హీరో న‌గ్నంగా ఫొటోల దిగితే భార్య‌ను తిడతారేంటి!

సోష‌ల్ మీడియా అనేది రెండు వైపులా ప‌ద‌నున్న క‌త్తి. వాస్త‌వానికి ఏ ప‌దేళ్ల కింద‌టో సోష‌ల్ మీడియాలో కాస్తో కూస్తో పాజిటివ్ విష‌యాలు ప్ర‌చారంలోకి వ‌చ్చేవేమో కానీ, దేశంలో ఇంట‌ర్నెట్ విస్తృతం అయ్యాకా… సోష‌ల్…

సోష‌ల్ మీడియా అనేది రెండు వైపులా ప‌ద‌నున్న క‌త్తి. వాస్త‌వానికి ఏ ప‌దేళ్ల కింద‌టో సోష‌ల్ మీడియాలో కాస్తో కూస్తో పాజిటివ్ విష‌యాలు ప్ర‌చారంలోకి వ‌చ్చేవేమో కానీ, దేశంలో ఇంట‌ర్నెట్ విస్తృతం అయ్యాకా… సోష‌ల్ మీడియా హైలెట్ అవుతున్న‌ది వ్యాపారం కోసం, నెగిటివ్ వార్త‌ల‌తో, త‌ప్పుడు ప్ర‌చారాల‌తోనే ఎక్కువ‌గా అనేది వాస్త‌వం.

ఇంట‌ర్నెట్ డాటా చౌక‌గా మారాకా… సోష‌ల్ మీడియాను ఎడాపెడా వాడుతున్నారు జ‌నాలు. ఇది మంచిదే కానీ.. దీని వ‌ల్ల అనేక వ్య‌స‌నాలు అల‌వాట‌య్యాయి. వాటిల్లో ఒక‌టి అవ‌త‌లి వారిని ట్రోల్ చేయ‌డం! ప్ర‌త్యేకించి సెల‌బ్రిటీల‌కు అయితే ఇంట‌ర్నెట్ ఫాలోయింగ్ క్రేజ్ ను ఇచ్చే అంశ‌మే కానీ, ఇదే స‌మ‌యంలో అయిన‌దానికీ కానిదానికీ వారిపై విరుచుకుప‌డుతూ కొన్ని వేల‌, ల‌క్ష‌ల మంది పెట్టే పోస్టులు మాత్రం బాగా చిరాకును క‌లిగించే అంశాలు.

ఒక‌వేళ సోష‌ల్ మీడియా ట్రోలింగ్ ను సీరియ‌స్ గా తీసుకుంటే.. దేశంలోని ఏ సెల‌బ్రిటీ కూడా ఒక్క రాత్రి కూడా ప్ర‌శాంతంగా నిద్ర‌పోలేడు. కొంద‌రు సెల‌బ్రిటీల‌యితే సోష‌ల్ మీడియాకు మ‌రింత తేలిక‌గా టార్గెట్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో ఒక‌రు దీపికా ప‌దుకోన్. 

కొన్నేళ్ల నుంచి దీపిక అంటే.. నెటిజ‌న్ల‌కు బాగా చౌక‌! ఆమెను దూషించ‌డానికి స‌మ‌యం, సంద‌ర్భం ఏమీ అక్క‌ర్లేదంతే. బాలీవుడ్ లో ఎంతో మంది న‌టీమ‌ణులు విప‌రీత‌మైన ఎక్స్ పోజింగ్ చేస్తూ ఉంటారు సినిమాల్లో. అయితే ఆ మ‌ధ్య గెహ‌రాయియెన్ అనే సినిమాలో దీపిక‌ను స్టిల్స్ పై వ‌చ్చిన ట్రోలింగ్ అలాంటిలాంటిది కాదు!

ఇక తాజా గా ఆమె భ‌ర్త ర‌ణ్ వీర్ సింగ్ ఫొటో షూట్ అంశంలో అత‌డిని దూషిస్తున్న వాళ్లు ప‌నిలో ప‌నిగా దీపిక‌ను ల‌క్ష్యంగా చేసుకున్నారు. ర‌ణ్ వీర్ సింగ్ ఏమీ అనామ‌కుడు కాదు. న‌టుడిగా స్టార్. న‌గ్న‌స్టిల్స్ ఇచ్చింది కూడా అత‌డే. ఆ వ్య‌వ‌హారంలో ప్ర‌త్య‌క్షంగా దీపిక‌కు ఎలాంటి సంబంధం లేదు కూడా! అత‌డిని అలా చేయ‌మ‌ని దీపిక పురి కొల్పి ఉంటుంద‌నేది ఆధారం ఏమీ లేదు. 

అత‌డు స్వ‌త‌హాగా స్టార్ అయిన‌ప్పుడు తిట్టాల‌నుకుంటే అత‌డిని ఇష్టానుసారం ట్రోల్ చేసుకోవ‌చ్చు ఆ స్వ‌భావం ఉన్న నెటిజ‌న్లు. అయితే దీపిక‌ను కూడా క‌లిపేసి.. ఆమెపై ఇష్టానుసారం పేలుతుండ‌టం సోష‌ల్ మీడియా దుష్ట‌స్వ‌భావానికి నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది.