ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 400 దాటింది. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు చేసిన పరీక్షల్లో కొత్తగా 24 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. వీటితో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 405కు చేరినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
కొత్తగా బయటపడిన 24 కేసుల్లో కేవలం గుంటూరు నుంచే 17 కేసులు ఉండడం ఆందోళన కలిగించే విషయం. కర్నూలు నుంచి 5, ప్రకాశం-కడప జిల్లాల నుంచి చెరొక కేసు కొత్తగా నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 7201 శాంపిల్స్ ను పరీక్షించగా.. 6796 మందికి కరోనా నెగెటివ్ వచ్చింది. 11 మంది డిశ్చార్జ్ అవ్వగా.. ఆరుగురు చనిపోయారు. ప్రస్తుతం 388 మంది వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు.
గుంటూరులో ఇప్పటికే 12 ప్రాంతాల్ని రెడ్ జోన్లుగా ప్రకటించింది ప్రభుత్వం. ఆ 12 ప్రాంతాల్ని పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఈరోజు ఉదయం నుంచి ఇంటింటి సర్వే ప్రారంభించారు. రేపటికి ఈ 12 ప్రాంతాల్లో సర్వే పూర్తవుతుంది. కొత్తగా వచ్చిన 17 కేసులు కూడా ఈ రెడ్ జోన్ల నుంచే నమోదయ్యాయి.
ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు వచ్చిన ఫలితాల ప్రకారం.. కర్నూలులో 82, గుంటూరులో 75 పాజిటివ్ కేసులున్నాయి. ప్రకాశంలో 41, కృష్ణాలో కరోనా బాధితులు లెక్కతేలారు. తాజాగా వెలువడిన రిజల్ట్స్ లో విశాఖ, నెల్లూరు నుంచి కొత్తగా పాజిటివ్ కేసులు లేకపోవడం ఊరట కలిగించే అంశం.