కరోనా విపత్తు సమయంలో కుట్ర రాజకీయాలు చేయాలని చూస్తోంది తెలుగుదేశం పార్టీ. తన 40ఏళ్ల రాజకీయ అనుభవాన్నంతా రంగరించి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు బాబు. పోనీ ఆయన రెచ్చగొడుతున్నారు సరే.. ప్రభుత్వంలో పనిచేస్తూ… ఆ ప్రభుత్వాన్నే విమర్శించే ఆలోచన అసలు అధికారులకు ఎందుకొస్తుందనేదే అర్థంకాని ప్రశ్న.
కష్టకాలంలో సమస్యలున్నప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే పద్ధతి ఒకటి ఉంటుంది, నిజంగా ఇబ్బందులుంటే పద్ధతి ప్రకారం ప్రభుత్వానికి తెలియజేయాలి, దాన్ని అధిగమించాలి. అప్పటికీ వినని పక్షంలో ఆందోళనబాట పట్టాలి. కానీ ఇక్కడ ఓ పద్ధతి ప్రకారం ప్రభుత్వంపై బురదజల్లడానికి ప్రయత్నిస్తోంది ప్రతిపక్షం. వారి చేతుల్లో పావులుగా మారి తమ పవిత్రమైన వృత్తికే కలంకంగా మారుతున్నారు కొందరు మూర్ఖులు.
నిన్న నర్సీపట్నం మత్తు డాక్టర్ సుధాకర్ కావొచ్చు, నేడు నగరి కమిషనర్ వెంకట్రామిరెడ్డి కావొచ్చు.. ఇద్దరూ టీడీపీ ప్రలోభాలకు లొంగిపోయారు, ప్రభుత్వంపై రెచ్చిపోయారు, చివరకు సస్పెండ్ అయ్యారు. అసలీ కుట్ర రాజకీయం ఎన్నికల కమిషనర్ రమేష్ బాబు నుంచే మొదలైంది. స్వతంత్ర వ్యవస్థలో పనిచేస్తున్నానన్న స్పృహ కూడా కోల్పోయి, చంద్రబాబు తొత్తులా ప్రభుత్వంపై విమర్శలు చేసి నవ్వులపాలయ్యారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్. ఆయన చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అని చెప్పడానికి సందేహమే లేదు.
అయితే ఈ కరోనా సీజన్లోనే అలాంటి కీలుబొమ్మలు, తోలుబొమ్మలు ఒక్కొక్కటే బైటకు రావడం విశేషం. సుధాకర్ అయినా, వెంకట్రామిరెడ్డి అయినా, రేపు.. ప్రభుత్వంపై విమర్శలు చేసే ఇంకెవరైనా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే. ప్రతిపక్షాలు రెచ్చగొట్టొచ్చు కానీ, ప్రభుత్వ అధికారులుగా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటున్న వారు ఎందుకు రెచ్చిపోతున్నామో ఆలోచించుకోవాలి. పోనీ అలా రెచ్చిపోయి విమర్శలు చేసినంత మాత్రాన సమస్యలు పరిష్కారమవుతున్నాయా లేక సస్పెన్షన్ వేటు పడుతోందా అనేది కూడా వారు ఆలోచించుకోవాలి.
కరోనా కష్టకాలంలో రాజకీయాలు, విమర్శలు అన్నీ పక్కనపెట్టి కలసి పనిచేయాలని అందరూ పైకి లెక్చర్లిస్తున్నారు. మరి లోలోపల ఇంత కుట్ర, కుతంత్రం ఎందుకు పెట్టుకున్నట్టు. కరోనా విపత్తుని రాజకీయం చేస్తే టీడీపీకి మైలేజీ రావొచ్చేమో కానీ… వ్యాధి ముదిరితే, ప్రజల్లో భయాందోళనలు పెరిగితే అది మరింత ప్రమాదకరం. కనీసం ఆ స్పృహతోనైనా ఇలాంటి నీఛ రాజకీయాలకు బాబు ఫుల్ స్టాప్ పెట్టాలి.