Advertisement

Advertisement


Home > Movies - Movie News

సేమ్ సీన్ రిపీట్.. మళ్లీ వరుసపెట్టి విడుదల తేదీలు

సేమ్ సీన్ రిపీట్.. మళ్లీ వరుసపెట్టి విడుదల తేదీలు

కొన్ని నెలల కిందటి సంగతి.. టాలీవుడ్ లో థియేట్రికల్ వ్యవస్థ గాడిన పడిందని నిర్థారణకు వచ్చిన వెంటనే యూనిట్స్ అన్నీ వరుసపెట్టి తమ సినిమాల విడుదల తేదీలు ప్రకటించాయి. చిరంజీవి, మహేష్, ప్రభాస్ లాంటి హీరోల నుంచి చిన్న హీరోల వరకు అంతా తమ సినిమాల విడుదల తేదీలు ప్రకటించడానికి పోటీలు పడ్డారు. ఒకర్ని మించి మరొకరు అన్నట్టు కర్చీఫ్ లు వేశారు.

కట్ చేస్తే, అలా ప్రకటించిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. సెకెండ్ వేవ్ వల్ల చాలా సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి. ఇప్పుడు సెకెండ్ వేవ్ పరిస్థితులు మెల్లమెల్లగా సర్దుకుంటున్నాయి. తెలంగాణలో థియేటర్లు తెరిచారు. ఏపీలో కూడా రేపోమాపో తెరుస్తారన్నట్టుంది పరిస్థితి. ఈ నేపథ్యంలో మేకర్స్ అంతా మరోసారి తమ సినిమాల కొత్త రిలీజ్ డేట్స్ ప్రకటించడానికి సమాయత్తమౌతున్నారు.

ఇందులో భాగంగా ముందుగా బాలకృష్ణ అఖండ సినిమా నుంచి ప్రకటన వచ్చేలా ఉంది. లెక్కప్రకారం మే 28న ఈ సినిమా విడుదలవ్వాలి. కానీ వాయిదాపడింది. అలా పోస్ట్ పోన్ అయిన ఈ సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

అటు టక్ జగదీశ్, లవ్ స్టోరీ సినిమాల రిలీజ్ డేట్స్ కూడా త్వరలోనే బయటకు రాబోతున్నాయి. పరిస్థితులు ఎప్పుడు చక్కబడితే అప్పుడు ట్రయిలర్ రిలీజ్ చేసి, దాంతో పాటు విడుదల తేదీ కూడా చెబుతామని నాని గతంలోనే ప్రకటించాడు. అలా ప్రకటించే రోజు దగ్గర్లోనే ఉంది. ఇటు లవ్ స్టోరీ నిర్మాతలు కూడా తమ సినిమా విడుదల తేదీని ఈ నెలాఖరుకు ప్రకటించే అవకాశం ఉంది.

దగ్గుబాటి కాంపౌండ్ నుంచి కూడా 2 రిలీజ్ డేట్స్ రాబోతున్నాయి. వీటిలో ఒకటి విరాటపర్వం  కాగా, రెండోది నారప్ప సినిమా. ఈ రెండు సినిమాలు రెడీగా ఉన్నాయి. ఓటీటీలోకి రావనే క్లారిటీ కూడా ఇదివరకే ఇచ్చారు.

ఈ సినిమాలతో పాటు ఖిలాడీ, ఆచార్య, పాగల్, కేజీఎఫ్ ఛాప్టర్-2, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఎఫ్3 సినిమాల నుంచి కూడా ప్రకటనలు వరుసపెట్టి రాబోతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో థియేటర్లు ఎప్పట్నుంచి తెరుస్తారు, తెరిచిన తర్వాత ఎన్ని రోజులకు వందశాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇస్తారనే అంశంపై పెద్ద సినిమాల విడుదల తేదీలు ఆధారపడి ఉన్నాయి. మిగతా సినిమాలన్నీ 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లలోకి రాబోతున్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?