ఇప్పటివరకు ఈ ఆలోచన ఎవ్వరికీ రాలేదు. కానీ మంత్రి కొడాలికి మాత్రం వచ్చింది. నిజంగా లోకేష్ కు అన్న, తమ్ముడు లేదా అక్క-చెల్లెలు ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు కొడాలి నాని. వాళ్లే కనుక ఉండుంటే, ఏపీ ప్రజలకు ఓ పెద్ద నరకం తప్పి ఉండేదని అన్నారు.
“లోకేష్ కోటలో ఉన్నా ఒకటే పేటలో ఉన్నా ఒకటే. పేటలో ఉంటే ఏం చేస్తాడో, కోటలో కూడా అదే చేస్తాడు. లోకేష్ చెప్పే మాటలకు, అతడి హావభావాలకు ఏమాత్రం సింక్ ఉండదు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తి, జగన్ ను విమర్శిస్తున్నాడు.
తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి లోకేష్ ను ఆ పార్టీ భరిస్తోంది. ఎవ్వడూ లేడు కాబట్టి చచ్చినట్టు ప్రమోట్ చేస్తున్నారు. కనీసం తమ్ముడో, అన్నో, చెల్లెలో ఉంటే ఈపాటికి లోకేష్ ను ఇంట్లో ఓ మూల కూర్చోబెట్టేవారు. చంద్రబాబుకు పట్టిన ఖర్మ లోకేష్.”
ఇలా లోకేష్ పై వెరైటీగా విరుచుకుపడ్డారు మంత్రి కొడాలి నాని. జగన్ కు దమ్ము లేదంటున్న లోకేష్.. ఇంటికెళ్లి వాళ్ల నాన్న చంద్రబాబును అడిగితే, జగన్ దమ్మేంటో తెలుస్తుందన్నారు నాని. జగన్ దమ్ముకు చంద్రబాబు ఇంట్లో కూర్చున్నారని, లోకేష్ లూజ్ బ్రెయిన్ కు ఇంకా ఆ విషయం అర్థంకావడం లేదన్నారు. లోకేష్ ను చూస్తుంటే, చంద్రబాబుకు వెన్నుపోటు గుర్తొస్తోందని విమర్శించారు.
“కత్తితో తిరిగేవాడు కత్తితోనే పోతాడని అంటున్నాడు లోకేష్. ఇన్నాళ్లూ చంద్రబాబు కత్తితోనే తిరిగాడు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచాడు. తనను ఎక్కడ వెన్నుపోటు పొడుస్తాడోనని, లోకేష్ ను ఇంట్లోంచి తరిమేసి, ఫామ్ హౌజ్ లో కూర్చోబెట్టాడు. చంద్రబాబు జూబ్లిహిల్స్ లో ఉంటే, లోకేష్ ను ఫామ్ హౌజ్ లో ఉంటున్నాడు. లోకేష్ తనను వెన్నుపోటు పొడుస్తాడని బాబు భయం.”
జగన్ ప్రజాబలం, నిగ్రహ శక్తి, మంచితనం ముందు చంద్రబాబు ఏ మూలకు పనికిరారన్నారు కొడాలి నాని. ఇకనైనా లోకేష్ తన వాగుడు కట్టిపెట్టి, ఎమ్మెల్యేగా గెలవడం ఎలాగో ఆలోచించుకుంటే మంచిదని హితవు పలికారు.