సోమవారం రోజున దేశంలో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగింది. ఒకే రోజున ఏకంగా 80 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ పొందారు. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన నంబరే. ఈ ఏడాది చివరకు దేశంలోని వయోజనులందరికీ వ్యాక్సినేషన్ చేయాలంటే రోజు వారీగా కనీసం 80 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులను ఇవ్వాల్సి ఉంది. ఈ రకంగా చూస్తే.. సోమవారం రోజున ఆ టార్గెట్ కు రీచ్ అయ్యారు. అయితే మంగళవారం మాత్రం మళ్లీ నంబర్లు తగ్గాయి!
మంగళవారం రోజున దేశం మొత్తం మీదా 50 లక్షల మందికి ఒక డోసు వ్యాక్సినేషన్ జరిగిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని రాష్ట్రాల్లో అయితే మంగళవారం రోజున వ్యాక్సినేషన్ చాలా నామమాత్రంగా జరిగిందట. కొన్ని రాష్ట్రాల్లో ఐదారు వేల స్థాయిలో మాత్రమే వ్యాక్సిన్లు ఇవ్వగలిగారట.
ఉన్న స్టాక్ అంతటినీ సోమవారం రోజున వేసేయడంతో, మంగళవారానికి వ్యాక్సిన్లు లేని పరిస్థితి అని తెలుస్తోంది. దీంతో మంగళవారం రోజున కనిష్ట నంబర్లు నమోదు అయ్యాయని సమాచారం. అయితే దేశం మొత్తం మీదా చూస్తే.. ఒక రోజులో 50 లక్షల స్థాయిలో వ్యాక్సిన్ డోసులు ఇవ్వగలడం కూడా మెరుగైన పరిస్థితే.
ఇప్పటి వరకూ దాదాపు 29.5 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ జరిగిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో కనీసం ఒక డోసుగా వ్యాక్సినేషన్ చేసిన వారి సంఖ్యే చాలా ఎక్కువ. రెండు డోసుల వ్యాక్సిన్ పొందిన వారి సంఖ్య ఇప్పటికీ ఐదారు కోట్ల స్థాయిలో ఉండవచ్చు. ప్రస్తుతం పల్లెల్లో రెండో డోసు వ్యాక్సిన్ కావాలనే వారికి దొరుకుతున్నది అంతంత మాత్రమే.
తొలి డోసు వేయించుకునే వారికే ప్రథమ ప్రాధాన్యత. రెండో డోసు వేయించుకోవడానికి ఆరు వారాలు, ఎనిమిది వారాలు గడువును పూర్తి చేసుకున్న అనేక మంది వేచి చూపుల్లో ఉన్నారు. ప్రస్తుతా ప్రాధాన్యత క్రమంలో వారు లేరని స్పష్టం అవుతోంది.
బాలింతలకూ, ఐదేళ్ల లోపు పిల్లలున్న తల్లులకూ, 45 యేళ్లు పై బడి తొలి డోసు వేయించుకునే వాళ్లకే ప్రస్తుతం ప్రాధాన్యతను ఇస్తున్నారు. దాదాపు మూడు నెలల కిందటే తొలి డోసు పొందిన 45 యేళ్ల పై బడిన వయసు వారికి కూడా పిలిచి వ్యాక్సిన్ వేసే పరిస్థితి ఇంకా రావడం లేదు! ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ల మధ్యన గడువు పెంచేశారు నిపుణులు. దీంతో .. రెండో డోసు ఎప్పుడో తెలియని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు!