40 ఏళ్ల అనుభవానికి నాలుగేళ్ల భవిష్యత్ ఉందా?

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు.. కనీసం టీడీపీ కార్యకర్తలకు నాలుగేళ్ల భవిష్యత్ కి భరోసా ఇవ్వలేకపోతున్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనలో పడిపోయారు టీడీపీనేతలంతా. ఓవైపు సర్వేలన్నీ…

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు.. కనీసం టీడీపీ కార్యకర్తలకు నాలుగేళ్ల భవిష్యత్ కి భరోసా ఇవ్వలేకపోతున్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనలో పడిపోయారు టీడీపీనేతలంతా. ఓవైపు సర్వేలన్నీ వైసీపీదే అధికారం అని చెబుతున్నాయి, ఇటుచూస్తే చంద్రబాబు ఈసీ, సీఎస్ లపై గగ్గోలు పెడుతూ జనం దృష్టిలో మరింత చులకన అవుతున్నారు.

అధికారం మాదేనంటూ కొన్నిసార్లు, జూన్ 8వరకు నేనే ముఖ్యమంత్రినంటూ మరికొన్నిసార్లు చెబుతూ.. కార్యకర్తల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. టీడీపీ నేతల్లోనే అధికారంపై ఆశలు లేవని చెప్పడానికి చప్పగా సాగుతున్న చంద్రబాబు ఎన్నికల సమీక్షలే ఉదాహరణలు. ఈ సమీక్షలకు అభ్యర్థులు కాదుకదా, నియోజకవర్గాలకు చెందిన కీలకనేతలు కూడా కొన్ని సందర్భాల్లో హాజరు కావడంలేదు.

చంద్రబాబుకి 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది కాదనలేం. కానీ టీడీపీ భవిష్యత్ ఏంటి అని నాయకులంతా తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు. ఈ దఫా అధికారంలోకి రాకపోతే పార్టీ పరిస్థితి ఏంటి, పార్టీని నమ్ముకున్నవాళ్ల పొలిటికల్ కెరీర్ కి ఎవరు దిక్కు అని వాపోతున్నారు. చంద్రబాబుకి వయసు మీదపడింది, మతిమరుపు, చాదస్తం ఓ రేంజ్ లో ముదిరిపోయాయి. ఎంతకాలం ఇంకా యాక్టివ్ గా ఉంటారో చెప్పలేని పరిస్థితి.

ప్రస్తుతానికైతే చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పడం ఒక్కటే ఆయనకు సాధ్యమవుతున్న పని. మరి ఆయన తర్వాత కనీసం పార్టీ వ్యవహారాలు చక్కబెట్టే నేత ఎవరున్నారు. లోకేష్ ని నమ్ముకుని పార్టీలో ఉండటం అంటే అది తమ రాజకీయ జీవితాన్ని తమ చేతులతో తామే సమాధి చేసుకోవడం అని నేతలకు అర్థమవుతోంది. సరైన నాయకుడు లేకపోతే పార్టీ మనుగడ కష్టం. చంద్రబాబు కూడా క్రమంగా పార్టీపై పట్టు కోల్పోతున్నారనడానికి ఆయన రివ్యూ మీటింగ్ ల హాజరే సాక్ష్యం.

నిజానికి ఇదంతా చంద్రబాబు చేసుకున్న స్వయకృతాపరాధం. పార్టీలో ఎప్పుడూ తను, తన కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నత స్థానాల్లో ఉండేలా చూసుకున్న బాబు.. ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని నిర్మించడంలో పూర్తిగా విఫలమయ్యారు. అదే ఇప్పుడు టీడీపీని ఈ స్థితికి తీసుకొచ్చింది.

పరిటాల వారసుడి గెలుపుపై నమ్మకం లేదా?