరుతో ప్రసిద్ధి కెక్కిన కోవిడ్‌ 19 అంటువ్యాధి ప్రబలగానే నాపై ఒత్తిడి పెరిగింది. హెపటైటిస్‌-బి అనే కాలేయవ్యాధికి అత్యాధునికమైన, క్షేమదాయక బయోటెక్‌ వ్యాక్సిన్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి పరచి, హైదరాబాదులో శాంతా కర్మాగారంలో…

కరోనా పేరుతో ప్రసిద్ధి కెక్కిన కోవిడ్‌ 19 అంటువ్యాధి ప్రబలగానే నాపై ఒత్తిడి పెరిగింది. హెపటైటిస్‌-బి అనే కాలేయవ్యాధికి అత్యాధునికమైన, క్షేమదాయక బయోటెక్‌ వ్యాక్సిన్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి పరచి, హైదరాబాదులో శాంతా కర్మాగారంలో ఉత్పత్తి చేసి, ‘శాన్‌వాక్‌-బి’ ని సామాన్యుడికి అందుబాటు ధరలో తెచ్చి, ఆ వ్యాధి గురించి అందరికీ అవగాహన పెంచి, ఆ వ్యాక్సిన్‌ వాడకాన్ని వేల రెట్లు పెరిగేందుకు మా సంస్థ ద్వారా దోహదపడే అవకాశం నాకు దక్కింది. అందుకే యీ కొత్త వ్యాధి పేరు వినగానే అందరూ నా వైపు చూశారు. శాంతా బయోటెక్‌ ప్రస్థానం ‘శాన్‌వాక్‌’తో ఆగిపోకుండా కలరాతో సహా అనేక రకాల అంటువ్యాధులకు వ్యాక్సిన్‌లను, ఔషధాలను తయారుచేస్తూ జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుని, దేశంలో బయోఫార్మా విప్లవానికి నాంది పలకడంతో యీ అంటువ్యాధికి కూడా మేం వ్యాక్సిన్‌ కనిపెట్టేసి వుంటామని చాలా మంది అనుకున్నారు.

కొందరు ఛానెల్స్‌ వారు ‘ఎప్పుడండీ కరోనా వాక్సిన్‌?’ అని అడగ నారంభించారు. ‘ఇప్పుడే కదా ఆ రోగక్రిమి బయటపడి దాని స్వరూపస్వభావాలను అధ్యయనం చేస్తున్నారు. అప్పుడే ఎక్కడ వాక్సిన్‌?’ అని నేనంటే ‘లక్షలాదిమందికి అది మహమ్మారిలా వ్యాపిస్తూ వుంటే, ప్రపంచమంతా గజగజా వణుకుతూంటే, అందరూ అన్ని పనులూ మానుకుని యిళ్లల్లో తలుపులు మూసుకుని కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఆతృతగా అడుగుతున్నామం’టూనే ఖరీదు గురించి కూడా ఆరా తీశారు.

మీలో కొందరికైనా యిలాటి సందేహం మెదులుతూ వుంటుందనే ఉద్దేశంతో ముందే చెప్పేస్తున్నా – వాక్సిన్‌ తయారీ తేలికైన, త్వరగా తెమిలిపోయే వ్యవహారం కాదు. వ్యాధి వచ్చాక తగ్గేందుకు ముందుగా ఔషధాన్ని కనిపెడతారు. తర్వాతి మెట్టుగా అసలు రోగం రాకుండా నివారించడానికి వాక్సిన్‌ తయారు చేస్తారు. అన్నిటికంటె ముందు ఆ రోగం ఎలా వస్తుందో తెలుసుకోవాలి. దానికి కారకమైన క్రిమి జన్యుక్రమం ఏమిటి? దాని లక్షణాలేమిటి, ఏ పరిస్థితుల్లో పెచ్చరిల్లుతుంది, ఎలాటి చర్య వలన నివృత్తి చెందుతుంది.. యిలాటి వన్నీ పరిశీలించి, పరీక్షించి తెలుసుకున్నాకనే ఔషధం తయారుచేస్తారు. తయారుచేశాక జంతువులపై, మనుష్యులపై ప్రయోగించి చూసి, ఏ వయసువారికి ఏ మోతాదులో, ఎన్నాళ్లు వాడితే పనిచేస్తుందో నిర్ధారిస్తారు.

ఔషధ పటిమ నిల్వకాలం (‘షెల్ఫ్‌లైఫ్‌’) పెంచడానికై  మందులకు కొన్ని రసాయనాలు కలపవలసి వుంటుంది. వాటి కారణంగా అవాంఛిత ప్రభావాలు ‘సైడ్‌ ఎఫెక్ట్‌స్‌’ కలుగుతాయి. వాటిని తగ్గించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. క్వాలిటీ పరంగా ఉన్నతమైన ప్రమాణాలు పాటించాలి. ఈ ప్రక్రియను పర్యవేక్షించే ప్రభుత్వ యంత్రాంగం నుంచి, ప్రభుత్వ సంస్థల నుంచి లైసెన్సులు అవీ తెచ్చుకోవాలి. అప్పుడే ఆ రోగానికి మందు మనకు లభ్యమౌతుంది.

వాక్సిన్‌ విషయంలో యీ కసరత్తు మరింత ఎక్కువగా వుంటుంది. ఆ క్రిమిని ఒక జీవిలో ప్రవేశపెట్టి, దాన్ని ఎదుర్కోవడానికి ఆ జీవి తయారుచేసే యాంటీ-బాడీలు (రక్షకకణాలు) సేకరించి, వాటిని విడిగా తీసి, పరిమాణంలో విపరీతంగా పెంచి, టీకా తయారుచేయాలి. తర్వాత ఎలకలు, కుందేళ్లు వంటి జంతువులపై ప్రయోగించి, అవి విజయవంతమైతే ఆరోగ్యవంతులైన విభిన్న రకాలైన మనుష్యులపై ( పిల్లలు , స్త్రీలు, పురుషులు వగైరా) ప్రయోగించి చూడాలి. ఔషధం విషయంలో అయితే వ్యాధి తగ్గిందో లేదో వెంటనే తెలిసిపోతుంది. వాక్సిన్‌ విషయంలో అయితే వ్యాధి మామూలుగానే సోకలేదో, దీని కారణంగా సంక్రమించకుండా ఉందో తెలుసుకునేందుకు సమయం పడుతుంది. ఆ తర్వాత ఔషధం విషయంలో వున్న దశలన్నీ దాటుకుని ప్రజల వద్దకు రావాలి.

ఇవన్నీ ఏ వ్యాధికైనా వర్తిస్తాయి. ఇప్పుడీ కోవిడ్‌ 19 విషయానికి వస్తే ఔషధాన్నే యింకా కనుక్కోలేదు. మలేరియాకు వాడిన రెట్రోవైరల్‌ మందుల్ని వాడి చూస్తున్నారు. వాటివలన కొందరికి రోగక్షణాలు ఉపశమిస్తున్నాయి తప్ప రోగం నయం అయిందని అనుకోవడానికి లేకుండా ఉంది. వాటిని కాస్త అటూయిటూ చేసి (టింకరింగ్‌) కోవిడ్‌ 19కు మందు కనిపెట్టవచ్చు. ఇదింకా ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌ దశలోనే వుంది. అర్జునుడి బాణం పక్షి కన్నుకి తగలటం లేదు. ఏ ముక్కుకో తగులుతోంది.

ప్రపంచంలోని 40 దేశాల శాస్త్రజ్ఞులందరూ ఒక్కుమ్మడిగా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించి ప్రభుత్వాలు విధివిధానాలలో (ప్రొటోకాల్‌)కు సడలింపు యిచ్చి త్వరలో అందుబాటులోకి తేవచ్చు. ఔషధం పరిస్థితే అలా వున్నపుడు యిక టీకా సంగతి ఊహించుకోవచ్చు. నాకున్న పరిమిత పరిజ్ఞానం, అనుభవం బట్టి, అది మార్కెట్‌లోకి వచ్చేసరికి రెండేళ్లు పట్టవచ్చు. సడలింపు యిచ్చేసి, రిస్కు తీసుకునైనా వ్యాక్సిన్‌ను మార్కెట్లో విడుదల చేసేసి, కావాలంటే తర్వాత సవరణలు చేసుకుందాం అని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ అనుకుంటే ఏ 18 నెలలో కనీసం పట్టవచ్చు. అది అందరికీ అందుబాటు ధరలో లభించినప్పుడే దానివలన విస్తృత ప్రయోజనం కలుగుతుంది.

ఎప్పుడు వస్తుందో, ఎలా తయారవుతుందో, తెలియనప్పుడు దాని ధర గురించి యిప్పుడే మాట్లాడడం అవివేకం అవుతుంది. అందువలన ‘శాంతా’ వరప్రసాద్‌లా కాకుండా మీలో ఒకడిగా, ఒక పౌరుడిగా నా భావాలు పంచుకోవడానికి యీ మాధ్యమాన్ని ఉపయోగించుకుంటున్నాను. నా ఉద్దేశం ప్రకారం ఈ కోవిడ్‌యే కాదు, మరే అంటువ్యాధికైనా వాక్సిన్‌ మన చేతిలోనే వుంది. టీకా కనుక్కునేలోగా వైరస్‌ తన స్వభావాన్ని మార్చుకోవచ్చు. ఆంథ్రాక్స్‌, జికాలకు టీకాలు యింకా కనుక్కోనేలేదు. స్వైన్‌ ఫ్లూ టీకాకి రెండేళ్లు పట్టింది. దీని వాక్సిన్‌ వచ్చేలోగానే రోగ ఉధృతి తగ్గుతుంది, మనకు దాన్ని తట్టుకునే శక్తి (హెర్డ్‌ ఇమ్యూనిటీ) కలుగుతుంది. కానీ వైరస్‌ మరో రూపంలో తలెత్తుతుంది. డెంగ్యూ, చికెన్‌ గున్యా వంటి కొన్ని వైరస్‌లు కీళ్లపై తమ తడాఖా చూపితే యిది ఊపిరితిత్తులకు ఎసరు పెట్టింది కాబట్టి భయపడ వలసివస్తోంది. మరొకటి గుండెకే గురి పెట్టవచ్చు. అందువలన అన్నిటికి కలిపి ఒక వాక్సిన్‌ చేతిలో వుండడం మేలు.

వాక్సిన్‌ అంటే ఏమిటి? రోగనివారణకు సాధనం. అదేదో ఇంజక్షన్‌ రూపంలోనో, చుక్కల రూపంలో మాత్రమే వుంటుందని ఎందుకనుకోవాలి? మన చేతుల్లో, చేతల్లో కూడా వుండవచ్చుగా! మన ఒంట్లో, యింటిలో, వంటింటిలో ఉండవచ్చుగా! మన నడతలో, జీవనశైలిలో వుండవచ్చుగా! ఆ దిశగా ఆలోచింప చేయడానికే యీ ప్రయత్నం.
ముందుగా యీ కరోనా విపత్తు ఎదుర్కోవడానికి అహరహం శ్రమిస్తున్న వైద్యులకు, ఆరోగ్యసిబ్బందికి, సంబంధిత ఉద్యోగులందరికీ, అదుపు తప్పుతున్నవారిని వారి క్షేమం కోసమే అదలిస్తున్న పోలీసులకు, ఎన్నో యిబ్బందులను సహించి, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అత్యవసర సర్వీసులను అందిస్తున్న వారందరికీ నమోవాకాలు అర్పిస్తున్నాను. అదే సమయంలో తమ విదేశీ పర్యటనల సమాచారం దాచివేస్తూ, పరీక్షలు చేయించుకోవడానికి నిరాకరిస్తూ, నారాయణరూపాలైన వైద్యులతో కలహిస్తూ, బెదిరిస్తూన్న వారందరినీ గర్హిస్తున్నాను. వీరిలో ఉన్నతాధికారులు, ఉన్నతవర్గాల వారు కూడా వుండడం చూసి నిర్ఘాంతపోతున్నాను.  

మహమ్మారి కాదు… భద్రకరి !

ముందుకు సాగేముందు ఒక విషయం స్పష్టంగా చెప్పదలిచాను. ఈ కరోనాను ఒక మహమ్మారిగా మాత్రమే చూసి దానిపై ఆగ్రహం వ్యక్తం చేయకండి. ఎందుకు వచ్చిందని కుమిలిపోకండి, భయపడకండి. జాగ్రత్త వుండాలి తప్ప భీతి వుండకూడదు. ప్రతీ విపత్తు మనకు ఒక అవకాశంగానే పరిణమిస్తుంది. ప్రపంచయుద్ధాలు వచ్చినపుడు ఎన్నో సాంకేతిక ఆవిష్కరణలు జరిగాయి. ఇలాటి మూకుమ్మడి అంటువ్యాధులు ప్రబలినపుడే మందులు, టీకాలు కనిపెట్టగలిగారు. ఇది ప్రకృతి మనకు విసిరే సవాలు. దీన్ని అందుకుని ఆయుధంగా మలచుకోవాలి. గుర్తు పెట్టుకోవాల్సిన దేమిటంటే ప్రకృతి సతతం మనల్ని రక్షిస్తూనే వుంటుంది. దారి తప్పినపుడు చెవి మెలేసి పాఠాలు చెపుతుంది. లేకపోతే మనలో గర్వం పెరిగి, ప్రకృతితో చెలగాటమాడడం మొదలెడతాం.

ధర్మానికి గ్లాని కలిగినపుడు అవతారమెత్తి ధరిత్రిని కాపాడతానన్నాడు గీతాకారుడు. ఆ అవతారం మత్స్యమో, వరాహమో కానక్కరలేదు. గబ్బిలం ద్వారా సంక్రమించే క్రిమికీటకమే కావచ్చు. ఏ రూపంలో వచ్చినా మనకు గుణపాఠం చెప్పడానికే వచ్చిందనే భావించాలి. ఇప్పుడు కరోనా మన కాళ్లూ, చేతులూ కట్టేసి, యింట్లో కూలేసి మరీ పాఠాలు చెపుతోంది. దీని దృష్టిలో గొప్పా, బీదా తేడా లేదు, ప్రధాని భార్య, పనిమనిషి భర్త అనే భేదం లేదు. అమెరికా, ఆఫ్రికా అనే వ్యత్యాసం చూపటం లేదు. అభివృద్ధి చెందాయనుకున్న దేశాలు, చెందుతున్నా యనుకున్న దేశాలు, ఎప్పటికీ చెందవని మాటపడ్డ దేశాలు – అందరికీ సమంగా వడ్డిస్తోంది. బలవంతుల మాకేమని అహంకరించిన వారికి మరి కాస్త ఎక్కువగానే వడ్డిస్తోంది. అమెరికాను చూస్తున్నాంగా!

కరోనా ప్రపంచం మొత్తాన్ని ఒక ‘కరక్షన్‌ మోడ్‌’లోకి తెచ్చి కూర్చోపెట్టింది. ‘తమ ప్రజల్ని కాపాడుకోలేక టీకాల కోసం, మందుల కోసం మా దగ్గర ముష్టెత్తే దేశం, మేం టెక్నాలజీ ఊరికే యిచ్చినా అర్థం చేసుకోలేని దేశం’ అని యీసడించిన దేశాన్నే ‘మందులిచ్చి మా ప్రజలను కాపాడండి’ అని నయానా భయానా అడిగేట్లా అగ్రదేశాల మెడలు ఒంచింది. మానవాళిని సరిదిద్దడానికి యీ రూపంలో వచ్చింది. విచ్చలవిడిగా విహరించే ప్రజల పాలిట చిచ్చరపిడుగై హడలెత్తించింది. తరతరాలనాటి సంప్రదాయమే సంక్షోభాన్ని దాటే తరణోపాయం అని నొక్కి చెప్పింది. ఇది మహమ్మారి కాదు, అనాచారాల పట్ల కన్నెర్ర చేసి, తన బిడ్డల్ని అదలించి, అంతిమంగా కాపాడే భద్రకరి అమ్మవారు!

దీని నుంచి ఏ యే దేశం ఏ యే గుణపాఠాలు నేర్చుకుంటుందో, వాటిని ఎంతవరకు అమలు చేస్తుందో మనకు తెలియదు కానీ మన దేశానికి సంబంధించి మనం ఏం చేయాలో మాట్లాడుకుందాం. ఇవేమీ కొత్త విషయాలు కావు. పాతవే పునశ్చరణ చేసుకుంటున్నామంతే. ‘గతంలోకి ముందడుగు’ అనే పేరడాక్స్‌ వుంది. మనం ముందుకి వెళ్లాలంటే, ప్రగతి సాధించాలంటే ఓ సారి వెనక్కి తొంగి చూడాల్సిందే. చాదస్తం అని అటకెక్కించిన వాటిని దింపి, దుమ్ముదులిపి మళ్లీ అలవాటు చేసుకోవలసినదే. కరోనా పుణ్యమాని మన ‘నమస్తే’ సంప్రదాయానికి అందరూ దణ్ణాలు పెడుతున్నారు. ఈ సంక్షోభం నుంచి అతి తక్కువ నష్టాలతో మనం బయటపడితే, మన తక్కిన అలవాట్లపై కూడా దృష్టి సారించి, వాటిని సొంతం చేసేసుకోగల ఘనులు వారు. ఇప్పటికే యోగాను అలవర్చేసుకున్నారు. అందువలన వారి కంటె ముందే మనం మేల్కొందాం. (సశేషం)

– డా. కె.ఐ. వరప్రసాద్‌ రెడ్డి
వ్యవస్థాపక ఛైర్మన్‌, శాంతా బయోటెక్నిక్స్‌ లి.