భార్యపై అనుమానం పెంచుకున్న ఆ భర్త, ఆమెను సజీవంగా దహనం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. మృతురాలిని అంజలిగా గుర్తించిన పోలీసులు.. భర్తను అదుపులోకి తీసుకున్నారు.
షాహి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గొటియా గ్రామంలో కొన్నేళ్లుగా కలిసి నివశిస్తున్నారు నేపాల్ సింగ్, అంజలి. అయితే కొన్ని రోజులుగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు నేపాల్ సింగ్. తను ఇంట్లో లేని సమయంలో తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోందనేది అతడి అనుమానం.
ఆ అనుమానం అలా పెనుభూతంగా మారింది. దీంతో భార్యను గడ్డివాములో పెట్టి తగలబెట్టాడు. దీన్ని చూసిన గ్రామస్తులు, వెంటనే అప్రమత్తమయ్యారు. మంటల్ని ఆర్పి, అంజలిని బయటకు తీశారు. అయితే అప్పటికే ఆమె చనిపోయింది. శరీరం సగానికి పైగా కాలిపోయింది.
గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసుసు, నేపాల్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని, ఆమెను సజీవ దహనం చేసినప్పుడు కూడా అక్కడ మరో వ్యక్తి ఆమెతో చనువుగా ఉన్నాడని వాదిస్తున్నాడు నేపాల్ సింగ్.