దేశవ్యాప్తంగా మే-3 వరకు లాక్ డౌన్ కొనసాగించాలంటూ ప్రధాని మోదీ ప్రకటించిన వేళ.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. వాస్తవానికి ఈరోజుతో లాక్ డౌన్ గడువు ముగిసింది. అయితే దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతుండటంతో.. ప్రధాని మోదీ కఠిన నిర్ణయం వైపే మొగ్గు చూపారు. మరో 19 రోజులు అంటే, మే-3 వరకు లాక్ డౌన్ కొనసాగించాలని నిర్ణయించారు.
మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా లాక్ డౌన్ కొనసాగిస్తేనే బాగుంటుందని ఆలోచించారు. కానీ జగన్ మాత్రం జోన్ల వారీగా వెసులుబాటు ఇవ్వాలని కోరారు. ఏపీ విషయానికొస్తే.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అసలు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గడచిన 21 రోజుల్లో కూడా ఆ రెండు జిల్లాలు కరోనా బారిన పడలేదు. మరి అలాంటి చోట్ల లాక్ డౌన్ కొనసాగించడం అసంబద్ధం, అనవసరం కూడా.
ఈ విషయాలను దృష్టిలో ఉంచుకునే సీఎం జగన్ జోన్లవారీగా ఆంక్షలు విధించాలని ప్రధానిని గత వీడియో కాన్ఫరెన్స్ లో కోరారు. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులకు రవాణా సౌకర్యం కల్పించకపోతే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థం అయిపోతుంది. ఉద్యోగస్తులకు ఈఎంఐల వెసులుబాటు ఉండొచ్చు కానీ, రైతులకు, రోజు కూలీలకు ప్రభుత్వం ఇచ్చే అరకొర సాయం ఏమాత్రం సరిపోదు. మిగతా చోట్ల కరోనా ఉందనే నెపంతో.. దాని ప్రభావం లేని ప్రాంతాలను కూడా లాక్ డౌన్ లో మగ్గేట్లు చేయడం తెలివైన నిర్ణయం కాదు. అందుకే జగన్ ముందు చూపుతో ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
అయితే ప్రధాని మోడీ మాత్రం మే-3 వరకు లాక్ డౌన్ కొనసాగించాలని నిర్ణయించారు. ఏప్రిల్ 20 వరకు కఠినంగా ఉండాలని, ఆ తర్వాత పరిస్థితిని అంచనా వేసి ముందుకెళ్లాలని మోదీ నిర్ణయించినా.. ప్రమాదం ఎక్కడుందో అక్కడే నిబంధనలు కఠినతరం చేయడం అవసరం. మిగతా చోట్ల అంత భయపడాల్సిన పరిస్థితి ఉండదు.
కంటైన్మెంట్ జోన్లలోని వారిని బయటకు రాకుండా చూడటం, వారికి నిత్యావసరాలు ఉచితంగా పంపిణీ చేయడం వంటివి చేస్తే వారికి ఊరటనిచ్చినట్టే. మరి ఏపీ సీఎం జగన్ ప్రధాని నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తారా..? లేక రాష్ట్రంలో తన సొంత ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తారా..? వేచి చూడాలి.