జ‌గ‌న్ ప‌ర‌ప‌తి పెరుగుతున్న‌ప్పుడ‌ల్లా…

ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్‌కు ఇమేజ్ వ‌స్తోంద‌ని ప‌సిగ‌ట్టిన‌ప్పుడ‌ల్లా, అడ్డుకోడానికి ఏదో ఒక ర‌కమైన అంశాన్ని నెత్తికెత్తుకుని ముందుకు రావ‌డంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు దిట్ట‌. ఈయ‌న గ‌ళానికి శ్రుతి క‌లిపే ఎల్లో మీడియా ఉండ‌నే ఉంది.…

ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్‌కు ఇమేజ్ వ‌స్తోంద‌ని ప‌సిగ‌ట్టిన‌ప్పుడ‌ల్లా, అడ్డుకోడానికి ఏదో ఒక ర‌కమైన అంశాన్ని నెత్తికెత్తుకుని ముందుకు రావ‌డంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు దిట్ట‌. ఈయ‌న గ‌ళానికి శ్రుతి క‌లిపే ఎల్లో మీడియా ఉండ‌నే ఉంది. మ‌రోవైపు సంక్షేమ ప‌థ‌కాల అమ‌ల్లో జ‌గ‌న్ స‌ర్కార్ చిత్త‌శుద్ధితో వ్య‌వ‌హ‌రిస్తోంది. 

క‌రోనా లాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌వుతున్నా …లెక్క చేయ‌కుండా సంక్షేమ ప‌థ‌కాల‌ను ప‌క‌డ్బందీగా అమ‌లు చేస్తున్న ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్‌కు మంచి పేరు వ‌స్తోంది. తాజాగా 45 ఏళ్లు పైబ‌డి, 60 ఏళ్ల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మ‌హిళ‌ల‌కు వైఎస్సార్ చేయూత ప‌థ‌కం కింద వ‌రుస‌గా రెండో ఏడాది రూ.18,750 చొప్పున ఇవ్వ‌డం స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

మ‌రో వైపు గ‌త ఆదివారం క‌రోనా వ్యాక్సినేష‌న్ స్పెష‌ల్ డ్రైవ్ చేప‌ట్టి, అంచ‌నా కంటే మించి దాదాపు 14 ల‌క్ష‌ల మందికి టీకాలు వేశారు. దేశ స్థాయిలో ఇదో అరుదైన రికార్డు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఈ బృహ‌త్త‌ర వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌కు ప్ర‌శంస‌లు వెల్లువెత్తాయి. మెగాస్టార్ చిరంజీవి ట్విట‌ర్ వేదిక‌గా జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ఇలా అనేక అంశాలు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో సానుకూల వైఖ‌రి కొన‌సాగ‌డానికి దోహ‌దం చేస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెంచ‌డానికి చంద్ర‌బాబు తాజాగా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై చేసిన విమ‌ర్శ‌ల‌ను రాజ‌కీయ విశ్లేష‌కులు ప్ర‌స్తావిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో ఆన్‌లైన్‌లో నిర్వ‌హించిన సమావేశంలో చంద్ర‌బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమం పేరుతో మోసం జరుగుతోందని ఆరోపించారు. గోరంత ఇస్తూ కొండంత దోచేస్తూ సాగిన రెండేళ్ల పాలనలో సీఎం జగన్‌ హోల్‌సేల్‌గా అవినీతికి పాల్పడుతున్నారని మండిప‌డ్డారు.

జ‌గ‌న్‌ అవినీతిని సాక్ష్యాలతో సహా నిరూపిస్తామని చంద్ర‌బాబు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. అబద్ధాల పాలనతో యువత భవిష్యత్తు ప్రమాదంలో పడింద‌ని బాబు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యం లేక రాష్ట్రంలో నిరుద్యోగులు పెరిగార‌న్నారు. జాబ్‌ క్యాలెండరు పేరిట ఉద్యోగాలు లేని క్యాలెండరును విడుదల చేశారని బాబు ఆరోపించారు.  

కొవిడ్‌ నియంత్రణ, వ్యాక్సిన్ల పంపిణీలో జగన్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చంద్రబాబు ధ్వ‌జ‌మెత్తారు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు, నిరుద్యోగుల గురించి చంద్ర‌బాబు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్టుగా ఉంటుంద‌నే విమ‌ర్శ‌లున్నాయి.

జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌ల‌ను ప‌రిశీలిస్తే చంద్ర‌బాబు ఎంత అక్క‌సుతో ఉన్నారో అర్థం చేసుకోవ‌చ్చు. చంద్ర‌బాబు పాల‌న‌లో ల‌బ్ధిదారుల ఎంపిక ప్ర‌క్రియ జ‌న్మ‌భూమి క‌మిటీలు చూసేవి. కేవ‌లం టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను మాత్ర‌మే ఎంపిక చేసేవి. కానీ జ‌గ‌న్ పాల‌న‌లో పార్టీలు, కులమ‌తాల‌కు అతీతంగా ఆర్థిక ప‌రిస్థితే ప్రామాణికంగా ల‌బ్ధి దారుల ఎంపిక జ‌రుగుతోంది. దీన్ని ఎవ‌రూ కాద‌న‌లేని స‌త్యం. నిజంగా అర్హులైన వారుంటే త‌ప్ప‌క ల‌బ్ధి చేకూరుతుంది. అందుకే జ‌గ‌న్ పాల‌న ప‌ట్ల సామాన్య ప్ర‌జ‌లు హ్యాపీగా ఉన్నారు.  

ఇంత వ‌ర‌కూ జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌ను చంద్ర‌బాబు మ‌భ్య పెడుతూ వ‌చ్చారు. ఇప్పుడు ఆ కాల ప‌రిమితి కూడా దాటిపోయింది. దీంతో స‌రికొత్త రాగాన్ని అందుకుంటున్నారు. ఇందులో భాగంగానే జ‌గ‌న్ స‌ర్కార్ అవినీతిని సాక్ష్యాధారాల‌తో స‌హా నిరూపిస్తాన‌ని చంద్ర‌బాబు కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు. 

ఇలాంటి ఆరోప‌ణ‌ల‌తో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పెంచ‌డం, అలాగే త‌న కేడ‌ర్‌కు భ‌రోసా క‌ల్పించ‌డ‌మే ప్ర‌ధాన ఎత్తుగ‌డ‌గా క‌నిపిస్తోంది. ఆలు లేదు, చూలు లేదు కొడుకు పేరు సోమ‌లింగం అనే చందంగా… జ‌గ‌న్ స‌ర్కార్‌పై చంద్ర‌బాబు విమ‌ర్శ‌లున్నాయ‌నే వాద‌న విన‌ప‌డుతోంది.