బిగ్‌బాస్ రియాల్టీ షో సీజన్-4లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరికి బిగ్‌బాస్ విన్నర్ కంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎక్కువ మొత్తంలో సంపాదించిన పరిస్థితి. దీనికి అనేక భావోద్వేగ ఘటనలు తోడయ్యాయి. ముఖ్యంగా బిగ్‌బాస్ ఫైనల్‌కు వచ్చే సరికి సోహైల్‌కు అన్నీ కలిసొచ్చాయి.
బిగ్‌బాస్ హౌజ్‌లో సోహైల్, అరియానా మధ్య ఎప్పుడూ గొడవలే. వీళ్లిద్దరి మధ్య తగాదాలు చాలా సరదాగా ఉండేవి. ఎంతో సీరియస్‌గా అనిపించి, ఆ తర్వాత వాతావరణం కూల్ కావడం ఆశ్చర్యం కలిగించేది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ హౌజ్‌లో తన శత్రువుపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకుంటానని, తనతో చేతులు కలపాలని సోహైల్ కోరడం విశేషం.
బిగ్‌బాస్ హౌజ్‌లో అరియానాతో గొడవకు కారణమైన చింటు(అరియానా ఫేవరెట్ కోతి బొమ్మ)ను సోహైల్ ఎత్తుకొచ్చేశాడు. ఈ మేరకు సోహైల్ ఓ వీడియో షేర్ చేశాడు. 'బిగ్‌బాస్‌లో తన శత్రువుపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చిందన్నాడు. ఫ్రెండ్స్ మధ్య చిచ్చు పెట్టాలంటే దీన్ని తీసుకెళ్లాలని కోరాడు. దీన్ని అమ్మేస్తున్నా, ఎవరైనా కొనేవాళ్లుంటే ముందుకు రావాలని ఆన్లైన్లో సేల్ ప్రకటన కూడా ఇచ్చేశాడు. ఇంకా అనేక సంగతులను సోహైల్ చెప్పాడు. ఆయన ఏమన్నారో సోహైల్ మాటల్లోనే…
“మొట్టమొదటి సారి నాకు ప్రతీకారం తీర్చుకోవాలనిపిస్తోంది. బిగ్‌బాస్ జర్నీలో నాకున్న ఒకే ఒక ఎనిమీ. అతడే ఇతడు. వీడు దొరికేశాడు. ఇక వదిలేది లేదు. నన్ను ఆపొద్దు. అసలు వీడంటూ లేకపోయుంటే బిగ్‌బాస్‌లో నా జర్నీ మరింత బాగుండేది. వీడు నా చేతికి దొరికాడు, ప్రతీకారం తీర్చుకునేందుకు నాతో చేతులు కలపండి. వీడి మీద రివేంజ్ తీసుకునేందుకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నా. భవిష్యత్తులో ఇంకెవరి మీదా ప్రతీకారం తీర్చుకోనని మాటిస్తున్నా..” అని చెప్పుకొచ్చాడు.
సోహైల్ అమ్మకం ప్రకటనపై అరియానా వెంటనే స్పందించారు. తను ఎంతో ఇష్టపడే చింటును అమ్మేస్తాననడంపై అరియానా ఫైర్ అయింది. 'అరేయ్, నిన్ను చంపేస్తా.. అది అమ్మడానికి కాదు..' అంటూ వార్నింగ్ ఇచ్చారామె. ఇలా బిగ్‌బాస్ కంటెస్టెంట్లు సరదా చేష్టలతో నవ్వులు పూయిస్తున్నారు.