బీజేపీతో కలవాలని బాబు ఎంతగా కిందామీద పడుతున్నారో అందరం ప్రత్యక్షంగా చూస్తునే ఉన్నాం. 2019 ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయిన మరుసటి రోజు నుంచి బీజేపీ ప్రాపకం కోసం బాబు చేయని సర్కస్ ఫీట్ లేదు. అలా బీజేపీ గుమ్మం ముందు చకోర పక్షిగా ఎదురుచూస్తున్న చంద్రబాబు.. మొత్తానికి తను అనుకున్నది సాధించారు. ఏపీలో టీడీపీతో పొత్తుపెట్టుకోవాల్సిందే అంటూ వాదించే ఓ వర్గాన్ని బీజేపీలో తయారుచేసుకున్నారు.
వ్యవస్థల్లోకి తన మనుషుల్ని చొప్పించి అవసరమైనప్పుడు ప్రతిఫలాలు అందుకోవడం, ఇతర పార్టీల్లోకి తన బినామీల్ని పంపించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. అలా బీజేపీలోకి కూడా బాబు మనుషులు కొంతమంది చేరారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే తెరపైకి రాజ్యసభ ఎంపీల పేర్లు మాత్రం ప్రముఖంగా వచ్చినప్పటికీ.. ఏపీ బీజేపీలో క్షేత్రస్థాయిలో చాలామంది టీడీపీ నేతలు చేరారు. వాళ్లంతా ఇప్పుడు సోము వీర్రాజుకు తలనొప్పిగా మారారు.
ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్న బీజేపీ నేతలంతా ఇప్పుడు ఒకటయ్యారు. సోము వీర్రాజుకు అడుగడుగునా అడ్డం పడుతున్నారు. వచ్చే ఎన్నికలకు జనసేనతో మాత్రమే పొత్తు పెట్టుకుంటే పెద్దగా ఉపయోగం ఉండదంటూ పోరు పెడుతున్నారు.
టీడీపీతో కూడా పొత్తు పెట్టుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎన్నో కొన్ని సీట్లు గెలవాలంటే, జనసేనతో అయ్యే పని కాదని, టీడీపీ పంచన చేరాల్సిందనంటూ తమ వాదనను గట్టిగా వినిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏపీలో ఉనికి చాటుకోవాలంటే జనసేన కంటే టీడీపీనే మంచి ప్రత్యామ్నాయం అంటూ ఊదరగొడుతున్నారు.
అయితే ఏపీ బీజేపీలో సోము వర్గం మాత్రం వీళ్ల వాదనను తోసిపుచ్చుతోంది. గత ఎన్నికల్లో బీజేపీని నానా మాటలన్న చంద్రబాబుతో మరోసారి కలిస్తే క్యాడర్ లో నైతిక స్థైర్యం దెబ్బతింటుందని అంటున్నారు వీళ్లు. మరీ ముఖ్యంగా మోదీ వ్యక్తిగత అంశాల్ని (మోదీ భార్య ప్రస్తావన) కూడా తీసుకొచ్చి బాబు రచ్చ రచ్చ చేశారని.. జాతీయ నాయకుల్ని దించి మరీ మోదీ-అమిత్ షా ను తిట్టించారని గుర్తుచేశారు.
అలాంటి నక్కజిత్తుల చంద్రబాబుతో కలిస్తే, జాతీయ స్థాయిలో బీజేపీ పరువు పోతుందని భయపెడుతున్నారు. అందుకే ఈ బ్యాచ్.. బీజేపీ-జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థి పవన్ కల్యాణ్ అనే వాదన తెరపైకి తెచ్చింది. ఒకరకంగా జనసేనలో కూడా ఆశలు కల్పించి.. టీడీపీతో కలవకుండా చేస్తోంది.
అయితే టీడీపీ స్నేహం కోసం తపించే వర్గం కూడా తమ వాదనను పక్కాగా సమర్థించుకుంటోంది. స్థానిక ఎన్నికల్లో జనసేనతో కలసి పోటీ చేసినా ఏమాత్రం వర్కవుట్ కాలేదని, చివరకు తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ-జనసేన కూటమి పవరేంటో తెలిసిపోయిందని, టీడీపీకి ఉన్న సంస్థాగత బలం కూడా తెలిసొచ్చిందని అంటున్నారు. దీంతో జనసేన కంటే టీడీపీ వైపే మొగ్గు చూపితే బాగుంటుందని సర్దిచెబుతున్నారు. అదే క్రమంలో జనసేనను కూడా కలుపుకొని పోతే ఇంకా బాగుంటుందంటున్నారు.
జనసేనతో మాత్రమే వెళ్లాలా, లేక టీడీపీని కూడా కలుపుకొని వెళ్లాలా అనే క్రమంలో ఏపీ బీజేపీలో ఓ రకమైన అంతర్యుద్ధం మొదలైంది. పార్టీలో ఈ చీలికకు కారణం చంద్రబాబు. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ, ఈ యుద్ధం మరింత ముదరడం ఖాయం. ప్రస్తుతం ఏపీ బీజేపీలో ఓ వర్గం మద్దతు లేకుండానే, సోము వీర్రాజు తన పని తాను చేసుకుపోతున్నారు. అనుకున్న కార్యక్రమాల్ని ఆచరణలో పెట్టి మమ అనిపిస్తున్నారు.
మొత్తమ్మీద బాబు మాత్రం తాను అనుకున్నది సగం సాధించారు. జాతీయ స్థాయిలో బుజ్జగింపులు, కాకా పట్టడాలు వర్కవుట్ అవ్వకపోవడంతో.. ఇలా ఏపీ బీజేపీలో చీలిక తెచ్చి తన దగ్గరకు వచ్చేలా చేసుకుంటున్నారు. అటు జనసేనను కూడా బుజ్జగిస్తే బాబు పని పూర్తిగా అయిపోయినట్టే.
ఎలాగూ పవన్ కల్యాణ్ కి, బాబుకి మధ్య ఉన్న సంబంధాలు పూర్తిగా చెడిపోలేదు కాబట్టి, వచ్చే ఎన్నికలనాటికి జనసేనానిని బుట్టలో పడేసుకోవడం ఆయనకు పెద్ద పని కాదు. పవన్ టీడీపీకి దగ్గరైతే, ఆటోమేటిక్ గా బీజేపీలో టీడీపీని సమర్థించే వర్గానికి మరింత బలం పెరిగినట్టవుతుంది. చంద్రబాబుకి కావాల్సింది కూడా అదే.