నేటితో ఆ సినిమాకు 15 యేళ్లు, సీక్వెల్ ఎవ‌రి చేతికి?

సౌతిండియాలో ఒక సినిమా గురించి వార‌ప‌త్రిక‌లు క‌వ‌ర్ స్టోరీ ఇవ్వ‌డం బ‌హుశా అదే మొద‌టి సారేమో! ఆ సినిమా రూప‌క‌ల్ప‌న గురించి, ఆ సినిమాలో హీరోగా న‌టించిన వ్య‌క్తి అందుకున్న పారితోష‌కం గురించి… అలా…

సౌతిండియాలో ఒక సినిమా గురించి వార‌ప‌త్రిక‌లు క‌వ‌ర్ స్టోరీ ఇవ్వ‌డం బ‌హుశా అదే మొద‌టి సారేమో! ఆ సినిమా రూప‌క‌ల్ప‌న గురించి, ఆ సినిమాలో హీరోగా న‌టించిన వ్య‌క్తి అందుకున్న పారితోష‌కం గురించి… అలా ఆ సినిమా ముచ్చ‌ట్ల గురించి పేజీల‌కు పేజీలు క‌థ‌నాలు ఇచ్చారు. తొలిసారి సౌతిండియాలో అలా సంచ‌ల‌నం రేపిన సినిమా 'చంద్ర‌ముఖి'. అయితే అప్ప‌టికి అది మ‌రీ కొత్త క‌థేం కాదు!

ఆల్రెడీ మ‌ల‌యాళంలో అప్ప‌టికి పదేళ్ల కింద‌టే విడుద‌లైన సినిమా. ఆ త‌ర్వాత క‌న్న‌డ‌లోనూ రూపొందిన సినిమా! అయినా త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో చంద్ర‌ముఖి రేపిన సంచ‌ల‌నం అంతా ఇంత కాదు. దాదాపు 20 కోట్ల బ‌డ్జెట్ లో రూపొందిన ఆ సినిమా లాభాల్లో ర‌జ‌నీకాంత్ వాటా 40 కోట్ల రూపాయ‌లు అనే టాక్ అప్ప‌ట్లో బీభ‌త్సంగా వినిపించింది. చంద్ర‌ముఖి సినిమాతో ర‌జ‌నీకాంత్ 40 కోట్ల రూపాయ‌లు లాభ‌ప‌డ్డాడు అనే మాట తెలుగు నాట షికారు చేసింది.

'మ‌ణిచిత్ర‌తాళు' అనే ఒక మ‌ల‌యాళీ సినిమా. మోహ‌న్ లాల్, సురేష్ గోపీ, శోభ‌న‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో చేశారు. ఆ సినిమాకు అస‌లు ద‌ర్శ‌కుడు ఫాజిల్ అయినా, ఆయ‌న ఆ సినిమాపై పూర్తిగా కాన్స‌న్ ట్రేట్ చేయ‌లేద‌ట‌.ఆయ‌న  త‌న స‌న్నిహితులు అయిన ప్రియ‌ద‌ర్శ‌న్ తో పాటు ఒక‌రిద్ద‌రు ప్ర‌ముఖ మ‌ల‌యాళీ ద‌ర్శ‌కులు అంతా ఆ సినిమాను క‌లిసి రూపొందించిన‌ట్టుగా 1995 ప‌త్రిక‌ల్లోనే వార్త‌లున్నాయి. మ‌ల‌యాళంలో ఆ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఆ విజ‌యాన్ని చూసి తెలుగులోకి అప్ప‌ట్లోనే ఆ సినిమాను డ‌బ్ చేశారట కూడా! తెలుగులో ఆ సినిమాను 'ఆత్మ‌రాగం' పేరుతో డ‌బ్ చేశార‌ట‌. అయితే ఆ సినిమా ఎందుకో విడుద‌ల కాలేదు! ఈ విష‌యాన్ని అప్ప‌టి తెలుగు సినీ ప‌త్రిక‌లు ప్ర‌స్తావించాయి!

1995లో ఆ సినిమా ఎందుకు విడుద‌ల కాలేదంటే, 2005లో చంద్ర‌ముఖి సంచ‌ల‌నం కోస‌మేమో అనుకోవాల్సి ఉంటుంది. 2005 ఏప్రిల్ 14న చంద్ర‌ముఖి విడుద‌ల అయ్యింది. అప్ప‌టికే భారీ అంచ‌నాలు. ర‌జ‌నీకాంత్ స్టిల్స్ తో కూడిన పోస్ట‌ర్లు సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. అప్ప‌టికి తెలుగు ప్రేక్ష‌కులు ఒక థ్రిల్ల‌ర్ ను, స్టార్ హీరో న‌టించిన హార‌ర్ సినిమాను చూసి చాలా కాలం అయిపోయిందేమో! చంద్ర‌ముఖి పూర్తిగా భిన్న‌మైన అనుభ‌వాన్ని ఇచ్చింది ప్రేక్ష‌కుల‌కు!

ఏ, బీ, సీ తేడాల్లేకుండా.. అన్ని ర‌కాల సెంట‌ర్ల‌లోనూ చంద్ర‌ముఖి పూర్తి స్థాయిలో ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. తెలుగులోనే క‌లెక్ష‌న్ల రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. త‌మిళంలో అయితే చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ త‌ర్వాత ఈ సినిమా జ‌ర్మ‌న్ తో స‌హా వివిధ విదేశీ భాష‌ల్లోకి కూడా డ‌బ్ అయ్యింది. హిందీలో భూల్ భుల‌య్యా పేరుతో ప్రియ‌ద‌ర్శ‌న్ రీమేక్ చేశాడు. అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించినా పెద్ద‌గా ఆడిన‌ట్టుగా లేదు. 

తెలుగునాట క‌ల్ట్ హిట్ అయ్యింది చంద్ర‌ముఖి. ఎంత‌లా అంటే.. ఇప్ప‌టికీ ర‌క‌ర‌కాల రాజ‌కీయ ప‌రిణామాల‌ను చంద్ర‌ముఖి సినిమాలోని సీన్ల‌తో వ్యంగ్యంగా పోల్చేంత‌లా! ఇప్పుడు మ‌రో విశేషం ఏమిటంటే… చంద్ర‌ముఖి కి సీక్వెల్ ప్ర‌తిపాద‌న‌. ఈ విష‌యంలో పి.వాసు త‌ను రెడీ అని ప్ర‌క‌టించారు చాలా సార్లు. ఈ కాన్సెప్ట్ కు క‌న్న‌డ‌లో ఒక సీక్వెల్ వ‌చ్చింది. అది అక్క‌డి సూప‌ర్ స్టార్ విష్ణువ‌ర్ధ‌న్ న‌టించిన ఆఖరి సినిమా కావ‌డంతో అక్క‌డ సంచ‌ల‌న విజ‌యం సాధించింది. తెలుగులో దాన్ని రీమేక్ చేస్తే డిజాస్ట‌ర్. పి.వాసునే దాన్ని డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు మ‌ళ్లీ సీక్వెల్ తో రెడీ అని ఆయ‌న అంటున్నాడు. అయితే ఆ బాధ్య‌త‌లు లారెన్స్ కు ద‌క్కుతాయ‌నే వార్త‌లూ వ‌స్తున్నాయి. ఆ సినిమా సీక్వెల్ ప‌ట్ల ర‌జ‌నీకాంత్ కూడా ఆస‌క్తితో ఉన్నాడ‌ని, త్వ‌ర‌లోనే లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంతో ఆ సినిమా రావొచ్చ‌నేది ఇటీవ‌లి అప్ డేట్.

చంద్రబాబు మేకప్ మానడు, ఉమా గాడు విగ్గు తియ్యడు