దేశంలో బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటి కర్ణాటక. దేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రాల్లో ఒకటి ఉత్తరప్రదేశ్. సారవంతమైన భూములున్న రాష్ట్రం, సగభాగమంతా నీటి వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతం, బెంగళూరు వంటి తిరుగులేని నగరం ఉన్న రాష్ట్రం కర్ణాటక. కష్టపడే స్వభావం, భిన్నమైన సంస్కృతుల మిశ్రమం, అద్భుతమైన వాతావరణం.. ఇలా ఎలా చూసినా.. సగటు భారతీయుడు మనుగడ సాగించడానికి బోలెడన్ని అనుకూలతలు ఉన్న రాష్ట్రం కర్ణాటక.
ఈ మధ్యనే.. ఒక ఇంగ్లిష్ దిన పత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఒకవేళ మీకు వేరే నగరంలో ఎక్కడైనా సెటిలయ్యే అవకాశం వస్తే.. మీ ఛాయిస్ ఏమిటి? అనే ప్రశ్నకు తెలుగు వాళ్లో చాలా మంది మైసూరు పేరు చెప్పారట! ఇండియాలో తమకు అవకాశం ఉంటే.. ఎంచక్కా మైసూరు ప్రాంతంలో సెటిలవుతామని తెలుగువారు ఆ అధ్యయనం చెప్పారట! ఇలా బయటి వారిని కర్ణాటక బాగా ఆకర్షిస్తూ ఉంది.
మరి కర్ణాటకను ఏలుతున్న వారు మాత్రం.. ఈ మోస్ట్ సక్సెస్ ఫుల్ స్టేట్ ను యూపీతో పోల్చుకోవడానికి తెగ ఉబలాటపడుతూ ఉన్నారు. అశాంతి, అస్పృశత్యలు, అత్యాచారాలతోనే తరచూ వార్తలతో నిలిచే యూపీ పేరును తెగ ఉచ్ఛరిస్తున్నారు కర్ణాటక బీజేపీ నేతలు!
కర్ణాటక బీజేపీ వర్కర్లను కదిలిస్తే.. అర్జెంటుగా దేశానికి యోగి ఆదిత్యనాథ్ ను ప్రధానిగా చేయాలంటారు. తాజాగా అక్కడ సంఘ్ పరివార్ సభ్యుల నినాదం ఏమిటంటే.. కర్ణాటకలో యోగి మోడల్ ను ప్రవేశ పెట్టాలట. ఈ మధ్యనే బీజేపీ అధిష్టానం ఏరి కోరి బొమ్మైని సీఎంగా చేయగా.. ఆయనకు సంఘ్ పరివార్ సభ్యులు చేస్తున్న డిమాండ్.. కర్ణాటకలో యోగి మోడల్ ను ప్రవేశ పెట్టడం.
ఇప్పటికే మతమార్పిడిల నిషేధం, ఆ పై స్కూళ్లలోకి ముస్లిం యువతుల వస్త్రధారణపై వివాదాలతో కర్ణాటకలో తాము అనుకున్న రచ్చను చేయగలుగుతున్నారు బీజేపీ వాళ్లు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ మోడల్ అంటూ.. ఆక్రందనల మధ్యన ఉన్న రాష్ట్రంతో కర్ణాటకను పోలుస్తూ కమలనాథులు చందన సీమను ఎక్కడికో తీసుకెళ్లాలంటూ కంకణం కట్టుకున్నట్టుగా ఉన్నారు!