Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఎంపీ కాగల యోధులకే కమలదళం ఎర!

ఎంపీ కాగల యోధులకే కమలదళం ఎర!

కమలదళం తమ శక్తియుక్తులు యావత్తూ.. ఎంపీగా నెగ్గగల యోధుల మీదనే పెడుతూ ఉంటుందని జనంలో ఒక అభిప్రాయం ఉంది. రాష్ట్రాల్లో పార్టీ ఎలా తగలబడిపోయినా, రాష్ట్రప్రభుత్వాలు తమకు దక్కినా దక్కకపోయినా.. వారికి పెద్దగా ఫరక్ పడదు. కేంద్రంలో మాత్రం తామే అధికారంలో ఉండేలాగా చూసుకోవడమే వారికి ఫస్ట్ ప్రయారిటీ! తెలంగాణలో ప్రస్తుతం కమలదళం మరింత బలోపేతం కావడంలో భాగంగా.. ఇతర పార్టీల్లోని నాయకులకు ఎరవేయడాన్ని గమనిస్తోంటే.. ఈ సిద్ధాంతం మరోమారు నిరూపణ అవుతున్నట్లుగా కనిపిస్తోంది.

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి వారికి కొంత భవిష్యత్తుపై ఆశలు పుట్టించే రీతిలో ఉంది. ఎందుకంటే.. ముస్లిం జనాభా కూడా చెప్పుకోదగ్గంతగా ఉండే ఈ రాష్ట్రంలో మతం కార్డు మీద మనుషుల్ని పోలరైజ్ చేయడం సులభం. మతం పేరు మీద వారందరినీ చీలిస్తే.. బిజెపికి ఎక్కువ లబ్ధి ఉంటుంది. కాబట్టి.. వారు రాష్ట్రంలో అధికారంలోకి రాగలం అని అనుకుంటున్నారు. 

మరో ఏడాదిలోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఇప్పుడు బిజెపి కొత్త బలాన్ని అందిపుచ్చుకోవడంపై దృష్టి పెడుతోంది. ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకుంటోంది. ఇంకా చాలా మంది నాయకులు బిజెపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి కొందరి చేరికలు పూర్తయ్యాయి, అవుతున్నాయి. ఈ చేరికలకు ప్రాతిపదిక ఏమిటి? అని ఆలోచించినప్పుడు.. తొలిదశలో ఎంపీగా కూడా గెలవగల గట్టి, బలమైన అభ్యర్థుల కోసమే వల వేస్తున్నట్టు కనిపిస్తోంది. 

తెరాస, కాంగ్రెస్ పార్టీల్లో గతంలో ఉన్నటువంటి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇప్పుడు బిజెపిలో చేరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరిక కూడా దాదాపుగా ఖరారు అయిపోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బిజెపిలో చేరడానికి చాలా మంది ఉత్సాహపడుతుండగా.. తొలిదశలో వీరిద్దరే ఎందుకు అనే చర్చ రావడం సహజం.

వీరిద్దరూ బలమైన అభ్యర్థులు. ఇంత బలమైన వారే చేరారంటే.. మిగిలిన నాయకులు పెద్దగా బేరసారాలకు దిగకుండా చేరిపోతారు. ఇదొక వ్యూహం. ఈ ఇద్దరి మధ్య సారూప్యతలు కొన్ని ఉన్నాయి. ఇద్దరూ ఎంపీగా పోటీచేసి నెగ్గగల బలం ఉన్నవారు. ఆర్థిక వనరులు ఉన్నవారు. ఎంపీలుగా వీరికి అవకాశం ఇస్తే.. వీరి పరిధిలోని ఎమ్మెల్యే సీట్లు ఏడింటినీ కూడా గెలిపించుకోవడానికి అవసరమైన ఆర్థిక వనరులను స్వయంగా సమకూర్చగల వారు. బిజెపి లాంటి పార్టీకి ఇది చాలా పెద్ద లాభం. ఎమ్మెల్యేల విషయంలో తేడా కొట్టినా.. ఎంపీలు గెలవడం అనేది బిజెపికి ముఖ్యం.

కేంద్రంలో మోడీ హవా మూడోసారి కూడా మ్యాజిక్ చేస్తుందనే నమ్మకం వారికి ఎంత ఉందో తెలియదు. ఈసారి మళ్లీ అధికారం దక్కాలంలే ఎక్కువగానే చెమటోడ్చాల్సి వస్తుందనే ఆలోచన పార్టీలో ఉంది. ఆ నేపథ్యంలో.. కొత్త ఎంపీసీట్లనుకూడా ఖాతాలో వేసుకోవడానికి వారికి ఇలాంటి నాయకుల చేరికలు ఉపయోగపడతాయి.

పైగా సార్వత్రిక ఎన్నికల కంటె, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముందుగానే వస్తాయి కాబట్టి.. ఈ నాయకులను ఆర్థిక వనరుల పరంగా బాగానే వాడుకోవచ్చు. ఆర్థికంగా ఎంత ఉపయోగపడ్డారు అనేదానిని బేరీజు వేసుకుని.. ఆ తర్వాత ఎంపీ ఎన్నికల సమయంలో వారికిక ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఇలాంటి అనేక లెక్కలతోనే.. తొలిదశలో ఎంపీ కాగల వారికే ప్రాధాన్యం ఇస్తూ చేర్చుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?