బ్రెజిల్ లో కొవాక్సిన్ కుంభకోణం సంచలనంగా మారింది. ఏకంగా దీనిపై పార్లమెంటరీ కమిటీ ఎంక్వయిరీ వేయడం, కొవాక్సిన్ ఒప్పందం కోసం కోట్ల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు రావడంతో ఇది భారత్ బయోటెక్ కి కూడా మచ్చలా మిగిలే ప్రమాదం ఉంది. ప్రస్తుతం బ్రెజిల్ ప్రజలు టీకా కోసం రోడ్లెక్కారు. ఆందోళనలు ఉధృతం అయ్యాయి. దాదాపుగా 500 పట్టణాల్లో బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సొనారోకి వ్యతిరేకంగా నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు.
అసలేం జరిగింది..?
తొలిదశలో కరోనాని పెద్దగా పట్టించుకోని బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సొనారో లక్షల సంఖ్యలో జరిగిన ప్రాణనష్టానికి పరోక్ష కారణం అయ్యారు. టీకా విషయంలో కూడా ఆయన త్వరగా మేల్కొనలేదు. ఇతర దేశాలన్నీ టీకాలకు అత్యవసర అనుమతులిస్తూ వ్యాక్సినేషన్ మొదలు పెడితే బ్రెజిల్ 2020 నవంబరులో భారత్ బయోటెక్ తో ఓ ఒప్పందం కుదుర్చుకుంది.
అమెరికా తయారీ ఫైజర్, చైనా తయారీ సినోవాక్ టీకాలను కాదని, నేరుగా భారత్ తయారీ కొవాక్సిన్ దిగుమతికి బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సొనారో సుముఖత చూపడంపై గతంలోనే విమర్శలు ఎదురయ్యాయి. కొవాక్సిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి లేదు, కనీసం బ్రెజిల్ ఆరోగ్య నియంత్రణ సంస్థ అనుమతి కూడా లేదు. అయినా కూడా ఆ వ్యాక్సిన్ కోసం బోల్సొనారో పట్టుబట్టారు. భారత ప్రధానితో మాట్లాడి తమకు టీకా సరఫరా చేయించాలని అభ్యర్థించారు.
డీల్ ఇలా కుదిరింది..
మొత్తం 2 కోట్ల డోసుల టీకా సరఫరా కోసం 2,230కోట్ల రూపాయలకు భారత్ బయోటెక్ తో బ్రెజిల్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ లో మధ్యవర్తిగా వ్యవహరించిన ప్రెసిసా కంపెనీకి 743 కోట్లు చెల్లించడం అవినీతికి సాక్ష్యంగా మారింది. 2020 నవంబరులో డీల్ కుదిరినా ఇప్పటి వరకు ఒక్క డోసు కూడా బ్రెజిల్ లో వాడలేదు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ విషయంలో నెలకొన్న సందిగ్ధత వల్ల ఇప్పటి వరకూ కొవాక్సిన్ ను అక్కడ వినియోగంలోకి తేలేదు.
రోడ్డెక్కిన ప్రజలు..
రెండోదశ విజృంభిస్తున్న ఈ సమయంలో కూడా ఇంకా బ్రెజిల్ లో వ్యాక్సినేషన్ మొదలు కాకపోవడంతో ప్రజలు రోడ్లెక్కారు. నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం విషయంలో అధ్యక్షుడు అశ్రద్ధ వహిస్తున్నారంటూ మండిపడుతున్నారు. తిండి, ఉద్యోగం, ఉపాధి, టీకా.. ఇవి మా హక్కులు అంటూ నినదిస్తున్నారు.
ఈ దశలో కొవాక్సిన్ కుంభకోణం కూడా పతాక శీర్షికలకెక్కింది. కొవాక్సిన్ కోసం బ్రెజిల్ అధ్యక్షుడు ఎందుకు పట్టుబట్టారని, ఆయన వ్యక్తిగత ప్రయోజనాలేంటని విచారణ మొదలైంది. కొవాక్సిన్ ఒప్పందం కోసం తమపై ఒత్తిడి తెచ్చిన మాట వాస్తవమేనని కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా ఒప్పుకున్నారు. దీంతో ప్రతిపక్షాలు కొవాక్సిన్ కుంభకోణం అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
గతంలో ఓసారి భారత్ నుంచి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను దిగుమతి చేసుకోడానికి కూడా బ్రెజిల్ అధ్యక్షుడు ఇలాగే ఉబలాటపడ్డారు. తీరా కరోనా చికిత్సలో దాని ప్రభావం లేదనే సరికి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు రెండోసారి భారత్ తో కొవాక్సిన్ డీల్ కుదుర్చుకుని మరోసారి ఇబ్బందుల్లో పడ్డారు బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సొనారో.