మే 23వ తేదీ ఎన్నికల ఫలితాల అనంతరం కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం, మంత్రివర్గం, ఇతర పదవుల పందేరంపై తూర్పు గోదావరి జిల్లాలో రసవత్తర చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా సెంటిమెంట్ జిల్లాలుగా పేరొందిన తూర్పు గోదావరిలో నూతన ఆమాత్యులుగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారన్న విషయం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఏ రాజకీయ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఈ జిల్లాకు పెద్దపీట వేయడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రంలో రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైన ప్రాంతంగా ఈ జిల్లాను పేర్కొంటారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలో సాధారణంగా ముగ్గురు వేర్వేరు సామాజికవర్గాలకు చెందిన నేతలకు మంత్రి పదవులివ్వడం ఆనవాయితీగా వచ్చింది.
2014లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దగ్గర్నుండి చివరివరకు ఇరువురికే మంత్రి పదవులిచ్చింది. 2014లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన నిమ్మకాయల చినరాజప్పకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది. వెనువెంటనే కీలకమైన హోంశాఖను చినరాజప్పకు చంద్రబాబు కట్టబెట్టారు. ఇక సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అసెంబ్లీ సభ్యుడు కాకపోయిన అప్పటికే శాసనమండలి సభ్యుడిగా ఉండటంతో ఆ కోటా కింద ఆర్ధిక, వాణిజ్య శాఖామంత్రిగా నియమితులయ్యారు. అయితే జిల్లాకు చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి మంత్రిపదవి దక్కలేదు. ఈ అవకాశాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొత్తలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పీతల సుజాతకు చంద్రబాబు కల్పించారు.
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గొల్లపల్లి సూర్యారావు, పులపర్తి నారాయణమూర్తి తదితర ఎస్సీ ఎమ్మెల్యేలు ఈ ఐదేళ్ళూ మంత్రిపదవి ఆశించి భంగపడ్డారు. అలాగే కమ్మ సామాజికవర్గానికి చెందిన మాజీమంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి మంత్రి పదవిని ఆశించారు. మంత్రిపదవి రానందుకు అప్పట్లో గోరంట్ల తీవ్రంగా కలత చెందారు. ఓ దశలో చంద్రబాబుపై ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల్లో వైకాపా నుండి ఎమ్మెల్యేగా గెలిచి తరువాత తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతులనెహ్రూ సైతం మంత్రి పదవిని ఆశించారు. అయితే మంత్రిపదవి నెహ్రూకు ఇవ్వకుండా ఆయన కుమారుడు జ్యోతుల నవీన్‌కు జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని ఇచ్చి చల్లబరిచారు.
ఇదిలావుంటే త్వరలో ఏర్పాటు కానున్న ప్రభుత్వంలో ఎవరు మంత్రులు కానున్నారన్న విషయమై ఆయా పార్టీల నాయకులు అంచనాల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారం వచ్చిన పక్షంలో ప్రస్తుత మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడులకు తిరిగి బెర్తులు లభించడం తథ్యమని తెలుస్తోంది. అయితే వీరిద్దరి పోర్ట్‌పోలియోలు మారనున్నాయి. శాసనమండలికి తాజాగా మరోసారి ఎన్నికైన యనమలకు ప్రాధాన్యత గల శాఖనే కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అదనంగా జిల్లా నుండి ఓ ఎస్సీ ఎమ్మెల్యేను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని భోగట్టా.
ఎస్టీ సామాజికవర్గానికి విశాఖ జిల్లాలోనూ, మత్స్యకార సామాజికవర్గానికి కోస్తా జిల్లాలో ఎవరో ఒకరికి మంత్రి పదవులు లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వైకాపా అధికారంలోకి వచ్చిన పక్షంలో దాదాపు పూర్తిగా కొత్త ముఖాలను మంత్రివర్గంలో చూసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం దాడిశెట్టి రాజా, కురసాల కన్నబాబు (కాపు సామాజికవర్గం), పిల్లి సుభాష్ చంద్రబోస్ లేక చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ(బీసీ), పినిపే విశ్వరూప్ (ఎస్సీ)లకు మంత్రి పదవులు లభించే అవకాశాలున్నాయి. అయితే మంత్రి పదవుల ఎంపిక వీరి గెలుపోటములపై ఆధారపడి ఉంటుంది.
అలాగే మంత్రి పదవులతో పాటు పలు కీలకమైన పదవుల పందేరం జరగనున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వంలో ఆయా పదవులు పొందేందుకు నేతలు ఉబలాటపడుతున్నారు. ప్రభుత్వ చీఫ్‌విప్, ప్రభుత్వ విప్, పమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, వివిధ కార్పొరేషన్ ఛైర్మన్లు తదితర కీలకమైన పోస్టులను భర్తీ చేసే అవకాశం కొత్త ప్రభుత్వానికి ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడంలో తాత్సారం వహించింది. పలు కీలక పదవులను చివరిదశలో నేతలకు అవకాశం కల్పించారు.
నూతన రాజధాని అమరావతిలో తగిన వసతి సౌకర్యాలు లేకపోవడం, ఆర్ధిక సమస్యలు, నామినేటెడ్ పోస్టులపై కసరత్తుకు తగిన సమయం కేటాయించే తీరిక చంద్రబాబుకు లేకపోవడం తగిన కారణాలతో ఆశావహులకు న్యాయం జరగలేదు. ఈ విషయంలో తెలుగుదేశం ఆశావహుల్లో అసంతృప్తి నెలకొంది. మరోవైపు వైకాపా అధికారంలోకి వస్తే తమ అధినేత వెనువెంటనే పలు కీలకమైన పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తారన్న విశ్వాసాన్ని పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.