చంద్రబాబు.. దింపుడు కళ్లెం ఆశకంటె జాస్తి!

తనను మించిన అత్యద్భుతమైన నాయకుడు ఇలలో లేనేలేడని, తన పార్టీని మించిన అతి గొప్ప పార్టీ భవిష్యత్తులో కూడా ఉండబోదని సొంత డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబును మించిన వారు ఉండకపోవచ్చు. Advertisement చంద్రబాబు రాజకీయ…

తనను మించిన అత్యద్భుతమైన నాయకుడు ఇలలో లేనేలేడని, తన పార్టీని మించిన అతి గొప్ప పార్టీ భవిష్యత్తులో కూడా ఉండబోదని సొంత డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబును మించిన వారు ఉండకపోవచ్చు.

చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం ముడిపడి ఉన్న ఏపీలోనే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఉంటుందా? ఊడుతుందా? అన్నట్లుగా ఉంది. తెలంగాణలో ఆ పార్టీ సమాధి అయిపోయి చాలా కాలం అయింది. ఏదో పార్టీకి కార్యవర్గాన్ని ప్రకటించుకుంటూ.. తమ పార్టీ అస్తిత్వంలోనే ఉన్నట్టుగా చంద్రబాబు బిల్డప్ ఇచ్చుకుంటున్నారు.

అలాంటి చంద్రబాబు తాజాగా.. తెలంగాణలో తెలుగుదేశం మళ్లీ బలపడుతోందని అనడం.. రాజకీయాల్లో ఇటీవలి కాలంలో అతిపెద్ద జోక్ లాగా వినపడుతోంది.

సాధారణంగా దింపుడు కళ్లెం ఆశ అని ఒకటి ఉంటుంది. ఎవరైనా మరణించినప్పుడు, శ్మశానానికి తీసుకువెళ్లిన తర్వాత.. చితి మీద పెట్టడానికి ముందు ఒకసారి పాడెను భుజాల మీదనుంచి దించి నేల మీద పెట్టి.. మరణించిన వారి చెవిలో వారి పేరుపెట్టి పిలుస్తారు. అంటే చనిపోయారని తెలిసినా కూడా, ఏదైనా అద్భుతం జరిగి తిరిగి వస్తారేమో అని చివరి ఆశ అన్నమాట. దీనినే దింపుడుకళ్లెం ఆశ అంటారు.

చంద్రబాబునాయుడు తెలంగాణ తెలుగుదేశం గురించి అంటున్న ఇలాంటి మాటలను.. దింపుడు కళ్లెం ఆశలుగా అభివర్ణించడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే.. ఆల్రెడీ స్వయంగా చంద్రబాబునాయుడు చేతుల మీదుగానే.. తెలంగాణ తెలుగుదేశాన్ని సమాధి చేయడం కూడా అయిపోయింది.

తెలంగాణలో తెలుగుదేశం ఎన్నడో అంతర్ధానం అయిపోయింది. అలా పార్టీ సర్వనాశనం అయిపోవడానికి అధినేత చంద్రబాబునాయుడు తన శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఏ కాంగ్రెస్ పార్టీని మట్టుపెట్టడానికి ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని స్థాపించారో.. అదే కాంగ్రెస్ పార్టీ పల్లకీని తెలుగుదేశం కార్యకర్తలతో మోయిస్తూ, వారితో పొత్తు పెట్టుకున్నప్పుడే.. తెలంగాణ తెలుగుదేశానికి చంద్రబాబు మరణశాసనం రాసేశారు.

తెలంగాణలో పార్టీ కోసం నికరంగా ఒక్కరోజు సమయమైన గత కొన్ని సంవత్సరాలుగా కేటాయించని చంద్రబాబునాయుడు..  కేవలం ఎప్పుడైనా కొన్ని గంటల పాటు పార్టీ నాయకుల సమావేశాలు మాత్రం నిర్వహిస్తున్నారు. ఇంకెక్కడా గతిలేని నాయకులు మాత్రమే ఆ పార్టీలో మిగిలి ఉన్నారు. అలాంటిది.. ఏదో భద్రాద్రి ప్రాంతంలో ఒక దఫా పర్యటించే అవసరం ఏర్పడగానే.. భద్రాద్రి జిల్లాలో తమ పార్టీకి చాలా ఆదరణ ఉందని.. తెలంగాణలో తెలుగుదేశం చాలా బలపడిపోతున్నదని.. ఓవర్ యాక్షన్ డైలాగులు కొట్టడం చంద్రబాబుకే చెల్లింది.

ఒకసారి భూస్థాపితం అయిన పార్టీ మళ్లీ జవజీవాలు పుంజుకోకూడదని రూలేం లేదు. ఒకప్పట్లో పార్లమెంటులో రెండేసీట్లు కలిగిఉన్న బిజెపి, ఇప్పుడు తిరుగులేని హవా కొనసాగిస్తోంది. అయితే తెలంగాణలో పార్టీ పరంగా ఎలాంటి శ్రద్ధ పెట్టకుండా.. బలపడుతోందనే నాటకీయ డైలాగులు వల్లిస్తే.. దానిని ఓఏ అని అనాల్సిందే కదా!!