కొన్నాళ్ల క్రితం..భాజపా అధిష్టానం ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ పగ్గాలు సోము వీర్రాజుకు అప్పగించిన రోజులు. తెగ హడావుడి జరిగిపోయింది. చిరంజీవిని కలవడం, పవన్ ను కలవడం, గంటాను పార్టీలోకి వస్తారు అనడం, రాష్ట్రం అంతటా పర్యటించి తెగ స్టేట్ మెంట్లు, హడావుడి. అంతా సోము వీర్రాజుదే.
చూస్తూ వుంటే భాజపాకు కొత్త వైభవం వచ్చేస్తుందేమో అనిపించేసింది. ఈ హవా ఇలా తిరుపతి ఉపఎన్నిక వరకు కొనసాగింది. ఉపఎన్నిక వేళ భాజపా హడావుడి కూడా తక్కువేమీ కాదు. పవన్ కళ్యాణ్ ను తీసుకువచ్చి, వకీల్ సాబ్ థియేటర్ల దగ్గర వీడియో షూట్ లు పెట్టి, ఓట్లు రాబట్టడానికి పన్నిన వ్యూహాలు ఇన్నీ అన్నీ కావు. కానీ అవన్నీ వికటించాయి. తిరుపతిలో దారుణ ఘోర పరాజయం తప్పలేదు.
అదిగో సరిగ్గా, ఆ తరువాత నుంచి రాష్ట్రంలో భాజపా హడావుడి కనిపించడం లేదు. సోము వీర్రాజు హడావుడి అంతకన్నా కనిపించడం లేదు. సరే, భాజపా అంటే ఇప్పట్లో ఏ ఎన్నికలు లేవు కాబట్టి హడావుడి లేదు అనుకోవచ్చు.
కానీ సోము వీర్రాజుకు ఏమయింది? పార్టీ అధ్యక్షుడు కదా? ఎక్కడో అక్కడ, ఏదో ఓ మూల నిత్యం వార్తల్లో కనిపించేస్తూ వుండాలి కదా. పనిగట్టుకుని విమర్శలు చేయాల్సిన పని లేదు కానీ అవసరం అనుకున్నవాటిపైన స్పందించాల్సి వుంది కదా? అదే అస్సలు కనిపించడం లేదు.
సరే, ఈ సంగతి ఇలా వుంచితే భాజపాతో బంధం పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కు కూడా ఏదో బ్రేక్ పడిందా? కరోనా సోకి తగ్గిన తరువాత రాజకీయంగా ఆయన కూడా బాగా తగ్గిపోయినట్లు కనిపిస్తోంది. ట్విట్టర్ లో జనసేన ట్వీట్ లు మినహా మరే మాటా లేదు. పవన్ మాత్రమే కాదు, ఆయన సచివుడు నాదెండ్ల మనోహర్ కూడా ఎక్కువగా మౌన వ్రతాన్నే నమ్ముకున్నారు.
ఇంతకీ ఏమయింది? భాజపా, సోము, పవన్, నాదెండ్ల వీళ్లందరూ ఒక్కసారిగా మౌనవ్రతాన్ని నమ్ముకున్నారు? రెండేళ్ల టైమ్ వుంది ఎన్నికలకు ఇప్పటి నుంచి ఎందుకు అలసిపోవడం అనా? లేదా మరేదైనా కారణం వుందా? ఇది ప్రస్తుతానికి జవాబు తెలియని, జవాబు తెలియాల్సిన ప్రశ్న.