ఉత్తరాంధ్రా జిల్లాలు వెనకబాటుతనానికి బాగా గురి అయినవి. శ్రమ దోపిడీకి కూడా ఈ జిల్లాలే పెట్టింది పేరుగా ఉన్నాయి. బలవంతులు బలహీనులను దోచుకునే తీరుతో దగా పడిన జనమంతా జగమంత కుటుంబంగా ఇక్కడ కనిపిస్తారు.
అటువంటి ఉత్తరాంధ్రాలో చీకట్లు తొలగిపోతున్నాయి. అభివృద్ధి వెలుగులు ప్రసరించబోతున్నాయి. అణువు నుంచి పుట్టిన అఖండమైన వెలుగు అఖిల భారతానికి అంతులేని విద్యుత్ ని అందించే బృహత్తర కార్యక్రమం మొదలు కాబోతోంది. శ్రీకాకుళం జిల్లాలోని అణు విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణానికి మెల్లగా అడుగులు పడుతున్నాయి.
నిజానికి ఇది పదిహేడేళ్ళ క్రితం ప్రతిపాదించిన ప్రాజెక్ట్. నాడు వైఎస్సార్ సీఎంగా ఉండగా జిల్లాలోని కొవ్వాడ వద్ద దాదాపుగా పది వేల మెగావాట్లను అందించే అణు విద్యుత్ ప్రాజెక్ట్ ని అమెరికన్ కొలాబరేషన్ తో నిర్మించాలని తలపెట్టారు. దాని కోసం భూసేకరణ కూడా పెద్ద ఎత్తున చేపట్టారు. ఇక 2013 భూసేకరణ చట్టం ప్రకారం బాధితులకు నష్టపరిహారం కూడా చెల్లించారు.
మొత్తానికి అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు కావాల్సిన భూమి అందుబాటులో ఉంది, నిర్మాణానికి తగిన వనరులు అన్నీ ఉన్నాయి. కానీ ఇన్నాళ్ళు ఆగిపోవడానికి కారణం స్థానికుల నుంచి కొంత వ్యతిరేకత రావడం. ఇపుడు దాన్ని అధిగమించి ప్రాజెక్ట్ ని నిర్మించేందుకు అన్ని రకాలుగా అడుగులు వేగంగా పడుతున్నాయని అంటున్నారు.
ఈ ప్రాజెక్ట్ ని ప్రస్తుతం ఆరు వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మించాలని తాజాగా సరికొత్త ప్రతిపాదనలు తయారు చేశారు. కేంద్రంలోని బీజేపీ కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల సానుకూలంగా ఉండడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తరాంధ్రాను వెలుగులతో నింపాలని ఆలోచించడంతో త్వరలోనే దీనికి సంబంధించిన నిర్మాణం పనులు మొదలు అవుతాయని అంటున్నారు.
ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తి అయితే ఆసియాలోనే అతి పెద్ద అణు విద్యుత్ ప్రాజెక్ట్ అవుతుంది అంటున్నారు. దీని వల్ల శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తరాంధ్రా జిల్లాల స్వరూప స్వభావాలు మారుతాయని, పెద్ద ఎత్తున పారిశ్రామీకరణకు కూడా ఆస్కారం ఉంటుంది అంటున్నారు.
ఇక అణు విధ్యుత్ ఏర్పాట్ వల్ల విద్వంసాలు జరుగుతాయన్న ప్రచారం కూడా ఉంది. అయితే ప్రతీ అభివృద్ధి మాటునా ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. అలాగని వాటిని చేపట్టకుండా ఉంటే చీకట్లోనే ఉండాల్సి వస్తుంది. దాంతో ఈ ప్రాజెక్ట్ కి టేకప్ చేసి నిర్ణీత కాల వ్యవధిలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని అంటున్నారు.