ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ యువనేత నారా లోకేశ్ మరోసారి నోరు పారేసుకున్నారు. ఇటీవల కర్నూలు జిల్లాలో హత్యకు గురైన అన్నదమ్ముల కుటుంబాలను లోకేశ్ పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా లోకేశ్ మీడియాతో మాట్లా డుతూ గతంలో ఎన్నడూ లేనంతగా తీవ్ర ఆగ్రహావేశానికి లోనయ్యారు. ముఖ్యమంత్రిని వాడు, వీడు అంటూ తూలనాడారు. ముఖ్యమంత్రిపై అభ్యంతరకర భాషను ప్రయోగించిన లోకేశ్‌పై …వైసీపీ నేతలు అదే స్థాయిలో చెలరేగిపోయారు.
హత్యకు గురైన భావోద్వేగ పరిస్థితుల నేపథ్యంలో లోకేశ్ ఆవేశంతో సీఎంపై నోరు పారేసుకున్నారని చాలా మంది భావించారు. కానీ కాసేపటి క్రితం జగన్‌పై అదే స్థాయిలో లోకేశ్ అసహనం వ్యక్తం చేయడంతో పాటు అసభ్య పదజాలంతో దూషణకు దిగారు. దీంతో సీఎంపై ఉద్దేశ పూర్వకంగానే లోకేశ్ తిట్ల పురాణానికి దిగారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాడేపల్లిలో సీఎం నివాసానికి ఒకటిన్నర కిలో మీటర్ దూరంలో యువతిపై అత్యాచారం నేపథ్యంలో నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు.
‘జనం తిరగబడతారనే భయంతో రెండేళ్లుగా తాడేపల్లి ప్యాలెస్‌లో హోం ఐసోలేషన్ అయిన సీఎం జగన్ రెడ్డి గారూ! మీ ప్యాలెస్‌కి కూత వేటు దూరంలో ఒక యువతిని దుండగులు అత్యంత దారుణంగా అత్యాచారం చేశారనే సమాచారమైనా మీకు తెలుసా?. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టే పోలీసులు ఓ అమ్మాయికి ఇంత అన్యాయం జరిగితే ఏమ య్యారు? సొంత చెల్లెళ్లకే న్యాయం చేయలేనోడు అన్న కాదు దున్న’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆడపిల్లకి అన్యాయం జరిగితే గన్ కంటే ముందొస్తాడు జగన్ అంటూ పంచ్ డైలాగులేశారని లోకేశ్ దెప్పి పొడిచారు. ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఇంత అన్యాయం జరిగితే ఏడమ్మా జగన్? అని లోకేశ్ గట్టిగా ప్రశ్నించారు. యువతిపై అత్యాచారం నేపథ్యంలో ప్రభు త్వాన్ని ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎండగట్టడంలో ఎలాంటి అభ్యంతరం లేదు.
కానీ అన్న కాదు దున్న అంటూ సంబోధించడం దేనికి సంకేతం? పంచ్ డైలాగ్‌ల కోసం సీఎంపై అవాకులు చెవాకులు పేలడం ఏంటనే నిలదీతలు అధికార పార్టీ నుంచి వస్తున్నాయి. లోకేశ్ దూషణల నేపథ్యంలో వైసీపీ రియాక్షన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకుంది.