రైట్ రైట్.. ఏపీ-తెలంగాణ మధ్య మొదలైన ఆర్టీసీ

కర్ఫ్యూ సమయంలో సరిహద్దు చెక్ పోస్ట్ లతో ఏపీ, తెలంగాణ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ-పాస్ ఉంటేనే అనుమతిస్తామంటూ తెలంగాణ పోలీసులు కరాఖండిగా చెప్పడంతో కొన్నాళ్ల పాటు ఉభయ రాష్ట్రాల ప్రజలు  ప్రయాణాలు…

కర్ఫ్యూ సమయంలో సరిహద్దు చెక్ పోస్ట్ లతో ఏపీ, తెలంగాణ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ-పాస్ ఉంటేనే అనుమతిస్తామంటూ తెలంగాణ పోలీసులు కరాఖండిగా చెప్పడంతో కొన్నాళ్ల పాటు ఉభయ రాష్ట్రాల ప్రజలు  ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. 

ఓ దశలో ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను సైతం తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. ఉభయ రాష్ట్రాల ఆర్టీసీ సర్వీసులు కూడా తిరిగి ప్రారంభం అయ్యాయి. ఆన్ లైన్ రిజర్వేషన్లు కూడా తిరిగి పునరుద్ధరించారు.

అంతరాష్ట్ర బస్సు సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ పునరుద్ధరించింది. ఏపీ, కర్నాటక సహా ఇతర ప్రాంతాలకు ఈ రోజు నుంచి బస్సుల్ని నడుపుతోంది. ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు అనుసరించి టీఎస్‌ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుపుతుందని చెబుతున్నారు అధికారులు. 

రద్దీకి అనుగుణంగా రోజూ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఏపీకి బస్సు సర్వీసులు మొదలైనట్టు తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కర్నాటక సర్వీసులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఇవి సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఉంటాయి. వీకెండ్ లో కర్నాటకకు బస్సులు ఉండవు.

ఏపీలో నేటి నుంచి నిబంధనల సడలింపు..

ఏపీలో ఈ రోజు నుంచి సడలించిన కర్ఫ్యూ నిబంధనలు అమలులోకి వచ్చాయి. దీంతో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సులు నడపడానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేశారు. 

రాష్ట్రంలోని బస్సు సర్వీసుల్ని గణనీయంగా పెంచారు. సామాన్యులకు ఆర్టీసీ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తున్నాయి. ఏపీనుంచి తెలంగాణకు 120 సర్వీసులు ఈరోజునుంచి అందుబాటులో ఉంటాయి. ప్రయాణాలన్నీ సాయంత్రం 6గంటలలోపు పూర్తయ్యేలా ప్రణాళికలు రచించారు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు.