రాజకీయాలకు నిర్వచనం మారిపోయింది. ప్రత్యేకించి గత ఐదేళ్లలో తెలుగునాట రాజకీయాలు అంటే కేవలం అధికారం కోసం మాత్రమే చేసేవి అయ్యాయి. వీటిని ఇలా మార్చిన ఘనత నిజంగా చంద్రబాబు నాయుడుదే. గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు ఎన్నో ఫిరాయింపులు చేయించారు.
ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయాన్ని భ్రష్టు పట్టించారు. తమకు బలంలేకపోయినా, ప్రజలు ఓటు వేయకపోయినా వివిధ జడ్పీ చైర్మన్ సీట్లను, ఎంపీపీ సీట్లను, మున్సిపల్ చైర్మన్ సీట్లను తెలుగుదేశం వాళ్లు సొంతం చేసుకున్నారు. ఆయాచోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లను నెగ్గినా చైర్మన్ పదవులు మాత్రం తెలుగుదేశం సొంతం అయ్యాయి.
అక్కడితో మొదలు.. స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫిరాయింపు రాజకీయాలే రాజ్యం చేశాయి. ఆపై ఎమ్మెల్యేల, ఎంపీల ఫిరాయింపులు మరోఎత్తు. ఇరవైమూడు మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను ఫిరాయింపులకు ప్రోత్సహించారు చంద్రబాబు నాయుడు. బాబు ఆ విషయంలో ఎంతగా ట్రై చేశారంటే. వస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ చేర్చుకోవాలన్నట్టుగా ప్రయత్నించారు.
అలా రాజకీయాన్ని కేవలం అధికారం కోసం ఆడే కమర్షియల్ వ్యవహారంగా మార్చారు తెలుగుదేశం అధినేత. మరి బాబు చూపిన తోవలో నడిచినవారు ఇప్పుడు ఆయనకే ఝలక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారని సమాచారం. ఈసారి ఫలితాల వెల్లడికి ముందే వీరి సంప్రదింపులు మొదలయ్యాయట.
ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెగ్గడం ఖాయమనే అంచనాల మధ్యన పలువురు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే ప్రయత్నాల్లో ఉన్నారని భోగట్టా. ఫలితాలు ఇంకా వెల్లడికి ముందే వీరు జగన్‌తో సంప్రదింపులు మొదలుపెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి.
ప్రత్యేకించి రాయలసీమలోనే ఈ పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనంతపురం జిల్లా నుంచి ఈ ఎన్నికలతో పోటీకి దిగిన ఒక ప్రముఖ రాజకీయ కుటుంబం వారసులు, కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించినవారు.. ఇప్పుడు జగన్‌తో అపాయింట్ మెంట్ కోసం ట్రై చేస్తున్నారని, అవకాశం లభిస్తే చాలన్నట్టుగా వీరి ప్రయత్నాలు సాగుతున్నట్టుగా భోగట్టా. అయితే వీరు గెలిచి వచ్చినా రాజీనామా చేసి రావాలనే జగన్ షరతు ఉండనే ఉందనేమాట కూడా వినిపిస్తోంది!