కరోనా మూడో వేవ్ లో విజృంభిస్తుందనే అంశం గురించి రెండు నెలలుగా మీడియా కథనాలు హోరెత్తిస్తూ ఉంది. వాస్తవానికి రెండో వేవ్ ఒక కొలిక్కి రాకముందే, మూడో వేవ్ గురించి మీడియా అంచనాలను హోరెత్తించింది.
మూడో వేవ్ లో కరోనా పూర్తిగా పిల్లలనే టార్గెట్ చేస్తుందంటూ తలాతోక లేని విశ్లేషణలు వినిపించాయి మీడియా వర్గాలు. అందులో లాజిక్ ఏమిటంటే.. త్వరలోనే వయోజనులందరికీ కరోనా వ్యాక్సినేషన్ జరగవచ్చని, మిగిలింది 18 యేళ్ల లోపు వారే కాబట్టి.. వారిపైనే ప్రభావం ఉంటుందనేది!
మూడో వేవ్ అంటూ వస్తే.. అది పిల్లలపై అయినా, పెద్దలపై అయినా ప్రభావం ఉంటుందని డైరెక్టుగా చెప్పకుండా, పెద్దలకు వ్యాక్సినేషన్ జరుగుతుందనే అంశాన్ని హైడ్ చేసి, పిల్లలపై ప్రభావం అంటూ హైలెట్ చేశారు కొందరు మేధావులు. ఇక అసలుకు కరోనా మూడో వేవ్ ఉంటుందా? అనే అంశంపై కూడా రకరకాల అంచనాలు, అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎయిమ్స్ చీఫ్ గులేరియా మాట్లాడుతూ.. కరోనా మూడో వేవ్ తథ్యం అన్నారు. అది కూడా రెండు నెలల్లోనే అని ఆయన తేల్చారు! మరి కొందరేమో.. వైరస్ రూపు మార్చుకునేందుకు సమయం పట్టవచ్చని, అక్టోబర్- నవంబర్ నెలల వరకూ మూడో వేవ్ రాదంటున్నారు. ఇలా కరోనా మూడో వేవ్ గురించి రెండు రకాల సమయాలను చెబుతున్నారు కొంతమంది వైద్య పరిశోధకులు.
కట్ చేస్తే.. తాజాగా కర్ణాటకలో ఇద్దరు వైరాలిజస్టులు వేర్వేరుగా స్పందించారు. వారిలో ఒకరు చెప్పేదేమిటంటే, కరోనా మూడో వేవ్ లో వస్తుందనేందుకు ఆధారాలు ఏమీ లేవని! కరోనా మూడో వేవ్ వస్తుందనేందుకు ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలూ లేవని ఐఐఎస్సీ లో మైక్రోబయాలజీ ప్రొఫెసర్ గా పని చేసి, రిటైర్డ్ అయిన విజయ అనే వైరాలజిస్ట్ తేల్చి చెబుతున్నారు.
మూడో వేవ్ వస్తుందనేదనే వాళ్లందరిదీ ఊహాజనితమైన ప్రకటనే అని విజయ అంటున్నారు. అంతే కానీ, శాస్త్రీయంగా ఎలాంటి ఆధారం లేదని ఆమె చెబుతున్నారు. అలాగని జాగ్రత్తలు తీసుకోవద్దని తను చెప్పడం లేదని, కేవలం మూడో వేవ్ కు శాస్త్రీయ ఆధారాలు లేవనే తను చెబుతున్నట్టుగా విజయ వ్యాఖ్యానించారు.
ఇక కర్ణాటకకే చెందిన జాకబ్ జాన్ అనే వైరాలజిస్ట్ స్పందిస్తూ.. అసలు దేశంలో కరోనా మూడో వేవ్ ఉండనే ఉండదన్నారు. ఈ నెలాఖరుకు ఎలాగూ సెకెండ్ వేవ్ పూర్తిగా ముగుస్తుందని, ఆ తర్వాత కరోనా తీవ్ర స్థాయిలో తన రూపును మార్చుకుంటే తప్ప మూడో వేవ్ ఉండదని అంటున్నారు. ఆ మార్పు సాధ్యం కాదని, మూడో వేవ్ ఉండదనేది ఈ వైరాలజిస్ట్ అభిప్రాయం.
డెల్టా వేరియంట్ కూ డెల్టా ప్లస్ వేరియెంట్ కూ పెద్ద తేడాలు లేవని ఆయన చెబుతున్నారు. అలాంటప్పుడు డెల్టా ప్లస్ వేరియెంట్ తో మూడో వేవ్ అనేది సాధ్యం కాదన్నారు. సెకెండ్ వేవ్ లోనే డెల్టా ప్లస్ వేరియెంట్ కూడా నశించిపోతుందని ఈ వైరాలజిస్ట్ చెబుతున్నారు. మూడో వేవ్ రావాలంటే.. వైరస్ చాలా మార్పు చేర్పులు చేసుకోవాలని అది సాధ్యం కాదన్నట్టుగా ఆయన చెబుతున్నారు.
అంతేకాదు జాన్ చెప్పడం ఏమిటంటే.. ఈ ఏడాది చివరకు కరోనా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందట. సమర్థవంతంగా వ్యాక్సినేషన్ జరిగితే.. కరోనా ఇక ముగిసిన అధ్యాయమే అవుతుందని జాన్ తేల్చి చెబుతున్నారు. ఇలాంటి అంచనాలు నిజమైతే చాలేమో!