మహారాష్ట్రలో శివసేన కష్టాలు పతాక స్థాయికి చేరుతున్నట్టుగా ఉన్నాయి. ఆ పార్టీ ముఖ్య నేత, ఉద్ధవ్ ఠాక్రే మద్దతుదారు.. సంజయ్ రౌత్ ను ఈడీ అదుపులోకి తీసుకోవడంతో వ్యవహారం కొత్త రూటు తీసుకుంది. ఇటీవలే ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని విజయవంతంగా పడగొట్టింది కమలం పార్టీ.
శివసేన కంటిని ఆ పార్టీ నేతలతోనే పొడిపించింది. మరోవైపు శివసేన చీలిక వర్గాన్ని అడ్డు పెట్టుకుని పార్టీని కూడా వారి పరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో.. సంజయ్ రౌత్ అరెస్టు మరో హాట్ టాపిక్ అవుతోంది.
ఈ వ్యవహారాలన్నింటి సంగతీ అలా ఉంటే… ఒకవేళ శివసేన గనుక బీజేపీతో సఖ్యతతో ఉండి ఉంటే? ఇలా జరిగేది కాదనడానికి ఎలాంటి సంకోచం అక్కర్లేదేమో! శివసేన గనుక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తును కొనసాగించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉంటే.. శివసేనకు ఎలాంటి ఇబ్బందులూ ఉండేవి కావు.
ప్రభుత్వంలో ఉద్ధవ్ తనయుడికి మంత్రి పదవి దక్కేది. శివసేన ఉద్ధవ్ ఆధీనంలోనే ఉండేది. అప్పుడు మోడీ సర్కారును రౌత్ విమర్శిస్తూ సామ్నాలో ఎడిటోరియల్స్ రాసుకున్నా.. కమలం పార్టీ చూసీచూడనట్టుగా ఉండేది! తమకు ప్రాధాన్యత దక్కలేదని శివసేన అప్పుడప్పుడు రుసరుసలాడుతూ ఉన్నా.. ఆ పార్టీ చీలేంత పరిస్థితి అయితే వచ్చి ఉండేది కాదు. టామ్ అండ్ జెర్రీ ఆటలా వ్యవహారం సాగేది.
అయితే బీజేపీకి ఎదురుతిరిగి తన దారి చూసుకున్నందుకు ఉద్ధవ్ ఠాక్రే అండ్ కో ను కమలం పార్టీ ముప్పుతిప్పులు పెడుతోంది. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఉద్ధవ్ ఠాక్రే గ్యాంగ్ పై బీజేపీ మార్కు దాడులు కొనసాగుతూ ఉన్నట్టున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో ఉద్ధవ్ స్పందిస్తూ.. తగ్గేదే ల్యా.. అంటున్నాడు! మరి ఈ రాజకీయం ఎంత వరకూ వెళ్తుందో! ముందు ముందు ఎలాంటి రాజకీయ పరిణామాలకు ఈ వ్యవహారం పునాది వేస్తుందో!