తెలంగాణ సర్కార్ భలే కామెడీ చేస్తోంది. కేసీఆర్ సర్కార్ తాజాగా జారీ చేసిన జీవో 40ను చూస్తే జబర్దస్త్ కామెడీ షో గుర్తుకొస్తే …అది కేసీఆర్ సర్కార్ తప్పిదం ఎంత మాత్రం కాదని గుర్తించుకోవాలి. ఇంతకూ ఆ జీవో 40 కథాకమామీషూ ఏంటి? అందులో కామెడీ ఏముందో తెలుసుకుందాం.
కరోనా ట్రీట్‌మెంట్ పేరుతో దేశ వ్యాప్తంగా అన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు రోగుల్ని పీల్చి పిప్పి చేశాయి, ఇంకా కొద్దోగొప్పో అక్కడక్కడ చేస్తూనే ఉన్నాయి. కరోనా రోగుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేయడం తమ హక్కుగా ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల యజమానులు భావిస్తున్నారు. రోగాన్ని బట్టి ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షలు, రూ.20 లక్షలకు పైమాటే తప్ప, అంతకు తక్కువ వసూలు చేసిన దాఖలాలు లేవు.
మరోవైపు తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై ఆ రాష్ట్ర హైకోర్టు సీరియస్ అయ్యింది. కొన్ని కేసుల విషయంలో స్వయంగా హైకోర్టు జోక్యం చేసుకుని కొందరికి తిరిగి భారీ మొత్తంలో ఫీజుల్ని ఇప్పించింది. అలాగే ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫీజులపై తమకు వివరాలు సమర్పించాలని అనేక మార్లు హైకోర్టు ఆదేశించినా ఫలితం లేకపోయింది.
ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు కరోనా చికిత్సలు, పరీక్షల గరిష్ట ధరలను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఖరారు చేసింది. ఈ మేరకు కరోనా చికిత్స చార్జీలపై వైద్యారోగ్య శాఖ జీవో 40 జారీ చేసింది.
ఈ జీవో ప్రకారం సాధారణ వార్డులో ఐసోలేషన్, పరీక్షలకు రోజుకు గరిష్టంగా రూ. 4 వేలు, ఐసీయూ వార్డులో రోజుకు గరిష్టంగా రూ. 7,500 వసూలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ గదికి రోజుకు గరిష్టంగా రూ. 9 వేలు ఖరారు చేశారు. పీపీఈ కిట్ ధర రూ. 273కు మించరాదని తెలిపింది.
హెచ్ఆర్‌సీటీ – రూ. 1995, డిజిటల్ ఎక్స్‌రే – రూ. 1300, ఐఎల్6 – రూ. 1300, డీ డైమర్ పరీక్ష – రూ. 300, సీఆర్‌పీ – రూ. 500, ప్రొకాల్ సీతోసిన్ – రూ. 1400, ఫెరిటిన్ – రూ. 400, ఎల్ డీహెచ్ – రూ. 140గా ఖరారు చేశారు. సాధారణ అంబులెన్స్‌కు కనీస చార్జి రూ. 2 వేలు, కిలోమీటర్‌కు రూ. 75, ఆక్సిజన్ అంబులెన్స్‌కు కనీస ఛార్జి రూ. 3 వేలు, కిలోమీటర్‌కు రూ. 125 చొప్పున ఖరారు చేశారు.
ఇదే పని రెండు నెలల క్రితం చేసి వుంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషించేవాళ్లు. ఎందుకంటే అప్పుడు కరోనా సెకెండ్ ఉధృతి ఎక్కువగా ఉండింది. ఆ టైంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం గగనమైంది. దీంతో రోగుల డిమాండ్‌ను సొమ్ము చేసుకు నేందుకు ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టానుసారం డబ్బు వసూలు చేశాయి.
కనీసం అంటే రూ.10 లక్షలు, గరిష్టంగా రూ.50 లక్షలు-రూ.60 లక్షలు చెల్లించినా చివరికి మనిషి ప్రాణంతో దక్కని ఘటనల గురించి కథలుకథలుగా విన్నాం. గుండెల్ని పిండేసే హృదయ విదారక జీవితాల గురించి తెలుసుకున్నాం.
ఇప్పుడు కరోనా సెకెండ్ వేవ్ దాదాపు తగ్గిపోవడంతో తెలంగాణలో పూర్తిగా లాక్‌డౌన్ ఎత్తేశారు. విద్యా సంస్థలు కూడా తెరవాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫీజుల దోపిడీని అరికట్టేందుకంటూ జీవో 40 జారీ చేయడం దేనికనే ప్రశ్నలు, విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
అవసరం లేని సమయంలో ఇలాంటి జీవోల జారీతో ఏం ప్రయోజనమనే నిలదీతలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకంటే పెద్ద జోక్ ఏమైనా ఉంటుందా? అనే వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. వీటన్నింటికి కేసీఆర్ సర్కార్ సమాధానం చెప్పాల్సి వుంది.