తెలంగాణలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. బీజేపీలో చేరాలనుకుంటున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు మానసికంగా సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌లోనే కొనసాగించాలనే ఆ పార్టీ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఏఐసీసీ దూతలుగా ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్‌రెడ్డి ఇవాళ రాజగోపాల్‌రెడ్డితో చర్చలు జరిపారు.
రాహుల్‌గాంధీతో మాట్లాడించాలని వారు అనుకున్నా, మాట్లాడేందుకు రాజగోపాల్‌రెడ్డి ఆసక్తి చూపలేదని సమాచారం. అలాగే ఢిల్లీకి రావాలని సూచించినా పట్టించుకోలేదని తెలిసింది. కాంగ్రెస్ దూతలతో భేటీ అనంతరం రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రేపటి నుంచి మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తానన్నారు. ప్రజల అభిప్రాయాల్ని తీసుకుంటానన్నారు. ప్రజలు ఓకే అంటే… మునుగోడు ఉప ఎన్నిక వస్తుందని స్పష్టం చేశారు.
మునుగోడు తీర్పు తెలంగాణ మార్పునకు నాంది కావాలని పిలుపునిచ్చారు. అంటే ఉప ఎన్నిక అనివార్యమని ఆయన చెప్పకనే చెప్పారు. మునుగోడు పోరు… కేసీఆర్ కుటుంబానికి, ప్రజల మధ్య జరిగే ధర్మ యుద్ధమని అభివర్ణించారు. ఇది పార్టీల మధ్య యుద్ధం కాదని తేల్చి చెప్పారు. కేసీఆర్ కోరుకుంటే ఉప ఎన్నిక రాదని అన్నారు. కేసీఆర్‌కు బుద్ధి చెప్పే ఎన్నిక వస్తుందని స్పష్టం చేశారు. దీనిపై తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరగాలని ఆయన కోరారు.
యుద్ధం ప్రకటించడానికి సమయాన్ని కూడా ఆయన ఫిక్స్ చేశారు. 10-15 రోజుల్లో రాజీనామాపై తేల్చేస్తానని పరోక్షంగా ఆయన అన్నారు. ఇప్పటికే తెలంగాణలో వివిధ కారణాల వల్ల మూడు ఉప ఎన్నికలు జరిగాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీ నామాతో నాలుగు ఉప ఎన్నిక వచ్చేలా ఉంది.
ఎన్నికల ముంగిట కేసీఆర్‌పై ఒత్తిడి పెంచేందుకు వ్యూహాత్మకంగా ఉప ఎన్నికకు వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. అందుకే రాజగోపాల్‌రెడ్డితో రాజీనామా చేయించి, పార్టీలో చేర్చుకుని విలువలకు కట్టుబడినట్టు సంకేతాలు ఇవ్వడం కూడా బీజేపీ వ్యూహంలో భాగం. తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహ రచన చేయడంలో మాత్రం చురుగ్గా వ్యవహరిస్తోంది.