కేసీఆర్ చ‌ప్పుడు చేస్తే ఒట్టు

మ‌రో సారి థ‌ర్డ్ ఫ్రంట్ ఊహాగానాలు దేశ వ్యాప్తంగా రాజ‌కీయ క‌ల‌క‌లం రేపుతున్నాయి. నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శ‌ర‌ద్ ప‌వార్ నివాసంలో నిర్వ‌హించిన అఖిల‌ప‌క్ష స‌మావేశానికి 8 పార్టీల నేత‌లు హాజ‌ర‌య్యారు.…

మ‌రో సారి థ‌ర్డ్ ఫ్రంట్ ఊహాగానాలు దేశ వ్యాప్తంగా రాజ‌కీయ క‌ల‌క‌లం రేపుతున్నాయి. నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శ‌ర‌ద్ ప‌వార్ నివాసంలో నిర్వ‌హించిన అఖిల‌ప‌క్ష స‌మావేశానికి 8 పార్టీల నేత‌లు హాజ‌ర‌య్యారు. హాజ‌రైన రాజ‌కీయ నేత‌ల్లో సుశీల్‌ గుప్తా (ఆప్‌),  నీలోత్పల్‌ బసు (సీపీఎం), ఒమర్‌ అబ్దుల్లా (నేషనల్‌ కాన్ఫరెన్స్‌), జయంత్‌ ఛౌధురి( ఆర్‌ఎల్డీ), ఘన శ్యామ్‌ తివారీ ( ఎస్పీ), బినయ్‌ విశ్వం ( సీపీఐ), మాజీ రాయబారి కేసీ సింగ్‌, గీత రచయిత జావెద్‌ అఖ్తర్‌ తదితరులున్నారు.

కానీ ఈ స‌మావేశం మూడో ఫ్రంట్ కోసం ఏర్పాటు చేసింది కాద‌ని నిర్వాహ‌కులు తేల్చి చెప్పారు. కాదంటున్న‌ప్ప‌టికీ, మోదీ వ్య‌తిరేక కూట‌మి ఏర్పాటుకు లోలోప‌ల ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం అయ్యాయ‌ని స‌మాచారం. మ‌రోవైపు వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీకి బ‌ల‌మైన ప్ర‌త్యామ్నాయ కూట‌మి ఆవిర్భావానికి తొలిమెట్టుగా ఈ స‌మావేశాన్ని అభివ‌ర్ణిస్తున్నారు. ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తెచ్చేందుకు ఇది తొలి అడుగు అని శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్ చెప్ప‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

మహారాష్ట్రలో మాదిరిగా (మహారాష్ట్ర వికాశ్‌ అఘాడి-ఎంవీఏ) బీజేపీకి వ్యతిరేకంగా కేంద్రంలోనూ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు జరగాలని శివసేన అభిప్రాయపడ‌డం విశేషం. మహారాష్ట్రలోలాగే  2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ సంకీర్ణ కూటమి ప్రయోగానికి ప్రతిఒక్కరూ ఎదురు చూస్తున్నారని శివసేన అధికారిక‌ పత్రిక సామ్నా సంపాదకీయాన్ని రాయ‌డం పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. మ‌రోవైపు థ‌ర్డ్ ఫ్రంట్ ఊహాగానాల నేప‌థ్యంలో అంద‌రి దృష్టి టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై ప‌డింది.

గ‌త నాలుగేళ్లుగా దేశంలో బీజేపీ, కాంగ్రెసేత‌ర జాతీయ ఫ్రంట్‌ను ఏర్పాటు ప్ర‌య‌త్నాలు, అలాగే దానికి తానే నాయ‌క‌త్వం వ‌హిస్తాన‌ని ప‌లు సంద‌ర్భాల్లో కేసీఆర్ గంభీర ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల ముంగిట బీజేపీ, కేంద్ర ప్ర‌భుత్వంపై ఓ రేంజ్‌లో కేసీఆర్ విరుచుకుప‌డ‌డాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. త్వ‌ర‌లో హైద‌రాబాద్‌లో దేశంలోని వివిధ రాజ‌కీయ ప‌క్షాల‌తో స‌మావేశం ఏర్పాటు చేసి, మోదీ స‌ర్కార్‌పై యుద్ధానికి శంఖారావం పూరిస్తాన‌ని కేసీఆర్ చేసిన ప్ర‌తిజ్ఞ ఏమైంద‌నే ప్ర‌శ్న‌లు ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో వెల్లువెత్తుతున్నాయి.

నిజమైన ఫెడరల్ వ్యవస్థ కావాల‌ని, రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం పోవాల‌ని, రాష్ట్రాలకు విస్తృత అధికారాలు ఉండాలంటే థర్డ్.. ఫోర్త్ కాదు.. తాము  ప్రజల ఫ్రంట్  ఏర్పాటు చేస్తామ‌ని గ‌తంలో కేసీఆర్ ఆర్భాటంగా చేసిన ప్ర‌క‌ట‌న‌లు ఇప్పుడు రాజ‌కీయ తెర‌పైకి వ‌చ్చాయి. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసమే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నట్టు పదేప‌దే చెబుతూ వ‌చ్చిన కేసీఆర్ …ఇప్పుడెందుకు ఉలుకు ప‌లుకు లేకుండా మౌనాన్ని ఆశ్ర‌యించార‌నే నిల‌దీత‌లు వ‌స్తున్నాయి.

దేశ ప్రజలను ఏకంచేయడం, యువతకు ఉపాధినివ్వడం, ఆర్థిక పరిపుష్టిని కలిగించడం తాము ఏర్పాటు చేయ‌బోయే ప్ర‌జాఫ్రంట్ ల‌క్ష్య‌మ‌ని సూక్తులు వ‌ల్లించిన కేసీఆర్‌, ఇప్పుడు చ‌ప్పుడు చేయ‌లేదెందుకునే ప్ర‌శ్న‌లు సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మ‌వు తున్నాయి. ఒక‌ప్పుడు ప్ర‌జాఫ్రంట్ ఏర్పాటు పేరుతో చెన్నై వెళ్లి దివంగ‌త డీఎంకే అధినేత క‌రుణానిధి, ఆయ‌న త‌న‌యుడు ప్ర‌స్తుత త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్‌తో చ‌ర్చించిన సంగ‌తిని గుర్తు చేస్తున్నారు.  

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్‌, కేర‌ళ ముఖ్య‌మంత్రి విజ‌య‌న్‌, ఇతర పార్టీల ప్రముఖులతో  చ‌ర్చించామ‌ని కేసీఆర్ చెప్పి ఏళ్లు గ‌డుస్తున్నా…ఆయ‌న‌ నేతృత్వంలోని మోదీ వ్య‌తిరేక ఫ్రంట్ మాత్రం అతీగ‌తీ లేదు. 

ఇప్ప‌టికైనా ప్ర‌జాఫ్రంట్ ఏర్పాటుకు శ్రీ‌కారం చుట్టి తెలుగు వారి పౌరుషం ఏంటో దేశానికి చూపాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని కేసీఆర్‌కు ప‌లువురు గుర్తు చేస్తున్నారు. అయ్యా కేసీఆర్ గారూ…వినిపిస్తోందా?