టాలీవుడ్ లో ఒక్క సారిగా యాంటీ గిల్డ్ స్వరాలు వినిపించడం ప్రారంభమయ్యాయి. మొన్నటికి మొన్న నిర్మాత అభిషేక్ నామా గొంతు ఒక్కటే వినిపించింది. ఆ తరువాత రామ సత్యనారాయణ గొంతు కలిపారు. ఈ లోగా కౌన్సిల్, చాంబర్ కలిసి గిల్డ్ నిర్ణయాలను పూర్తిగా ఏకీభవించలేదు.
ఈ లోగా గిల్డ్ సమావేశాలు, అది ఏర్పాటు చేసిన కమిటీల సమావేశాలు జరుగుతున్నాయి. మరోపక్క గిల్డ్ లోని సభ్యులు ఇద్దరు తమ తమ సినిమాల షూటింగ్ లు ఆపమని మెల్లగా చెప్పినట్లు వార్తలు వినిపించాయి.
ఈ లోగా ఈ రోజు సీనియర్ నిర్మాత అశ్వనీదత్ గొంతు విప్పారు. ఆయన కుమార్తె స్వప్న గిల్డ్ వ్యవహారాల్లో కీలకంగా వున్నారు. అశ్వనీదత్ గిల్డ్ ను దాదాపు కడిగిపారేసారు. ఈలోగా నిర్మాత బండ్ల గణేష్ అడియో క్లిప్ లు వదిలారు. అందులో గిల్డ్ సభ్యులను పరోక్షంగా పదునుగా విమర్శించారు. షీట్ కి కాల్ షీట్ కు తేడా తెలియని వారంతా నిర్మాతలే అంటూ ఎద్దేవా చేసారు.
నిజానికి గిల్డ్ మరీ అంత పాపం ఏమీ చేయలేదు. టాలీవుడ్ పరిస్థితుల చక్కదిద్దాలనే చూస్తోంది. కానీ ఎందుకు మిగిలిన వారు దాని బాటను అంగీకరించడం లేదు అన్నది అనుమానం. ఇక్కడ గిల్డ్ మీద కోపం అనే కన్నా, దాని సారధి దిల్ రాజు మీద కోపమే ఎక్కువ అని అనిపిస్తోంది.
దిల్ రాజు మాట తీరు, ప్రవర్తన కొంచెం వైవిధ్యంగా వుంటాయి. అన్నీ నేనే..అంతా నాకే తెలుసు..నాదే కంట్రోలు అన్నట్లుగా అనిపిస్తుంది చూసేవారికి.
ఇండస్ట్రీ జనాలకు అది పెద్దగా నచ్చడం లేదని బోగట్టా. గిల్డ్ సారథ్యం నుంచి ఆయన తప్పుకుని వేరే వారికి పగ్గాలు అప్పగిస్తే అది వేరుగా వుండేదేమో అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
థియేటర్లను, నైజాం డిస్ట్రిబ్యూషన్ ను తన కంట్రోల్ లో వుంచుకుని సినిమాల విడుదలను దిల్ రాజు శాసిస్తున్నారు. అది వాస్తవం. ఇది కూడా ఆయన మీద పరోక్ష కోపానికి కారణం. అది కాస్తా గిల్డ్ కు శాపంగా మారుతోందేమో?