నిర్మాతల గిల్డ్ తలపెట్టిన షూటింగ్ ల బంద్ తొలి రోజే విఫలమైంది. సుమారు డజనున్నర సినిమాలు యధావిధిగా షూటింగ్ జరుపుకున్నాయి. అన్నింటికన్నా గొప్ప విషయం ఏమిటంటే గిల్డ్ సారథి దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు సినిమా షూట్, గిల్డ్ కీలక సభ్యుడు నాగవంశీ నిర్మిస్తున్న సార్ సినిమాల షూటింగ్ లు జరగడం.
ఈ సినిమాలు రెండూ ఉభయ భాషల సినిమాలు గానే ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు మాట మార్చి, ఇవి తమిళ సినిమాలు అనీ, తెలుగులో డబ్ చేస్తామని చెప్పడం విశేషం.
దీని మీద గిల్డ్ సభ్యుల వాట్సాప్ గ్రూప్ లో కాస్త వాడి వేడి చర్చలు కూడా సాగినట్లు తెలుస్తోంది. తెలుగు సినిమా నిర్మాతలు అంతా తమ తమ సినిమాల షూటింగ్ లు బంద్ చేయాలని అనుకున్నపుడు బంద్ చేయాలి కానీ తాము నిర్మిస్తున్న తెలుగు సినిమాల షూటింగ్ లు మాత్రమే బంద్ అని చెప్పడం ఏమిటి అంటూ మిగిలిన సభ్యులు ఆఫ్ ది రికార్డుగా కామెంట్ చేస్తున్నారు.
తను నిర్మిస్తున్న వారసుడు సినిమా తమిళ సినిమా అంటూ ప్రకటించి దిల్ రాజు తప్పుకోవడం విశేషం. ఇదిలా వుంటే ఇంకా బంద్ కు సంబంధించి ఛాంబర్ ఆదేశాలు అందలేదని ఫెడరేషన్, రేపు కీలకంగా చర్చిస్తామని చాంబర్ ఇలా రకరకాల ప్రకటనలు వస్తున్నాయి.
చూస్తుంటే మొత్తానికి షూటింగ్ లు అయితే ఆగేలా లేవు. ఎవరికి సత్తా వుంటే వాళ్లు షూటింగ్ లు చేసుకునేలా వుంది వ్యవహారం.