ఇప్పటికే తన ప్రేమకథలతో పలు సార్లు వార్తల్లో నిలిచిన నటి శ్రుతి హాసన్ పెళ్లి గురించి ఒకింత విముఖతతో స్పందించింది. ప్రస్తుతం కూడా శ్రుతి ఒక ప్రేమ కథను నడిపిస్తూ ఉంది. ఈ తరుణంలో పెళ్లి ఆలోచన ఉందా? అంటే.. ఆ ఆలోచన తనను ఆందోళనకు గురి చేస్తోందని అంటోంది! పెళ్లి అంటే తను కొంత ఆందోళనకు గురి అవుతున్నట్టుగా శ్రుతి చెప్పడం గమనార్హం.
ఇంతకీ ఆ ఆందోళన ఎందుకు? అనే అంశంపై ఆమె స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. శ్రుతి తల్లిదండ్రులు తమ వైవాహిక బంధాన్ని తెంచుకున్న నేపథ్యంలో, బహుశా ఆ కారణం చేతనా? అనే ప్రశ్నను శ్రుతి కొట్టి పడేసింది. కమల్, సారికలు సహజీవనంతో మొదలుపెట్టి, పిల్లలు కలిగాకా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారు విడిపోయారు. తన జీవితంలో పెళ్లి అంశంపై తమ తల్లిదండ్రుల విడాకుల ప్రభావం లేదని అంటోంది శ్రుతి.
తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నప్పటికీ.. వారు కలిసి ఉన్నంత సేపూ చాలా ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని గడిపారని అంటోంది శ్రుతిహాసన్. విడాకులు తీసుకుంటే తీసుకున్నారు కానీ, వారి మ్యారేజ్ లో ఎన్నో గొప్ప రోజులున్నాయనేది శ్రుతి హాసన్ చెప్పే మాట. తన తల్లిదండ్రుల వివాహానికి సంబంధించి తను పాజిటివ్ సైడ్ నే చూస్తానంటూ కమల్ తనయ వివరించింది.
పెళ్లిపై తను నర్వస్ కావడానికి కారణం తల్లిదండ్రుల విడాకులు అయితే కాదని శ్రుతి కుండబద్ధలు కొడుతోంది. స్థూలంగా శ్రుతి హాసన్ పెళ్లిపై పెద్ద ఆసక్తిని చూపడం లేదు. ఒకవైపు బాలీవుడ్, టాలీవుడ్ లలో పలువురు హీరోయిన్లు ఒక్కొక్కరుగా వివాహంతో వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నా.. శ్రుతి మాత్రం అలాంటి ఆసక్తినేమీ ప్రదర్శించడం లేదు.