సోనూ సూద్.. ఈ పేరు చెప్పగానే తెలుగులో అతడు నటించిన విలన్ పాత్రలు గుర్తొస్తాయి. తెరపై అత్యంత కర్కసంగా, క్రూరంగా కనిపించే సోనూ సూద్.. నిజజీవితంలో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు. మరీ ముఖ్యంగా ఈ కరోనా కష్టకాలంలో పేదలకు, వైద్యులకు సాయం చేసేందుకు ఏమాత్రం ఆలోచించడం లేదు. భారీగా ఖర్చుపెడుతున్నాడు
కరోనాను ఎదుర్కొనేందుకు కష్టపడుతున్న వైద్యుల కోసం ఏకంగా తన హోటల్ ను ఇచ్చేశాడు సోనూ సూద్. ముంబయిలోని ఖరీదైన జుహూ ప్రాంతంలో శక్తిసాగర్ పేరిట సోనూకు ఓ హోటల్ ఉంది. 6 అంతస్తుల ఈ హోటల్ ను పూర్తిగా వైద్యులకు కేటాయించాడు సోనూ సూద్. రోజంతా శ్రమిస్తున్న వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది ఎవరైనా తన హోటల్ కు వచ్చి ఉచితంగా బస చేయొచ్చని ఆహ్వానిస్తున్నాడు.
ఈ మేరకు మున్సిపల్ అధికారులు, ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలకు సోనూసూద్ సమాచారం అందించాడు. తన హోటల్ లో ఉండే వైద్య సిబ్బందికి పూర్తి సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చాడు. కేవలం ఒకటి, రెండు అంతస్తులు కాకుండా 6 అంతస్తుల్లో ఉన్న గదులన్నీ వాడుకోవచ్చని ఆఫర్ ఇచ్చాడు.
కేవలం ఇక్కడితో ఆగిపోలేదు సోనూ సూద్. లాక్ డౌన్ కారణంగా ఉపాథి లేక ఆకలితో అలమటిస్తున్న పేదలకు ఆహారం అందిస్తున్నాడు. అది కూడా వంద మందికో, 200 మందికో కాదు.. ప్రతి రోజూ 45వేల మందికి ఆహారం అందిస్తున్నాడు సోను. ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ తో కలిసి అంధేరి, జుహు, బాంద్రా ప్రాంతాల్లో ఉన్న పేదలందరికీ ఉచితంగా ప్రతి రోజూ ఆహారం అందిస్తున్నాడు. ఒకవేళ లాక్ డౌన్ ను పొడిగించినా తను తగ్గనని, లాక్ డౌన్ కొనసాగినన్ని రోజులు పేదలకు ఉచితంగా ఆహారాన్ని అందిస్తానని చెబుతున్నాడు.