జగన్ పై పల్లెత్తు మాట అంటే.. మంత్రి కొడాలి నాని సహా చాలామంది నేతలు వారిపై విరుచుకుపడుతుంటారు. అందులోనూ ఈసారి లోకేష్ అరే, తురే అంటూ నోరు జారారు. దమ్ముంటే రారా అంటూ సవాళ్లు విసిరారు. వాస్తవానికి లోకేష్ ది ఆ స్థాయి కాకపోయినా ఎగిరెగిరి పడ్డారు. దీంతో సహజంగానే వైసీపీ బ్యాచ్.. లోకేష్ సహా చంద్రబాబుకి చాకిరేవు పెట్టింది.
కొడాలి నాని వ్యాఖ్యలు వింటే, సిగ్గున్న ఎవరైనా వెంటనే కౌంటర్ ప్రెస్ మీట్ పెడతారు. లేదా చంద్రబాబు, లోకేష్ పై అభిమానం ఉన్న నేతలైనా మీడియా ముందుకొస్తారు. కానీ ఈ రెండూ జరగలేదు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కొడాలి మాటలకి నోరు మూసుకున్నారు. కనీసం వారిద్దరికీ సపోర్ట్ చేసే నేతలు కూడా టీడీపీలో లేకపోవడం విచిత్రం.
కడప జిల్లా నుంచి ఎమ్మెల్సీ బీటెక్ రవి మాత్రమే ఏదో నామ్ కే వాస్తేగా మంత్రి కొడాలి వ్యాఖ్యలపై స్పందించారు. మిగతా బ్యాచ్ అంతా సైలెంట్. కనీసం పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కానీ, బాబు తరపున వకాల్తాలు పుచ్చుకునే మరికొందరు సీనియర్లు కానీ ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు.
అంటే పరోక్షంగా లోకేష్ వ్యాఖ్యల్ని వారు సమర్థించలేదనే అర్థం. లేదా చంద్రబాబు, లోకేష్ నే వీధి కుక్కలతో పోల్చిన నాని, తమని ఇంకెవరితో పోలుస్తారో భయపడి టీడీపీ నేతలు తలలు పట్టుకున్నారనైనా అనుకోవాలి.
బాబు పరువుపోతే మాకేంటి..?
మంత్రి కొడాలి నాని, మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ట్విట్టర్లో విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి.. ఇలా చాలామంది లోకేష్ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు.
దమ్ముంటే చిటికెయ్ చిట్టినాయుడూ అంటూ ప్రతి సవాల్ విసిరారు. కానీ టీడీపీ నుంచి మాత్రం కనీసం ఓ స్థాయిలో కూడా ప్రతిఘటన ఎదురు కాలేదు. చంద్రబాబుని, లోకేష్ ని తిడితే మాకేంటి అని సైలెంట్ అయిపోయారు నేతలు.
పార్టీలో మసకబారుతున్న చంద్రబాబు, లోకేష్ పరిస్థితి ఈ సంఘటనే పెద్ద ఉదాహరణ. వారిద్దరకీ చీవాట్లు పెట్టినా ఎవరూ అండగా బయటకు రాలేదంటే ఇక టీడీపీలో ఆ ఇద్దర్నీ నమ్మేవారెవరున్నారో, పార్టీలో వారి ప్రాభవం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అవకాశం లేక, పార్టీని వీడలేక చాలామంది నేతలు టీడీపీలో ఉన్నారు కానీ, చంద్రబాబు, లోకేష్ పై వారికేమాత్రం అభిమానం లేదనే విషయం మరోసారి స్పష్టమైంది.