ఐటీ శాఖా మంత్రి హోదాలో ఉండిన మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో అనివార్యం అయిన ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు షెడ్యూల్ రానే వచ్చింది. ఈ ఉప ఎన్నిక విషయంలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని దాదాపు రెడీ చేసుకుంది. గౌతమ్ రెడ్డి సోదరుడే అయిన మేకపాటి విక్రమ్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నిక బరిలో దించడం ఖాయంగా కనిపిస్తూ ఉంది.
గౌతమ్ వలే మృదు స్వభావి అనే పేరుంది విక్రమ్ రెడ్డికి కూడా. ఈ నేపథ్యంలో సోదరుడి రాజకీయ పంథాలో మరో మంచి నేతే ఆత్మకూరు నియోజకవర్గానికి లభించవచ్చు కూడా. ఆత్మకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం లాంఛనమే. అయితే అది ఏకగ్రీవం అవుతుందా లేక పోటీ తప్పదా.. అనేది చర్చనీయాంశం.
ఏపీలో ఉప ఎన్నికలను ప్రధాన పార్టీలు ఏకగ్రీవం పట్ల సానుకూలంగా తీసుకెళ్తున్నా.. ఉన్నాయో లేవో అనిపించే పార్టీలు మాత్రం వీటిల్లోకి దిగుతున్నాయి. ప్రజల్లో కూడా అనాసక్తి ఉన్న ఉప ఎన్నికల విషయంలో కాంగ్రెస్, బీజేపీలు రచ్చ చేస్తున్నాయి.
ఈ పార్టీలో బరిలోకి దిగి కూడా.. పెద్దగా సాధించేది ఏమీ ఉండదు. అయినప్పటికీ.. తమ పరువు పోగొట్టుకోవడానికి అన్నట్టుగా ఈ పార్టీలు ఉబలాటపడుతూ ఉంటాయి. తిరుపతి లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నిక విషయంలో బీజేపీ ఇలానే భంగపడింది. జనసేనను చూసుకుని.. వాపు కూడా లేకపోయినా బలుపు అనుకుని బీజేపీ తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో పరువు పోగొట్టుకుంది.
ఇప్పుడు ఆత్మకూరు విషయంలో కూడా కాంగ్రెస్, బీజేపీలు వెనక్కు తగ్గే అవకాశాలు ఉండకపోవచ్చు! తన పార్టీ బాగా పుంజుకుందంటున్న చంద్రబాబు నాయుడు ఆత్మకూరు బరిలో అభ్యర్థిని పెట్టే అవకాశాలు దాదాపు ఉండవు. అయితే బీజేపీ, కాంగ్రెస్ లు మాత్రం ఐదారు వేల ఓట్ల లోపు కోసం ఆత్మకూరు ఉప ఎన్నికను పోలింగ్ వరకూ తీసుకెళ్లే అవకాశాలున్నట్టే!