దేశంలోని వివిధ లోక్ సభ, అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం మూడు లోక్ సభ స్థానాలకూ, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. వీటికి ఈ నెల 30వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది.
నామినేషన్ల దాఖలుకు జూన్ ఆరో తేదీ చివరి తేదీ. ఏడో తేదీన నామినేషన్ల పరిశీలన జరగనుంది. తొమ్మిదో తేదీతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియనుంది.
లోక్ సభ స్థానాల్లో .. యూపీలో రెండు, పంజాబ్ లో ఒక సీటుకు ఉప ఎన్నిక జరగనుంది. అసెంబ్లీ స్థానాల్లో త్రిపురలో నాలుగు, ఏపీ, ఢిల్లీ, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి చొప్పున ఉప ఎన్నిక జరగనుంది. వీటిల్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉంది.
ఇటీవలే మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల విషయంలో రాజకీయ పార్టీలు ఇప్పటి వరకూ పెద్దగా స్పందించింది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేకపాటి విక్రమ్ ను అభ్యర్థిగా దాదాపు నిర్ణయించింది.
తెలుగుదేశం పార్టీ ఈ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకునే పరిస్థితుల్లో లేదు. పోటీ నుంచి ఆ పార్టీ తప్పుకున్నా పెద్ద ఆశ్చర్యం లేదు. జనసేన కూడా అదే బాటన పయనించే అవకాశం ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించే అవకాశాలున్నాయి. జూన్ ఇరవై ఆరున ఈ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.