ఆత్మహత్యతో కన్నుమూసిన ఎన్టీఆర్ కూతురు ఉమామహేశ్వరికి సంబంధించిన మానవీయ కోణం ఇది. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ 12 కు పక్కగా ఉండే సీనియర్ ఎన్టీఆర్ ఇంటికి సంబంధించి కొన్నేళ్ల కిందట ఒక వివాదం రేగింది.
ఎన్టీఆర్ మరణించే సమయానికి లక్ష్మీపార్వతితో ఆ ఇంటిలోనే ఉండేవారు. ఆయన మరణించాకా.. కూడా లక్ష్మీపార్వతి ఆ ఇంట్లోనే నివసిస్తూ వచ్చారు. అయితే ఆ ఇల్లు అప్పటికే ఎన్టీఆర్ తన కూతుర్లలో ఒకరైన ఉమామహేశ్వరి పేరిట రాశారట. కూతురు పేరిట ఉన్న ఆ ఇంట్లో ఎన్టీఆర్, లక్ష్మీపార్వతితో కలిసి జీవిస్తూ వచ్చారు.
ఎన్టీఆర్ మరణం తర్వాత లక్ష్మీ పార్వతితో నందమూరి కుటుంబం ఎలా వ్యవహరించిందో అందరికీ తెలిసిందే. ఇలాంటి క్రమంలో ఎన్టీఆర్ పెద్ద కూతురు పురందేశ్వరికి ఆ ఇంటి మీద కూడా చూపు పడ్డట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి.
లక్ష్మీపార్వతిని రోడ్డు నంబర్ 12 ఇంటి నుంచి ఖాళీ చేయించడానికి ఆమె ఎన్టీఆర్ మరణించిన వెంటనే ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఆ ఇల్లు ఉమమహేశ్వరి పేరిట ఉండటంతో… అటు నుంచి నరుక్కొచ్చే ప్రయత్నాలు చేశారట పురందేశ్వరి. అప్పటికే ఉమామహేశ్వరి అమెరికాలో ఉంటున్నారు. దీంతో పురందేశ్వరి తన సోదరి మీద ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారట.
అయితే ఉమామహేశ్వరి మాత్రం తన పిన్నిపై ఒత్తిడి తీసుకురావడానికి పెద్దగా ఇష్టపడకపోవడం గమనార్హం. ఎంతైనా.. తన తండ్రి ఇష్టపడ్డ వ్యక్తి కావడంతో ఉమామహేశ్వరికి లక్ష్మీపార్వతిపై కాస్త సాఫ్ట్ కార్నర్ ఉండేదంటారు.
తన పేరు మీద ఉన్న ఇల్లుకావడంతో తనే ఆమెను ఖాళీ చేయించాలన్నట్టుగా పురందేశ్వరి ఉమామహేశ్వరిపై ఒత్తిడి తీసుకువచ్చినా ఆ ఒత్తిళ్లు ఫలించలేదని సమాచారం. దీంతో చివరకు చేసేదేం లేక పురందేశ్వరి కూడా కామ్ అయిపోయారంటారు.
కానీ ఎన్టీఆర్ వారసులు ఆ వ్యవహారాన్ని అంతటితో వదల్లేదు. చాలా యేళ్ల తర్వాత లక్ష్మీపార్వతిని అక్కడ నుంచి ఖాలీ చేయించారు. ఉమామహేశ్వరి నుంచి పవరాఫ్ అటార్నీ నందమూరి సోదరుల్లో ఒకరు పొందారు. వారు రంగంలోకి దిగి లక్ష్మీపార్వతిని అక్కడ నుంచి ఖాళీ చేయించే పని పూర్తి చేశారు.
ఆ ఇల్లు ఉమామహేశ్వరి పేరిట ఉన్నన్నాళ్లూ లక్ష్మీ పార్వతి అక్కడ ఉండగలిగారు, పవరాఫ్ అటార్నీ ఎన్టీఆర్ కొడుకుల్లో ఒకరి పేరిట వచ్చాకా.. మాత్రం రోజుల వ్యవధిలోనే ఆమెను ఖాళీ చేయించారు.
తన తండ్రి రెండో పెళ్లి చేసుకున్న లక్ష్మీ పార్వతిని.. తన తండ్రి ఇష్టపడిన వ్యక్తిగా ఉమామహేశ్వరి కనీసం గుర్తించారు. మిగతా వారు మాత్రం దాన్ని పట్టించుకున్న దాఖలాలు ఉండవు!