ఉమ్మడి రాష్ట్రం విడిపోయి ఏడేళ్లయింది. కానీ ఇప్పటివరకు దానికి చిరునామా లేదు. ఏ రాష్ట్రానికైనా, దేశానికైనా చిరునామా ఏమిటి? రాజధాని నగరం. కానీ ఏపీకి అదే లేకుండా పోయింది. 2024 కు రాష్ట్రం విడిపోయి పదేళ్లవుతుంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండుంటే దాని గడువు కూడా ఆ సంవత్సరంతో తీరిపోయేది.
ఒక విధంగా చెప్పాలంటే హైదరాబాదు ఇప్పటికీ ఉమ్మడి రాజధానిగా ఉందనే చెప్పొచ్చు. పరిపాలన ఏపీ నుంచే సాగుతున్నా అనేక విషయాల్లో ఏపీ ప్రజలు హైదరాబాద్ మీదనే ఆధారపడ్డారు. వారంతమైతే చాలు హైదరాబాదుకు ఏపీ నుంచి వాహనాలు బారులు తీరుతాయి.
సరే అదలా ఉంచుదాం. వచ్చే ఎన్నికల నాటికైనా ఏపీకి రాజధాని అనేది ఉంటుందా? జగన్ కోరిక ప్రకారం మూడు రాజధానులు ఏర్పడతాయా? ఇప్పటివరకు ఏపీకి రాజధాని లేకపోవడానికి కారకులు ఇద్దరు. ఒకరు విభజత ఏపీకి మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరొకరు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
బాబుది కీర్తి కండూతి, ఓవర్ యాక్షన్. జగన్మోహన్ రెడ్డిది మొండితనం, రాజకీయ కక్ష. ఈ ఇద్దరూ కలిసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీ ప్రజలు హైదరాబాద్ మహా నగరాన్ని పోగొట్టుకున్నారు.
ఏపీ ప్రజలకు హైదరాబాద్ పోవడమంటే గుండెకాయ పోయినట్లే. దశాబ్దాల అనుబంధం ఉన్న నగరాన్ని, బతుకుతెరువు చూపించే నగరాన్ని, భవిష్యత్తు తరాలకు మంచి మంచి జీవితాన్ని, మెరుగైన జీవితాన్ని అందించే నగరాన్ని కోల్పోవడం నిజంగా బాధాకరమే. ఈ పాయింటును పట్టుకున్న చంద్రబాబు నాయుడు శ్రీకృష్ణ దేవరాయలు టైపులో లేదా హైదరాబాదును నిర్మించిన కులీకుతుబ్ షాహీ తరహాలో కీర్తి సంపాదించాలనుకున్నాడు.
చరిత్రలో తన పేరు నిలిచి పోవాలనుకున్నాడు. తన గురించి తరతరాల వారు చెప్పుకోవాలనుకున్నాడు. అందుకే కొత్తగా ఒక మాహా నగరం నిర్మిచాలనుకున్నాడు. దానిపై ప్రజల్లో ఎన్నో ఆశలు మొలకెత్తించాడు. హైదారాబాద్ పోతేపోయింది …దాన్ని తలదన్నే మహా నగరాన్ని, మెగా సిటీని నిర్మిస్తానని చెప్పాడు. ప్రపంచంలోని అయిదు గొప్ప రాజధానుల్లో అమరావతి ఒకటవుతుందన్నాడు.
ఇంద్రుడి అమరావతి దీని ముందు దిగడుపేనన్నాడు. మహా నగరం నిర్మించాలని ఆ దేవుడే తనను ఆదేశించాడని చెప్పాడు. అమరావతి నగర నిర్మాణం గురించి బాబు అరచేతిలో వైకుంఠం చూపించాడు. కతలు వినిపించాడు. ఏడాదికి మూడు పంటలు పండే 33వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించాడు. ఇది చాలదు అటవీ భూమి కూడా కావాలన్నాడు.
బాబు అనుకూల మీడియా ఆయన్ని ఆకాశానికి ఎత్తేసింది. నయాపైసా ఖర్చు పెట్టకుండా వేల ఎకరాల భూ సేకరణ చేయడం సామాన్యమైన విషయం కాదని బాబు అనుకూల మీడియా డప్పు కొట్టింది. చివరకు బాహుబలి సినిమాలో ఉన్న మాహిష్మతి నగరం టైపులో తాను నిర్మిస్తున్న నగరం ఉండాలని దాని దర్శకుడు రాజమౌళిని సైతం పిలిపించి మాట్లాడాడు.
ప్రపంచంలోని రాజధాని నగరాలన్నీ బాబు బృందం పరిశీలించింది. అమరావతి నిర్మాణానికి విదేశీ కంపెనీలు వచ్చి వాలిపోయాయి. ఒక దశలో బాబు ఇండియా కంపెనీలను అసహ్యించుకున్నాడు. అప్పట్లో అమరావతి నిర్మాణంపై బాబు చేసిన ఓవర్ యాక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించడంతోనే ఆయన పదవీ కాలం గడిచిపోయింది.
అనుకున్నది చేయలేకపోయాడు. వాస్తవానికి బాబు ఆనాడే విశాఖలాంటి అందమైన, సకల సౌకర్యాలున్న నగరాన్ని ఎంచుకొని పరిపాలనకు అవసరమైన భవనాలు నిర్మించి ఉంటే కాలక్రమంలో నగరం సహజంగానే అభివృద్ధి చెంది ఉండేది. ఉమ్మడి ఏపీలోనూ హైదరాబాదు తరువాత విజయవాడ, విశాఖను ప్రముఖంగా చెప్పుకునేవారు.
కులీకుతుబ్ షాహీ కూడా ఆనాడు నిర్మించింది ఇప్పుడు పాతబస్తీగా చెప్పుకునే హైదరాబాదును మాత్రమే. కాలక్రమంలో నగరం ఇప్పటి ఆధునిక నగరంగా రూపుదిద్దుకుంది. మహానగరం నిర్మిచాలని బాబు ఆశపడటమే ఆయన చేసిన పెద్ద తప్పు. ఆ కీర్తి కండూతి ఆయన కొంపముంచింది. ఆనాడు వెంకయ్య నాయుడులాంటి కొందరు విజ్ఞులు బాబు ఆలోచనా విధానాన్ని తప్పుబట్టారు.
ఇక జగన్ చేసిన తప్పు మూడు రాజధానులు అనడం. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతి నిర్మాణాన్ని తప్పుపట్టలేదు. పైగా సమర్ధించాడు కూడా. కానీ ఎవరు సలహా ఇచ్చారోగానీ మూడు రాజధానులను తెరమీదికి తెచ్చాడు. జగన్ అధికారంలోకి వచ్చేనాటికి అమరావతిలో కొన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి. బాబు చేసింది తప్పో రైటో మిగిలిన నిర్మాణాలను జగన్ పూర్తి చేసి ఉండాల్సింది. కానీ ఆ పని చేయలేదు.
పైగా అమరావతి స్మశానమని, ఎడారి అని మంత్రులు ఎద్దేవా చేశారు. అమరావతి మీద ఆశలు పెట్టుకున్న ప్రజలు సహజంగానే ఆందోళనకు దిగారు. భూములు వారు ఉచితంగా ఇచ్చారు కాబట్టి ఆ బాధ వారికి ఉంటుంది.
జగన్ మూడు రాజధానులు అనకుండా విశాఖను రాజధాని చేస్తానని, అమరావతి ప్రజలకు అన్యాయం చేయనని చెప్పి ఉంటే బాగుండేది. కానీ వైసీపీ మంత్రులు కూడా నోటికొచ్చినట్లు మాట్లాడి ఓవర్ యాక్షన్ చేశారు. చివరకు జగన్ ప్లాన్ కూడా నెరవేరుతుందా అనే అనుమానం కలుగుతోంది. ఏపీ ప్రజలు రెంటికీ చెడ్డ రేవడిలా అయ్యారు.