అడియో రంగంలో ఆదిత్య మ్యూజిక్ కు ఇప్పటి వరకు తిరుగులేదు. అంతో ఇంతో పోటీ వున్నా, ఆదిత్యదే ఈ రంగంలో పైచేయి. ముఖ్యంగా యూ ట్యూబ్ హక్కులు తీసుకోవడంలో, దానిపై ఆదాయం సంపాదించడంలో ఆదిత్య అందరికన్నా ముందు వుంది.
ఇప్పుడు గట్టి పోటీ తగలబోతోంది. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో అధినేత అయిన దగ్గుబాటి సురేష్ బాబు ఈ రంగంలోకి ప్రవేశించబోతున్నారని తెలుస్తోంది.
అతి త్వరలో ఎస్ పి మ్యూజిక్ అనే లేబుల్ ను ఆయన ప్రారంభించబోతున్నారని బోగట్టా. సురేష్ ప్రొడక్షన్స్ కు షార్ట్ కట్ అన్నమాట. ఈ లేబుల్ మీది అడియో, వీడీయో హక్కులు తీసుకుని విడుదల చేసుకుంటారు.
సిడి అమ్మకాలు అన్నది ఏనాడో దాదాపు బంద్ అయింది. అయితే ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లు, ఎఫ్ ఎమ్ లు, వివిధ మ్యూజిక్ యాప్ లు, యూ ట్యూబ్ ఇలా అనేక డిజిటల్ మాధ్యమాల ద్వారా మంచి ఆదాయమే వచ్చే అవకాశం వుంది.
పెద్ద హీరోల అడియో, వీడీయో హక్కులు రెండు నుంచి మూడు కోట్ల వరకు పలుకుతున్నాయి. ఎక్కడ మంచి మార్కెట్, మంచి ఆదాయం వుంది అంటే ఆ రంగంలోకి ప్రవేశించడం తెలివైన వ్యాపారి లక్షణం. ఆ లెక్కన సురేష్ బాబు ఈ రంగంలోకి ప్రవేశించడం అంటే ఇక్కడ గట్టి లాభాలు వున్నాయని పసిగట్టినట్లే.