గుంటూరులో కరోనా ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి రోజూ జిల్లాలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో గుంటూరులో కరోనా కేసులు వంద దాటాయి. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు నిర్వహించిన పరీక్షల్లో గుంటూరులో కొత్తగా మరో 16 కేసులు వెలుగుజూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 109కు చేరింది.
ఇప్పటికే గుంటూరులో పూర్తిస్థాయిలో కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. రెడ్ జోన్లలో ఇళ్ల నుంచి ప్రజల్ని బయటకు రానివ్వడం లేదు. రెడ్ జోన్లలో పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించిన అధికారులు.. ప్రణాళిక ప్రకారం పరీక్షలు చేస్తున్న కారణంగా పాజిటివ్ కేసులు బయటకొస్తున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో తమ అనుమానాలన్నీ నిజం అవుతున్నాయని చెబుతున్నారు. తాజా పరిణామాలతో గుంటూరులో రెడ్ జోన్లతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఆంక్షల్ని మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు.
ఓవరాల్ గా చూసుకుంటే.. ఈరోజు ఉదయం 9 వరకు నిర్వహించిన పరీక్షల్లో మొత్తంగా 34 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. వీటిలో గుంటూరు నుంచి 16, కృష్ణలో 8, కర్నూల్ లో 7, అనంతపురంలో 2, నెల్లూరులో ఒక కేసు నమోదయ్యాయి. వీటితో కలుపుకొని రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 473కు చేరింది. డిశ్చార్జ్ అయిన వాళ్లను, మృతుల్ని మినహాయిస్తే.. ప్రస్తుతం 450 మంది వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతం కరోనా కేసుల విషయంలో గుంటూరు ముందు వరుసలో ఉండగా.. తర్వాత స్థానాల్లో కర్నూల్ (91), నెల్లూరు (56), కృష్ణా (44) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అటు విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో పరిస్థితి ప్రస్తుతానికి అదుపులో ఉన్నట్టు ప్రకటించారు అధికారులు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను పొడిగించిన నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో కరోనా కేసులు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.