మంత్రి పదవికి మించింది లేదా ?

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడే స్పష్టంగా ఒక విషయం చెప్పారు. ఏమిటది ? పాలన సగం పూర్తి కాగానే ఇప్పుడున్న మంత్రుల్లో 90 శాతం మందిని మారుస్తానని అన్నారు. కాబట్టి…

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడే స్పష్టంగా ఒక విషయం చెప్పారు. ఏమిటది ? పాలన సగం పూర్తి కాగానే ఇప్పుడున్న మంత్రుల్లో 90 శాతం మందిని మారుస్తానని అన్నారు. కాబట్టి మంత్రి పదవులు రానివారు బాధపడనక్కరలేదని, రెండున్నరేళ్ల తరువాత వారికి అవకాశం ఉంటుందని చెప్పారు. దీంతో మంత్రి పదవులు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేసినవారు కాస్త చల్లబడ్డారు. ఎలాగైనా అవకాశం దొరుకుతుందనే ఆశతో కాలం గడుపుతున్నారు. అందుకు సమయం ముంచుకొస్తోంది. 

దేశంలో ఎక్కడా లేని విధంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలతో పాటు సామాజిక సమీకరణాల విషయంలో రాజీ పడకుండా అందర్నీ ఒప్పించి సీఎం జగన్ కేబినెట్ కూర్పు చేశారు. దీంతో కేబినెట్‌ బెర్తులపై ఎక్కడా విమర్శలు ఎదురుకాలేదు. అయితే  కొందరు లోలోన మదనపడుతున్నరన్న విషయం గ్రహించిన జగన్.. అప్పట్లో ఎదురైన భారీ పోటీని దృష్టిలో ఉంచుకుని దాదాపు 90 శాతం మంత్రుల్ని రెండున్నరేళ్ల తర్వాత మార్చి వారిస్ధానంలో మరొకరికి చోటిస్తామని హామీ ఇచ్చారు. దీంతో నేతలంతా సరే రెండున్నరేళ్లు ఓపిక పడదామంటూ సర్దుకుపోయారు. 

సీఎం జగన్ చెప్పిన లెక్క ప్రకారం ఈ ఏడాది డిసెంబర్‌లో మరోసారి కేబినెట్‌ మార్పులకు సిద్ధమవ్వాల్సి ఉంది. ఈ కేబినెట్ తోనే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఇప్పుడంతా లెక్కలు వేసుకుంటున్నారు. ఈసారైనా తమకు ఛాన్స్ ఇవ్వాలంటూ అధిష్టానం ముందు లాబీయింగ్ మొదలెట్టారు. మరోవైపు కొందరు మంత్రుల్లో కూడా టెన్షన్ మొదలైంది. తమ పదవులు సురక్షితంగా ఉంటాయా, ఉండవా అని  లెక్కలు వేసుకుంటున్నారు.

ఎన్నికల ముందు సీఎం జగన్ పాదయాత్ర సందర్భంగా పలువురు నేతలకు మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. స్ధానిక సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేలుగా గెలవని వారికి, అవకాశాలు దక్కనివారికి కూడా మంత్రుల్ని చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. దీంతో వారంతా మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. వీరితో పాటు సీనియార్టీ, ఇతర సమీకరణాలు కలిసొస్తున్నా తొలి విడతలో మంత్రులు కాలేకపోయినా వారు కోసం కేబినెట్ బెర్తుల కోసం ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈసారి కూడా కేబినెట్‌ ఆశావహుల సంఖ్య భారీగానే కనిపిస్తోంది.

మొదటి విడతలో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నకొందరికి జగన్ వేరే పదవులు ఇచ్చారు. వాస్తవానికి అవి మంత్రి పదవులతో సమానమైనవి కూడా. అయినా వారిలో అసంతృప్తి గూడు కట్టుకొని ఉంది. వారికి అప్పగించిన పదవులను చాలా భారంగా నిర్వహిస్తున్నారని అనిపిస్తోంది. వారు కూడా మంత్రి పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కీలక పదవుల్లో ఉన్నముగ్గురు మంత్రి పదవుల మీద ఆశ పెట్టుకున్నారు. 

వారెవరంటే…ఏపీ ఐఐసీసీ చైర్ పర్సన్ రోజా, స్పీకరు తమ్మినేని సీతారాం, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి. జగన్ అధికారంలోకి రాగానే రోజాకు మంత్రి పదవి గ్యారంటీ అనుకున్నారు. ఇదే విషయం కూడా సోషల్ మీడియాలోనూ విపరీతంగా ప్రచారమైంది. రోజాకు హోమ్ మంత్రి ఇస్తారని కూడా అనుకున్నారు. కానీ సామాజిక సమీకరణాల్లో రోజాకు దెబ్బ తగిలింది. 

జగన్ వేసుకున్నలెక్కల ప్రకారం ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేకపోయాడు. మంత్రి పదవి ఇవ్వకపోయేసరికి రోజాకు కోపం వచ్చింది. కొన్నాళ్ళు జగన్ కు, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంది. చివరకు జగన్ అతికష్టం మీద రోజాను కన్విన్స్ చేసి ఏపీ ఐఐసీసీ చైర్ పర్సన్ పదవి అప్పగించాడు. కానీ ఆ పదవిలో రోజా ఉందనే సంగతి ఏపీ జనాలకు తెలిసుండకపోవచ్చు. 

ఎందుకంటే ఆమె ఉండేది హైదరాబాద్ లో, నిరంతరం కనిపించేది టీవీ షోలలో. జబర్దస్త్ కార్యక్రమంలో పగలబడి నవ్వడం, డ్యాన్సులు చేయడం…ఇదే ఆమె ప్రధాన వ్యాపకం. పార్టీలో  ఉన్నానని చెప్పడం కోసం అప్పుడప్పుడూ చంద్రబాబు నాయుడిని, లోకేష్ ను బూతులు తిట్టడం. 

ఇక తమ్మినేని సీతారాం స్పీకర్ గా ఉన్నా ఏనాడు ఆ పదవికి ఉన్న గౌరవాన్ని నిలబెట్టలేదు. ఆయన స్పీకర్ గా ఉన్నా మంత్రుల మాదిరిగానే మాట తూలుతుంటారు. నిజానికి ఆయనకు స్పీకర్ పదవి కంటే మంత్రి పదవే బెటర్. ఏదైతే బాగా ఎంజాయ్ చేయొచ్చు.

ఇక టీటీడీ చైర్మన్ కావడమనేది పూర్వ జన్మసుకృతమని కొందరు నాయకులు భావిస్తుంటారు. కానీ వైవీ మంత్రి పదవి మీదనే మోజు ఎక్కువని అంటున్నారు. మరి ఈ ముగ్గురిలో మంత్రి పదవి ఎవరికీ దక్కుతుందో చూడాలి. ముగ్గురిలో ఒకరు మంత్రి అవుతారా? ముగ్గురూ అవుతారా ? మంత్రి పదవుల మీద వీరికి ఆశ ఎందుకంటే రోజూ జనాలతో ఇంటారాక్ట్ కావొచ్చని అనుకుంటున్నారేమో. అలాగే స్వేచ్ఛగా ప్రతిపక్షాలను తిట్టొచ్చు. 

తొలి విడత కేబినెట్‌ విస్తరణ తర్వాత పిల్లిసుభాష్ చంద్రబోస్‌, మోపిదేవి ఎంపీలు కావడంతో మధ్యలో మంత్రులుగా వచ్చిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సిదిరి అప్పలరాజు స్థానాలు ప్రస్తుతానికి సేఫ్ అనే చెప్పాలి. వీరితో పాటు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, అనిల్‌ యాదవ్, కన్నబాబు, కొడాలి నాని, అవంతి శ్రీనివాస్‌, సుచరిత, బుగ్గన స్ధానాలు సేప్‌ అని తెలుస్తోంది. 

ప్రస్తుతం ఆయా జిల్లాల్లో రాజకీయ పరిస్థితులు.. సామాజిక సమీకరణాల లెక్కన వీరంతా సేఫ్ గా ఉన్నారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మిగిలిన వారి విషయంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.