అందం, ఆరోగ్యంతో ఆకర్షిస్తున్న యోగా భామలు

ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రధాని మోదీ నుంచి టాలీవుడ్ తారల వరకు అంతా తమ యోగా పోజుల్ని సోషల్ మీడియాలో పెడుతున్నారు. యోగా ఆవశ్యకతను తెలియజేస్తున్నారు. మరి ముద్దుగుమ్మలు పొద్దున లేస్తే ఎలాంటి…

ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రధాని మోదీ నుంచి టాలీవుడ్ తారల వరకు అంతా తమ యోగా పోజుల్ని సోషల్ మీడియాలో పెడుతున్నారు. యోగా ఆవశ్యకతను తెలియజేస్తున్నారు. మరి ముద్దుగుమ్మలు పొద్దున లేస్తే ఎలాంటి యోగాసనాలు వేస్తారు? ఏ హీరోయిన్ కు ఏ యోగాసనం ఇష్టమో చూద్దాం.

ఉదయం లేచిన వెంటనే కాజల్ దినచర్య యోగాతోనే మొదలవుతుంది. సూర్య నమస్కారాలు చేయకపోతే తనకు ఆ రోజంతా ఏదోలా ఉంటుందని అంటోంది ఈ చందమామ. ఇండస్ట్రీకొచ్చి 15 ఏళ్లవుతున్నా.. ఇప్పటికీ ఆమె రూపం, ఫిజిక్ చెక్కుచెదరలేదంటే దానికి యోగా కూడా ఓ కారణం.

మిల్కీబ్యూటీ తమన్న కూడా యోగా లవరే. ప్రతి రోజూ యోగసనాలు వేస్తుంది. అంతేకాదు.. నెలకు కనీసం ఓ కొత్త యోగాసనం నేర్చుకోవాలని నియమం కూడా పెట్టుకుంది. సూర్య నమస్కారాలతో పాటు హృదయ ముద్ర తనకు ఎంతో ఇష్టం అంటోంది తమన్నా.

వ్యాయమంతో ప్రారంభమైన సమంత జీవితం ఇప్పుడు యోగా టర్న్ తీసుకుంది. ఒకప్పుడు ఎక్సర్ సైజ్ కు ఎక్కువ టైమ్ కేటాయించిన ఈ బ్యూటీ, ఇప్పుడు యోగాసనాలకు ఎక్కువ టైమ్ ఇస్తోంది. గతేడాది లాక్ డౌన్ టైమ్ అంతా యోగా, టెర్రస్ గార్డెనింగ్ తోనే గడిచిపోయిందని చెబుతోంది. ప్రస్తుతం ఆమె ప్రతి రోజూ యోగా, ధ్యానం చేస్తుంది.

పాయల్ రాజ్ పుత్ నాజూకు శరీరానికి యోగానే కారణం. కెరీర్ స్టార్టింగ్ లో కాస్త బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ వ్యాయామం, యోగా ద్వారా 30 రోజుల్లో 63 కిలోల నుంచి 58 కిలోలకు తగ్గింది. అటు సీనియర్ నటి భూమిక గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమెకు చిన్నప్పట్నుంచి యోగా అలవాటు. తన భర్త భరత్ ను కూడా యోగా ద్వారానే కలుసుకుంది. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఇంట్లో రెగ్యులర్ గా యోగా చేస్తుంటారు.

హీరోయిన్ అనుష్క ఓ యోగా టీచర్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆమె వృత్తి యోగా పాఠాలు చెప్పడం. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. యోగా ద్వారా జీవితం అంటే ఏంటో తెలుసుకున్నానని, జీవన విధానాన్ని నేర్చుకున్నానని చెబుతుంది బొమ్మాలి. ఇక ఫిట్ నెక్ కోసమే పుట్టిందేమో అనిపించే రకుల్, యోగాను తన జీవితంలో ఓ భాగం చేసుకుంది. ఒకప్పుడు జిమ్ లో కసరత్తులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చిన ఈ మెరుపుతీగ, ఇప్పుడు యోగాసనాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తోంది.

యోగాను, జిమ్ ను బ్యాలెన్స్ చేస్తుంది శృతిహాసన్. పొద్దున్న జిమ్ చేస్తే, రాత్రికి యోగా చేస్తుంది. ఇప్పటికే కొన్ని యోగసనాల్లో మాస్టర్ అయిపోయింది ఈ చిన్నది. ఇక బాలీవుడ్ నుంచి సుశ్మితసేన్, శిల్పాషెట్టి, కరీనాకపూర్, బిపాసా బసు.. ఇలా చాలామంది యోగాలో ప్రావీణ్యం సంపాదించారు. అందం, ఆరోగ్యంతో పాటు మానసికోల్లాసాన్ని పొందుతున్నారు.