ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా 133 ప్రాంతాల్ని రెడ్ జోన్స్ గా ప్రకటించింది ప్రభుత్వం. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం ప్రకటించిన రెడ్ జోన్స్ లో అత్యధికంగా నెల్లూరులో 30 ఉన్నాయి. కర్నూలులో 22, కృష్ణాలో 16, వెస్ట్ గోదావరి-గుంటూరులో చెరో 12 ప్రాంతాల్ని రెడ్ జోన్లుగా ప్రకటించారు.
కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అధికారులు, పోలీసులు ఈ 133 ప్రాంతాల్ని అష్టదిగ్బంధనం చేస్తారు. మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఈ రెడ్ జోన్లలో ఆంక్షలు మరింత కఠినంగా ఉంటాయి. వైద్యం లాంటి అత్యవసరం తప్పితే ప్రజలు బయటకు రావడానికి వీల్లేదు.
ఈ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన వస్తువులు, నిత్యావసరాలు అన్నింటినీ ప్రభుత్వమే అందిస్తుంది. అన్ని ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్ల వద్ద థర్మల్ స్క్రీనింగ్స్ ఏర్పాటుచేస్తారు. అన్ని రకాల వాహనాల కదలికలతో పాటు ప్రజారవాణాపై పూర్తి నిషేధం అమలవుతుంది. రెడ్ జోన్లతో అనుసంధానమైన అన్ని రకాల మార్గాల్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకుంటారు.12 గంటల్లో రెడ్ జోన్లలో ఉన్న వ్యక్తులందరి వివరాలు సేకరిస్తారు.
మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 381కు చేరింది. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహించిన పరీక్షల్లో.. గుంటూరులో 7, తూర్పులో 5, కర్నూలులో 2, ప్రకాశంలో 2 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ 16 కేసులతో కలుపుకొని కరోనా కేసుల సంఖ్య 381కు చేరింది. ఈరోజు ఎవరూ కొత్తగా డిశ్చార్జ్ అవ్వలేదు.