తన పార్టీ తన చేజారిపోవడం గురించి బహిరంగంగా తన అసహాయతను చాటుకున్నారు చిరాగ్ పాశ్వాన్. ఇటీవలి ఎల్జేపీ పరిణామాల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీనే తనను ఇప్పుడు రక్షించాలన్నట్టుగా చిరాగ్ వ్యాఖ్యానించాడని జాతీయ మీడియా కథనాల్లో పేర్కొంటున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు మోడీని రాముడిగా, తనను ఆయనకు హనుమంతుడిగా చెప్పుకున్న చిరాగ్ ఇప్పుడు అదే సెంటిమెంట్ ను ప్రదర్శిస్తున్నారట.
హనుమంతుడు కష్టాల్లో పడ్డప్పుడు రక్షించడానికి రాముడు రాడా.. ఒకవేళ రాకపోతే రాముడి, హనుమంతుడి ప్రత్యేకత ఏముంది.. అంటూ ప్రశ్నించాడట చిరాగ్! తనను తాను హనుమంతుడిగా అభివర్ణించుకున్న వ్యక్తి మరీ ఇలా బేలగా మరిపోవడం ఏమిటో మరి. అంతేకాదు.. నిజంగానే మోడీ తనను తాను రాముడిగా, చిరాగ్ ను హనుమంతుడిగా చూసి ఉంటే, ఇలా అడగాల్సిన అవసరం లేకుండానే స్పందించే వారేమో!
ఏదేమైనా ఈ ఎపిసోడ్ లో మోడీ స్పందన ఎలా ఉంటుందనేదే ఆసక్తిదాయకమైన అంశం. అందులోనూ.. బిహార్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు చిరాగ్ ఒంటరిపోరుకు వెళ్లడానికి కారణమే బీజేపీ అనే ప్రచారం ఉండనే ఉంది. బీజేపీ వ్యూహం మేరకే చిరాగ్ పాశ్వాన్ సోలోగా పోటీ చేశాడని, జేడీయూ బలాన్ని చాలా తగ్గించి వేశాడని, అలా నితీష్ తప్పనసరిగా బీజేపీ కనుసన్నల్లో పని చేయాల్సిన పరిస్థితిని కల్పించడంలో చిరాగ్ ట్రంప్ కార్డులా పనిచేశాడని ఎన్నికలనాంతర విశ్లేషణలు కూడా సాగాయి.
బిహార్ లో బీజేపీ పోటీ చేసిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడా ఎల్జేపీ అప్పుడు పోటీ చేయలేదు! కేవలం జేడీయూ పోటీలో ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ చేసి… మొత్తం మీద ఆరు శాతం ఓట్లను పొందింది. ఎల్జేపీ ఇచ్చిన పంచ్ తోనే చాలా నియోజకవర్గాల్లో జేడీయూ దెబ్బతిన్నదనే విశ్లేషణలు సాగాయి. అదంతా బీజేపీ వ్యూహమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అది ఎవరి వ్యూహం అయినా.. ఇప్పుడు చిరాగ్ పాశ్వాన్ పొలిటికల్ కెరీర్ క్రాస్ రోడ్స్ లో మిగిలింది.
ఇప్పుడు మోడీ సహకారాన్ని బహిరంగంగా కోరుతున్నారాయన. అయితే ఇప్పటికే ఎల్జేపీ చీలిక వర్గాన్ని లోక్ సభ స్పీకర్ గుర్తించారు. రేపోమాపో కేంద్ర ఎన్నికల సంఘం కూడా అటే మొగ్గుచూపవచ్చు. అప్పుడు చిరాగ్ కు పార్టీ, గుర్తు చేజారినట్టే. ఇప్పుడు మళ్లీ కొత్తగా మొదలుపెట్టుకోవడం తేలికేమీ కాకపోవచ్చు. అయితే చిరాగ్ కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఇస్తే మాత్రం.. తిరుబాటు దార్లకు మోడీ గట్టి హెచ్చరిక జారీ చేసినట్టే.
చిరాగ్ కేంద్రమంత్రి అయితే తిరుగుబాటు దార్లలో కనీసం సగం మంది అయినా మళ్లీ ఈయనే తమ నాయకుడు అనొచ్చు! తిరుగుబాటు దార్ల ప్రధాన ఉద్దేశం కూడా చిరాగ్ కు కేంద్రమంత్రి పదవి దక్కకూడదు, దక్కితే అది తమకే దక్కాలనేది అని స్పష్టం అవుతూ ఉంది. మరి ఇప్పుడు చిరాగ్ ను ముంచినా, తేల్చినా మోడీనే అని స్పష్టం అవుతోంది. ఈ విషయాన్ని చిరాగ్ కూడా బాహాటంగానే ఒప్పుకుంటున్నాడు. ఇక మోడీ ఏం చేస్తారో!