దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిలపై తెలంగాణ ప్రభుత్వం విరుచుకుపడుతోంది. సాగునీటి విషయంలో ఆంధ్రా, తెలంగాణ పేచీ పడుతున్నాయి. ఇది రోజురోజుకూ చినికిచినికి గాలివానలా మారుతోంది. ముఖ్యంగా గొడవంతా కృష్టా జలాలకు సంబంధించే.
తాజాగా వైఎస్సార్, జగన్‌లపై తెలంగాణ గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. జల చౌర్యంలో వైఎస్సార్ దొంగ అయితే ఆయన కుమారుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ గజదొంగ అని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు.
ఎలాంటి అనుమతులు లేకుండా జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ కుడి కాల్వ పనులు చేపట్టారని ఆరోపించారు. గతంలో ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అక్రమంగా పోతిరెడ్డిపాడు నిర్మించి కృష్ణానీటిని తరలించుకు పోయారని మండిపడ్డారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.
తెలంగాణ బద్ధవ్యతిరేకి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అప్పట్లో పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా 40 వేల క్యూసెక్కులు దోచుకుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా అప్పటి కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్కు చెందిన ఐదుగురు మంత్రులు రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
దొంగ, గజ దొంగ చర్యలను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. రాయలసీమ, ఆర్డీఎస్ రైట్ కెనాల్ పనులను ఇప్పటికైనా నిలిపేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజాయుద్ధం జరుగుతుందని తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు.
వైఎస్సార్, జగన్‌లను తెలంగాణ మంత్రి తిట్టడం సహజంగానే ఏపీ సమాజానికి ఆగ్రహం తెప్పిస్తోంది. కృష్ణా జలాలను నాడు తండ్రి, నేడు ఆయన తనయుడు అంతకంటే ఎక్కువగా తరలించుకుపోతున్నారనే విమర్శలు ఆంధ్రప్రదేశ్ సమాజానికి మాత్రం పాజిటివ్ సంకేతాలు పంపుతున్నట్టైంది. తెలంగాణకు బద్ధవ్యతిరేకిగా వైఎస్‌ను చిత్రీకరించడం కూడా జగన్‌కు రాజకీయంగా కలిసి వచ్చే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో 9 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రానికి, ఐదేళ్ల పాటు విభజిత ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ….రాష్ట్రం కోసం ఎప్పుడైనా ఇలాంటి ఒక్క తిట్టైనా తిన్నాడా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎంతసేపూ నీళ్ల విషయంలో తెలంగాణ ద్రోహులుగా వైఎస్సార్, ఆయన తనయుడు జగన్‌లపైనే విమర్శలు చేస్తుండడం వల్ల, వాళ్లిద్దరు తప్ప చంద్రబాబు ఆంధ్రా కోసం చేసిందేమీ లేదనే భావన వ్యక్తమవుతోంది.
సాగు, తాగునీళ్లపై చంద్రబాబు ఎప్పుడూ దృష్టి పెట్టలేదనేందుకు తాజాగా తెలంగాణ మంత్రుల విమర్శలే నిదర్శనమనే అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు వైఎస్సార్, జగన్‌లను ఇలాగే తిడితే తమకు రాజకీయ ప్రయోజనమని వైసీపీ భావిస్తోంది. కృష్ణా జలాల తరలింపు విషయంలో జగన్ వైఖరి తెలంగాణకు ఖేదం, ఇదే సందర్భంలో ఆంధ్రాకు మోదం కలిగిస్తోంది.
వైఎస్సార్, జగన్‌లను తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు ఎంత ఎక్కువ తిడితే అంతగా, ఏపీలో వైసీపీకి లాభమే. ఇదే టీడీపీలో ఆందోళనకు కారణమవుతోంది. ఇదంతా టీఆర్ఎస్, వైసీపీ పొలిటికల్ గేమ్ ప్లాన్ అని టీడీపీ అనుమానిస్తోంది.