గతంలో అధిష్టానంపై తిరుగుబాటు చేసి కాషాయ జెండాపై ఎర్రజెండాను ఎగరేసిన కర్ణాటక సీనియర్ పొలిటీషియన్ ఈ సారి తెల్ల జెండా చూపుతున్నారు. ఇటీవలే యడియూరప్పను బీజేపీ హై కమాండ్ సీఎం సీటు నుంచి దించేసింది.
ఇప్పుడు ఆయనకు మరింత గట్టి ఝలక్ ఇచ్చింది. యడియూరప్ప సీఎంగా ఉన్నప్పుడు అంతా తానై రాజకీయం చేసిన ఆయన తనయుడు విజయేంద్రకు బీజేపీ హై కమాండ్ ఎమ్మెల్సీ టికెట్ నిరాకరించడం సంచలనం రేపింది. ఈ అంశంపై యడియూరప్ప స్పందిస్తూ.. తెల్ల జెండా చూపారు.
తన రాజకీయ వారసుడికి బీజేపీ ఎమ్మెల్సీ టికెట్ ను నిరాకరించిన, వేరే బాధ్యతలు ఇస్తుందంటూ యడియూరప్ప సన్నాయి నొక్కులు నొక్కారు. తద్వారా ఇప్పుడు తనది తిరుగుబాటు కాదు రాజీనే.. అనే సంకేతాలను ఈ సీనియర్ పొలిటీషియన్ ఇచ్చినట్టుగా అయ్యింది.
యడియూరప్ప రాజకీయానికి అధిష్టానం ఇలా మరో చెక్ పెట్టింది. యడియూరప్ప తనయుడికి ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోవడం కన్నడ రాజకీయాల్లో సంచలనమే. పార్టీ బలం పరంగానే కాకుండా, లింగాయత్ ల నుంచి ఉన్న గట్టి మద్దతుతో యడియూరప్ప రాజకీయ శక్తిగా ఎదిగారు. తనను కాదని పక్కన పెట్టిన బీజేపీకి కన్నడనాట ఓటమి రుచి చూపించేలా చేసిన నేపథ్యం కూడా యడియూరప్పకు ఉంది.
అక్కడకూ 77 యేళ్ల వయసులో యడియూరప్పను బీజేపీ హై కమాండ్ సీఎంగా చేయక తప్పలేదు. అయితే అవినీతి అని, ఆయన తనయుడు విజయేంద్ర అసలు సీఎంగా చలామణి అవుతున్నాడనే ఆరోపణలతో బీజేపీ అధిష్టానం సీనియర్ లింగాయత్ నేతను సీఎం పదవి నుంచి దించేసింది. మరో లింగాయత్ నే సీఎంగా చేసింది. ఆయన కూడా పాలనపై పట్టు దొరకక ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. అది వేరే కథ.
అయితే యడియూరప్ప చక్రానికి కమలం పార్టీ అధిష్టానం పూర్తిగా అడ్డు పుల్ల వేయడానికే కంకణం కట్టుకున్నట్టుగా ఉంది. తండ్రి సీఎంగా ఉన్నప్పుడు తనే సీఎం అన్నట్టుగా చలామణి అయిన విజయేంద్రకు చివరకు ఎమ్మెల్సీగా కూడా అవకాశం ఇవ్వలేదు. దీంతో యడియూరప్పకు బీజేపీ అధిష్టానం స్పష్టమైన సంకేతాలనే ఇచ్చినట్టుగా ఉందని స్పష్టం అవుతోంది.