ఈ ఆపత్కాలంలో ఆయన ఎక్కడ ?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూ నానా బీభత్సం సృష్టిస్తోంది. ఇంతకాలం ఆర్ధిక బలంతో, అభివృద్ధి చెందామని అహంకారంతో విర్రవీగిన అగ్రరాజ్యాలు సైతం చతికిలపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక చిన్నా చితక దేశాల సంగతి …

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూ నానా బీభత్సం సృష్టిస్తోంది. ఇంతకాలం ఆర్ధిక బలంతో, అభివృద్ధి చెందామని అహంకారంతో విర్రవీగిన అగ్రరాజ్యాలు సైతం చతికిలపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక చిన్నా చితక దేశాల సంగతి  చెప్పేది ఏముంది ? వాటి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందనడంలో సందేహం లేదు. పెద్దా, చిన్న దేశాధినేతలంతా ఏం చేయాలో అర్ధం కాక తలకాయలు పట్టుకుంటున్నారు. లాక్ డౌన్ ఒక్కటే మార్గమంటూ దాన్ని అమలుచేస్తున్నారు. 

సమస్తం బందు పెట్టారు. వ్యక్తిగత కుటుంబ వేడుకలు, మతపరమైన ఉత్సవాలు రద్దు చేశారు. రోడ్డు మీద పురుగు కనబడితే ఊరుకునేదిలేదని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి. ప్రభుత్వాధినేతలంతా ప్రజలకు ధైర్యం నూరిపోస్తున్నారు. 

ఈ నేపథ్యంలో మధ్య అమెరికాలోని నికరాగువా అనే దేశం అధ్యక్షుడు కనిపించకుండా పోయాడు. ఆయన ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, అసలు బతికి ఉన్నాడా, లేడా ఇలాంటి ఎన్నో సందేహాలు పట్టి పీడిస్తున్నాయి. ఈ ఆపత్కాలంలో  ప్రజలకు మార్గదర్శనం చేయాల్సిన దేశాధ్యక్షుడు గత నెల  రోజులుగా కనిపించకుండా పోవడం విచిత్రంగా ఉంది. 

ఈ దేశంలోనూ కరోనా వైరస్ ఉంది. ఈ కారణంగా ఒకరు చనిపోయారు. కొన్ని పాజిటివ్ కేసులున్నాయి. ఇది మధ్య అమెరికాలో అతి పెద్ద దేశం. పురాతనమైన ఈ దేశంలో అరవై లక్షల జనాభా ఉంది.దేశాధ్యక్షుడు డేనియల్ ఒర్టెగా నెలరోజులుగా కనిపించడంలేదంటూ వాషింగ్టన్ పోస్టు ఓ కథనం ప్రచురించింది. విచిత్రమేమిటంటే నికారాగువాలో కరోనా వైరస్ ఉన్నప్పటికీ సాధారణ రోజుల మాదిరిగానే ఉంది. అంటే ఎప్పటి మాదిరిగానే పాఠశాలలు, దుకాణాలు, మాల్స్ మొదలైనవి తెరిచే ఉన్నాయి. జనమంతా ఎప్పటిమాదిరిగానే తిరుగుతున్నారు.

అధ్యక్షుడు ఒక్కడే కనబడటంలేదు. డేనియల్ ఒర్టెగా మార్చి 12 న వీడియో సమావేశంలో పాల్గొన్న తరువాత ఇప్పటివరకు ప్రజలకు కనబడలేదు. మిగతా అన్ని దేశాల్లో సమస్తం బందు పెట్టగా నికారాగువాలో మాత్రం బహిరంగ కార్యక్రమాలు యధావిధిగా జరుగుతూనే ఉన్నాయి.

ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. దేశాధ్యక్షుడు కనబడకపోడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. దేశాధ్యక్షుడి మాదిరిగా మీరు కూడా ఇళ్లలోనే ఉండండి … అంటూ కొందరు ప్రజలనుద్దేశించి పోస్టులు పెడుతున్నారు.

74 ఏళ్ళ డేనియల్ ఒర్టెగా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నట్లు దేశప్రజలు భావిస్తున్నారు. నికరాగువా సోషలిస్టు పాలనలో ఉన్న దేశం కాబట్టి ప్రజలకు సరైన సమాచారం తెలియదు. దేశాధ్యక్షుడు ఎందుకు కనబడటం లేదు అనే ప్రశ్నకు ప్రభుత్వ అధికారులు సమాధానం ఇవ్వడంలేదు. 

దీంతో ప్రజలు ఎవరికీ తోచింది వారు ఊహించుకుంటున్నారు. ఆయనకు కరోనా వైరస్ సోకి ఉంటుందని, దీంతో క్వారంటైన్ లో ఉన్నాడేమోనని అనుకుంటున్నారు. గతంలోనూ కొన్నాళ్ళు కనబడకుండా పోయాడని ప్రతిపక్ష నాయకులు చెబుతున్నారు. ఇక డేనియల్ ఒర్టగో భార్య, దేశ ఉపాధ్యక్షురాలు రోసారియో మురీల్లో డేనియల్ కనబడకపోవడంపై వివరణ ఇస్తూ, ఆయన ఇక్కడే ఉన్నారని (దేశంలో ), పనిచేస్తున్నారని, మార్గదర్శనం చేస్తున్నారని, కరోనాపై పోరాటానికి సాగుతున్న ప్రయత్నాలను సమన్వయం చేస్తున్నారని చెప్పారు. దేశంలో నలుగురికి కరోనా సోకిందని, ఒకరు చనిపోయారని ప్రభుత్వం చెబుతోంది. నికరాగువా ఇరుగుపొరుగు దేశాలతో ఉన్న సరిహద్దులను మూసేయలేదు. 

మే 3 వరకూ ఇండియా అంతా లాక్ డౌన్