కేవలం ఎంటర్ టైన్ మెంట్ మిస్ అవ్వడం వల్లే సుకుమార్ సినిమా వద్దనుకున్నా.. అందుకే అనిల్ రావిపూడితో నెక్స్ట్ సినిమా చేస్తున్నానని వివరణ ఇచ్చాడు మహేష్ బాబు. వరుసగా సీరియస్ మూవీస్, సందేశాత్మక చిత్రాలు చేశానని.. అనీల్ రావిపూడి సినిమాలో ఎంతో ఫన్ ఉంది కాబట్టి అతడి సినిమాకు ఓకే చెప్పానని అంటున్నాడు. అయితే కేవలం చిన్న ఛేంజ్ కోసం, ఫన్ కోసం మహేష్ రిస్క్ చేస్తున్నాడేమో అంటున్నారు క్రిటిక్స్.
గతంలో లాగా ఇప్పుడు కామెడీ కథలు చెప్పి ప్రేక్షకుల్ని నవ్వించడం అంత సులువేం కాదు. జబర్దస్త్ వచ్చిన తర్వాత, ఆ పంచ్ లకు జనం అలవాటు పడ్డాక, సగటు కామెడీ సన్నివేశాలు రాసుకోవడం దర్శక రచయితలకు చాలా కష్టంగా మారింది. అందులోనూ మహేష్ బాబు లాంటి హీరోకి లౌడ్ కామెడీ సెట్టవ్వదు. సైలెంట్ కామెడీ, పంచ్ డైలాగుల కలబోత అవసరం. సరిగ్గా అనిల్ రావిపూడి అలాంటి డైలాగులే రాస్తుంటాడు. కానీ మహేష్ ఇమేజ్, బాడీ లాంగ్వేజ్ కు అవి ఎంతవరకు సెట్ అవుతాయనేది చూడాలి.
ఊహలకందని అంచనాలు మహేష్-అనీల్ రావిపూడి సినిమాకి అడ్డంకిగా మారే ప్రమాదం ఉందని క్రిటిక్స్ అంటున్నారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా అని భారీ అంచనాలు పెట్టుకుని థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు అంతకుమించి చూపించాలి. అప్పుడే వాళ్లు తృప్తి చెందుతారు. సంక్రాంతి బరిలో నిలిచిన ఎఫ్-2 బ్లాక్ బస్టర్ అయింది. కానీ అందులో కామెడీపై ఇప్పటికీ ఓ వర్గం విమర్శలు చేస్తూనే ఉంది. అలాంటి కామెడీనే మహేష్ బాబు సినిమాకు రిపీట్ చేస్తే కష్టమే.
వీటికితోడు, ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్లు మహేష్ కు కలిసిరాలేదు. ఫక్తు కామెడీతో తీసిన ఖలేజా అట్టర్ ఫ్లాప్ అయింది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ ఆగడు కూడా ఫ్లాప్ అయింది. సో.. ఈ అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కడా లైన్ చెడకుండా ఎంటర్ టైన్ చేయగలిగితే మహేష్-అనిల్ కాంబినేషన్ సక్సెస్ అందుకున్నట్టే. లేదంటే మహేష్ మళ్లీ తన పాత రూట్లోకి వచ్చేస్తాడు.